కరువు సీమ కన్నీళ్లు తుడిచేలా కృష్ణమ్మ బిరబిరా తరలిరానున్నది. బీళ్లకు నీళ్లందించేందుకు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పరుగు పరుగున పూర్తికానున్నది.
పాలమూరు-రంగారెడ్డి పర్యావరణ అనుమతులకు నిపుణుల కమిటీ ఆమోదముద్ర వేసింది. ఇది రాష్ట్ర ప్రభుత్వ పట్టువిడువని ప్రయత్నానికి తోడైన ఫలితం.
ప్రాజెక్టుల నిర్మాణంలోనే కాదు, అనుమతుల సాధనలోనూ సాటిలేని రాష్ట్రం తెలంగాణ. ఇది మన జలశక్తి. ఇది ప్రభుత్వ చిత్తశుద్ధి.
ఎన్ని అవాంతరాలు? ఎన్ని అడ్డంకులు? ఎన్ని వేదికలపై ఎన్నెన్ని కుట్రలు? చెక్కుచెదరని జలసంకల్పంతో ఛేదించింది తెలంగాణ.
హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ సర్కారు మరో అపూర్వ, చారిత్రక విజయాన్ని సాధించింది. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణమేకాకుండా, అనుమతుల సాధనలోనూ సాటిలేని మేటి రాష్ట్రంగా నిలిచింది. పాలమూరు బిడ్డల దశాబ్దాల కలను సాకారం చేసింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులను సాధించింది. ఈ మేరకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ పరిధిలోని ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ (ఈఏసీ) కేంద్ర జల్‌శక్తిశాఖకు సిఫారసు చేయగా, అనుమతులు ఇక లాంఛప్రాయమే కావడం విశేషం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి పర్యావరణ అనుమతుల కోసం తెలంగాణ ప్రభుత్వం 34వ ఈఏసీ సమావేశం నుంచి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది.
ఈఏసీ సభ్యులు సందేహాలను లేవనెత్తుతూ, నివేదికలను కోరుతూ వాయిదా వేస్తూ వచ్చారు. ఒక దశలో ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతుల మంజూరును సైతం తిరస్కరిస్తూ ప్రాజెక్టు ప్రతిపాదనలను పక్కనపెట్టింది. అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం మొక్కవోని దీక్షతో ఈఏసీ కోరిన విధంగా సంబంధిత డాటాను సమర్పించింది. దీంతో ఎట్టకేలకు ఈ ఏడాది జూన్ 27న నిర్వహించిన ఈఏసీ 48వ సమావేశంలోనే పాలమూరు ప్రాజెక్టు ప్రతిపాదనలపై సుదీర్ఘమైన చర్చ కొనసాగింది. అయిప్పటికీ ఈఏసీ సభ్యులు పలు అంశాలపై పూర్తి వివరాలను ఇవ్వాలని కోరుతూ అనుమతుల మంజూరును పెండింగ్‌లో పెట్టారు. దీంతో గత నెల 24న నిర్వహించిన 49వ ఈఏసీలో మరోసారి తెలంగాణ సర్కారు తరఫున తెలంగాణ రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ వాదనలు వినిపించారు.
ప్రాజెక్టు నిర్మాణ ఆవశ్యకతను బలంగా నొక్కి చెప్పారు. ప్రాజెక్టుకు త్వరితగతిన పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని, కరువు పీడిత ప్రాంతాల దాహార్తిని తీర్చాలని ఈఏసీకి తెలంగాణ సర్కారు గతంలో విజ్ఞప్తి చేసింది. అయితే ప్రాజెక్టు పర్యావరణ ప్రభావ అంచనాలను సమర్పించాలని ఈఏసీ గతంలో తెలంగాణకు సూచించింది. ఈ నేపథ్యంలో ఇటీవలే ఇరిగేషన్ అధికారులు అందుకు సంబంధించిన నివేదికలను సైతం ఈఏసీకి అందజేశారు. వాటన్నింటిపై సంతృప్తి వ్యక్తం చేసిన ఈఏసీ ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేయాలని కేంద్రానికి సిఫారసు చేయడం విశేషం. ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని ఈఏసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇంజినీరింగ్ అధికారులతోపాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు సంబురాలు చేసుకొంటున్నారు.
తెలంగాణకు ఇది చారిత్రక విజయం : సీఎం కేసీఆర్
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు మంజూరుకు ఈఏసీ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. పథకం తొలిదశ పనులు తుదిదశకు చేరుకొన్న తరుణంలో పర్యావరణ అనుమతులు సైతం మంజూరు కానుండటంపై ఆనందం వ్యక్తం చేశారు. ఈసీ రాకతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాతోపాటు రంగారెడ్డి జిల్లాలో 12.30 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే రెండో దశ పనులు కూడా చకచకా ముందుకు సాగే అవకాశం ఏర్పడిందని సంతోషం వ్యక్తం చేశారు. ఎన్నో కేసులను ఎదుర్కొని, మరెన్నో అడ్డంకులను అధిగమించి అనుమతులు సాధించామని, ఇది తెలంగాణ సాధించిన మరో అద్భుత, చారిత్రక విజయమని సీఎం కేసీఆర్ అభివర్ణించారు. ప్రాజెక్టుల నిర్మాణమే కాకుండా, అనుమతుల సాధనలోనూ తెలంగాణ ప్రభుత్వం మరోసారి సాటిలేదని నిరూపించుకొన్నదని తెలిపారు. ఇది తెలంగాణ సరారు సంకల్పానికి నిలువెత్తు నిదర్శమని పేర్కొన్నారు. కృష్ణమ్మ నీళ్లను తెచ్చి పాలమూరు బిడ్డల పాదాలు కడిగే రోజు ఆసన్నమైనదని తెలిపారు. పాలమూరుకు పర్యావరణ అనుమతుల సాధనకు కృషి చేసిన సాగునీటిశాఖ ఇంజినీరింగ్ అధికారులను అభినందించారు.
తుదిదశకు మొదటి దశ.. త్వరలోనే ప్రారంభానికి సన్నాహాలు
తెలంగాణ ప్రభుత్వం పీఆర్ఎల్ఐఎస్ మొదటిదశలో చేపట్టిన తాగునీటి సరఫరాకు సంబంధించిన పనులన్ని ఇప్పటికే దాదాపుగా తుదిదశకు చేరుకోవడం విశేషం. ఆగస్టు చివరి నాటికి ఎత్తిపోతలను ప్రారంభించాలనే లక్ష్యంతో అధికారయంత్రాంగం ముందుకు సాగుతున్నది. నాగర్‌కర్నూలు జిల్లా శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి ప్రాజెక్టు పనులను మొత్తంగా 21 ప్యాకేజీలుగా విభజించగా, కేపీ లక్ష్మీదేవిపల్లి మినహా ప్రస్తుతం 18 ప్యాకేజీల పనులను మాత్రమే ప్రభుత్వం చేపట్టింది. ఆ ప్రస్తుతం ఆయా ప్యాకేజీల పనులన్నీ దాదాపు తుదిదశకు చేరుకొన్నాయి. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు నిర్దేశిత గడువులోగా మొదటి దశలో భాగంగా తాగునీటి ఎత్తిపోతలను ప్రారంభించడమే లక్ష్యంగా అధికారయంత్రాంగం సన్నాహాలు చేస్తున్నది. అప్రోచ్ చానళ్లు, పంప్‌హౌస్‌లు, సర్జ్‌పూల్‌లు, సొరంగాలు, రిజర్వాయర్లు, కాలువల నిర్మాణం పనులతోపాటు సబ్ స్టేషన్ల నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి. మొదటి దశ పనులు పూర్తయితే మొత్తంగా 16 నియోజకవర్గాలకు తాగునీరు అందనున్నది. నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, కొడంగల్, నారాయణపేట, మక్తల్, దేవరకద్ర, జడ్చర్ల, కల్వకుర్తి, అచ్చంపేట, పరిగి, వికారాబాద్, తాండూర్, చేవేళ్ల, షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, రాజేంద్రనగర్, దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల్లోని 70 మండలాల్లో 1,546 నీటికుంటలు, చెరువులను నింపనున్నారు. తద్వారా 1,226 గ్రామాలకు తాగునీరు అందనున్నది. అందులో ఫ్లోరైడ్ బాధిత గ్రామాలు కూడా ఉన్నాయి.
సాగునీటి పనులకు మార్గం సుగమం
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాతోపాటు రంగారెడ్డి జిల్లాలో 12.30 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే పనులను ఫేజ్ 2 కింద చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే సాగునీటి ప్రాజెక్టులను చేపట్టేందుకు పర్యావరణ అనుమతులు తీసుకోవడం తప్పనిసరిగా మారింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఆ దిశగా ముమ్మర ప్రయత్నాలు చేసింది. ఎక్కడా రాజీ పడకుండా అనుమతుల సాధనకు కంకణం కట్టుకొన్నది. ప్రస్తుతం పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని ఈఏసీ కేంద్రానికి సిఫారసు చేయడంతో సాగునీటి పనులను చేపట్టేందుకు కూడా మార్గం సుగమం కానున్నది.
అనుమతుల సాధనపై సర్వత్రా హర్షం
పాలమూరు ప్రాజెక్టుకు ఈఏసీ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఇంజినీరింగ్ అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అకుంఠిత దీక్ష వల్లే ఇది సాధ్యమైందని కొనియాడారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
నెరవేరిన దశాబ్దాల కల
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాతోపాటు రంగారెడ్డి జిల్లాలో 12.30 లక్షల ఎకరాలకు సాగునీటితోపాటు తాగునీటిని అందించాలనే లక్ష్యంతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి (పీఆర్ఎల్ఐఎస్) తెలంగాణ ప్రభుత్వం రూ.35వేల కోట్ల అంచనా వ్యయంతో 2015లో శ్రీకారం చుట్టింది. మొదటి దశలో తాగునీటికి సంబంధించిన పనులను, రెండో దశలో సాగునీటికి సంబంధించిన పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకొన్నది. అయితే, ప్రాజెక్టును ప్రారంభించింది మొదలు పొరుగున ఏపీ రాష్ట్రంతోపాటు స్వరాష్ట్రంలోని ప్రతిపక్షపార్టీ నేతలు సృష్టించని అడ్డంకులు లేవు. ప్రాజెక్టును అడ్డుకొనేందుకు ఎన్జీటీ మొదలు సుప్రీంకోర్టు, ట్రిబ్యునల్, సదరన్ జోనల్ కౌన్సిల్ వరకు అన్ని వేదికలపైనా కుట్రలకు తెరలేపారు. అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ మొక్కవోని దీక్షతో వాటన్నింటినీ అధిగమించి, ఆయా వేదికలపై లేవనెత్తిన సందేహాలకు, అడ్డంకులను తొలగించుకొని ఎట్టకేలకు అనుమతులను సాధించి పెట్టి పాలమూరు బిడ్డల దశాబ్దాల కలను నెరవేర్చారు. ఈఏసీని ఒప్పించి, మెప్పించి అనుమతుల మంజూరును సిఫారసు చేయించి తెలంగాణ సర్కారు చరిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకొన్నది.
మరో అపూర్వ, చరిత్రాత్మక విజయం
దశాబ్దాలుగా అన్యాయానికి, వివక్షకు గురైన పాలమూరుకు కృష్ణమ్మ పరుగుపరుగున రానున్నది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు సాధించడం ముఖ్యమంత్రి కేసీఆర్‌గారు సాధించిన మరో అపూర్వ, చరిత్రాత్మక విజయం. పాలమూరు ప్రాజెక్టుకు ఈఏసీ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం హర్షణీయం. ముఖ్యమంత్రి మొకవోని దీక్షకు.. ప్రభుత్వం పట్టువిడవని ప్రయత్నం తోడై సాధించిన ఫలితం ఇది. పాలమూరు బిడ్డల దశాబ్దాల కల సాకారమైన సందర్భం ఇది. మాటల్లో వర్ణించలేని మధుర ఘట్టం ఇది. పాలమూరు బీళ్ల దాహార్తిని తీర్చే, ప్రజల తలరాతను మార్చే ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు రావడం అపూర్వ ఆనందాన్ని ఇస్తున్నది.
-హరీశ్‌రావు, ఆర్థిక శాఖ మంత్రి
సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు
పాలమూరు జిల్లా ప్రజల తరఫున సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు. జిల్లాపై సీఎం కేసీఆర్‌కు ప్రత్యేకమైన ప్రేమాభిమానాలు ఉన్నాయి. పర్యావరణ అనుమతుల కోసం తెలంగాణ ప్రభుత్వం పట్టుదలతో కృషి చేసింది. ఇప్పటికే జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తయ్యాయి. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా సస్యశ్యామలం అవుతుంది. ప్రాజెక్ట్ అడ్డుకోవడం కోసం ప్రతిపక్షాలు ఎన్నో కుట్రలు చేశాయి. కేంద్రం అనేక కొర్రీలు వేసింది. దశాబ్దాలుగా వివక్షకు గురైన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు పాలమూరు ప్రాజెక్టు ద్వారా కృష్ణమ్మ నీటిని మళ్లించి సస్యశ్యామలం చేస్తాం.
-శ్రీనివాస్‌గౌడ్, ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి
సంకల్పం ఉంటే సాధించలేనిది ఏదీ లేదు
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు దక్కడం సంకల్పం ఉంటే సాధించలేనిది ఏదీ లేదనేదానికి నిదర్శనం. నాడు తెలంగాణ రాష్ట్రమైనా, నిన్న కాళేశ్వరం ప్రాజెక్టు అయినా, నేడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అనుమతులైనా సంకల్పం ఉంటే సాధించలేనిది ఏదీ లేదు. ఇందుకు నిదర్శనం కేసీఆర్.. తార్కాణం కేసీఆర్.
-నిరంజన్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి
మా నీటి అవసరాలు తీరబోతున్నాయి
పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులకు ఈఏసీ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం హర్షణీయం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా వాటి పరిధిలోని గ్రామాలకు తాగునీరు అందించాలనే సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం నెరవేరబోతున్నది. మా చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని ఆరు నియోజక వర్గాల్లో నీటి సమస్య తీరబోతున్నది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పర్యావరణ అనుమతుల కోసం కృషి చేసిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు హృదయ పూర్వక ధన్యవాదాలు.
-రంజిత్‌రెడ్డి, ఎంపీ
పాలమూరు ప్రజల స్వప్నం నెరవేరింది
ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు రావడంతో ప్రజల చిరకాల స్వప్నం నెరవేరింది. సీఎం కేసీఆర్ పట్టుబట్టి అనుమతులు సాధించారు. పాలమూరు కరు వు, వలసలను పోగొట్టాలనే ఉద్దేశంతో ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టారు. కానీ కొందరు కాంగ్రెస్, బీజేపీ నేతలు కేసులు వేసి అడ్డుకొన్నారు. తెలుగు రాష్ర్టాలు విడిపోయాక కేంద్రం తెలంగాణపై వివక్ష ప్రదర్శించి కృష్ణా నది జలాల్లో వాటా తేల్చాలని నిలదీయడం, సుప్రీంకోర్టు వరకు వెళ్లి తాగునీటికి అనుమతులు సాధించాం. ఇక జెట్స్పీడ్తో పనులు పూర్తి చేసి పాలమూరును సస్యశ్యామలం చేస్తాం.
-లక్ష్మారెడ్డి , జడ్చర్ల ఎమ్మెల్యే