ఆదిలాబాద్(నమస్తే తెలంగాణ)/నిర్మల్ చైన్‌గేట్, జూలై 27 ; ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ మీటింగ్ హాల్లో కలెక్టర్ రాజర్షి షా అర్జీలు స్వీకరించారు. ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు, భూ భారతి, అటవీ భూముల పట్టాలు, ఉపాధ్యాయుల కొరత, ఇతర సమస్యలపై 97 అర్జీలు వచ్చాయి. నిర్మల్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ భవేశ్‌మిశ్రా అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమాల్లో ఆయా జిల్లాల అడిషనల్ కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయుడిని నియమించండి..
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని కజ్జర్ల ఎంపీపీఎస్‌లో ఉపాధ్యా యుడిని నియమించాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ప్రజావాణిలో కలెక్టర్ ను కలిసి వినతిపత్రం అందించారు. పాఠశాలలో 56 మంది విద్యార్థులు ఉండగా.. ఉపాధ్యాయులు లేక చదువుకోలేకపోతున్నారని తెలిపారు. సర్దుబా టులో భాగంగా ఒక ఉపాధ్యాయుడిని వేరే పాఠశాలకు పంపించారని, ఆయన స్థానంలో ఇతర ఉపాధ్యాయులను నియమించలేదని తెలిపారు. ఉపాధ్యాయుడి నియామకం కోసం అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
అటవీ భూములకు పట్టాలివ్వాలి..
ఏండ్లుగా సాగు చేసుకొంటున్న అటవీ భూములకు ప్రభుత్వం పట్టాలు అందేలా చర్య లు తీసుకోవాలంటూ ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలంలోని కునికాస కొలాంగూడ గిరిజనులు ప్రజావాణిలో కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందించారు. గ్రామంలో 50 మంది గిరిజనులు భూములు సాగు చేసుకుంటూ ఉపాధి పొందుతున్నారని, పట్టాలు లేకపోవడంతో ప్రభుత్వ పథకాలు అందడం లేదని తెలిపారు. పంటలను మద్దతు ధరతో అమ్ముకోలేక పోతున్నామని, బ్యాంకు రుణాలు అందక ఇబ్బందులు పడాల్సి వస్తుందని విన్నవించారు.
కోత విధించిన డబ్బులు ఇవ్వాలి..
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో పంటను విక్రయించినా.. తమకు మొత్తం డబ్బులు అందలేదని ఆదిలాబాద్ జిల్లా సాత్నాల మండలంలోని మేడిగూడ రైతులు కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో తాము 16 వేల క్వింటాళ్ల పంటను విక్రయించగా.. కాంటా చేసిన జొన్నలకు పట్టీలు ఇచ్చారని తెలిపారు. పట్టీల్లో సూచించిన విధంగా డబ్బులు రావడం లేదని, ఒక్కో రైతుకు 50 కిలోలు, అంతకంటే ఎక్కువ పంటకు కోతలు విధిస్తూ జమ చేస్తున్నారన్నారు. ఈ విషయంలో కొనుగోలు కేంద్రం నిర్వాహకులను అడిగితే తమకు నష్టం వచ్చినందు వల్ల రైతుల పంటలో కోత విధిస్తున్నట్లు చెప్పారని తెలిపారు. పంటకు సరిపడా డబ్బులు వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
డబుల్ బెడ్రూం పనులు పూర్తి చేయాలి
నిర్మల్ పరిధిలోని సిద్ధాపూర్లో గల డబుల్ బెడ్రూం నిర్మాణం పనులు త్వరితగతిన పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ లబ్ధిదారులు కలెక్టర్ కార్యాలయానికి తరలివచ్చారు. గత ప్రభుత్వం హయాంలో తమకు ఇండ్లు కేటాయించిందని, టోకెన్లు ఇచ్చారని పేర్కొన్నారు. దాదాపు రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా తమకు ఇండ్లు కేటాయించలేదన్నారు. ప్రస్తుతం కిరాయి ఇండ్లలో ఉంటున్నామన్నారు. నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసి తమకు కేటాయించాలని కలెక్టర్‌ను కోరారు.
బెస్ట్ అవైలెబుల్ పాఠశాలను మార్చాలని వినతి
నిర్మల్ పట్టణంలోని వశిష్ట స్కూల్ బెస్ట్ అవైలెబుల్ పాఠశాలకు ఎంపిక చేయగా, పాఠశాల యాజమాన్యం నిబంధనలు పాటించడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు నిర్మల్ కలెక్టర్ కార్యాలయానికి తరలివచ్చి ఆందోళన నిర్వహించారు. విద్యార్థులకు ఉచితంగా అందించాల్సిన పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు అందించడం లేదన్నారు. పాఠశాలలో విద్యార్థులకు వసతులు కల్పించడం లేదని, చదువులకు ఆటంకం కలిగే ఆస్కారం ఉందని పేర్కొన్నారు. ఈ పాఠశాల నుంచి వేరే పాఠశాలకు మార్చాలని కలెక్టర్‌ను కోరారు.