హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): దేశంలో చెత్త ద్వారా అత్యధిక విద్యుదుత్పత్తి చేసే దిశగా తెలంగాణ మున్సిపల్ శాఖ కసరత్తు చేస్తున్నది. చెత్త నుంచి 100 మెగావాట్ల విదుత్తును ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నది. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలకు అనుగుణంగా అధికారులు ప్రణాళిక సిద్ధం చేసి అమలు చేస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చెత్త నుంచి 522 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేస్తున్నారు. తెలంగాణలో 48 మెగావాట్ల సామర్థ్యంతో వేస్ట్ టు ఎనర్జీ (డబ్ల్యుటీఈ) ప్లాంట్లను ఏర్పాటు చేయడంలో రాష్ట్ర మున్సిపల్ శాఖ ముందున్నది. చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకడంతో పాటు విద్యుత్తు కూడా ఉత్పత్తి కానున్నది..
జవహర్‌నగర్ ప్లాంట్‌లో 19.8 మెగావాట్ల సామర్థ్యంతో 2021 ఆగస్టు నుంచి విద్యుదుత్పత్తి చేస్తున్నారు. దీని సామర్థ్యాన్ని ఇప్పుడు 48 మెగావాట్లకు పెంచారు. జనవరి చివరి నాటికి 6.35 లక్షల టన్నుల చెత్తను వినియోగించారు. ఇప్పటివరకు 225 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో దుండిగల్‌లో మరో 14.5 మెగావాట్ల పవర్‌ప్లాంట్ ఉత్పాదన ప్రారంభమవుతుంది. ఇక్కడ ప్రతీరోజు 1,200 టన్నుల చెత్తను వినియోగించేందుకు ప్రణాళికను సిద్ధం చేశారు. సంగారెడ్డి జిల్లా ప్యారానగర్లో 150 ఎకరాల్లో 15 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి కోసం చర్యలు తీసుకొంటున్నారు. యాదాద్రి జిల్లా బీబీనగర్‌లో 11 మెగావాట్లు, రంగారెడ్డి జిల్లా యాచారంలో 14 మెగావాట్ల కెపాసిటీతో కొత్తగా వేస్ట్ టు ఎనర్జీ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. బయోమైనింగ్ ద్వారా 10 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేయనున్నారు. 100కిపైగా మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుందని అధికారులు తెలిపారు. వరంగల్, కరీంనగర్‌లోని చెత్తను ప్లాంట్లకు తరలిస్తారు.