హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో మూడో డిస్కమ్ ఏర్పాటు చేయాలన్న సర్కార్ నిర్ణయంపై విద్యుత్తు ఉద్యోగుల నుంచి వ్యతిరేకత ఎదురవుతున్నది. రైతు డిస్కమ్ ఏర్పాటు నిర్ణయాన్ని విద్యుత్తు ఇంజినీర్లు, ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మూడో డిస్కమ్ ఏర్పాటును పునఃపరిశీలించాలని తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ(టీజీ పీఈజేఏసీ) సోమవారం విద్యుత్తు సంస్థల సీఎండీలను కలిసి డిమాండ్ చేసింది. ఇంజినీర్లు, ఉద్యోగల సంఘాలతో కూడిన జేఏసీ పలు అభ్యంతరాలు వ్యక్తంచేసింది. పలు అనుమానాలు నివృత్తిచేయాలని డిమాండ్ చేసింది.