హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ) : కొత్త ఆర్థిక సంవత్సరంలో కరెంట్ చార్జీల పెంపు ఉండదని తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి (టీజీఈఆర్సీ) ప్రకటించింది. ఈ ఏడాది కూడా పాత చార్జీలే అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. ఈ మేరకు 2026-27 సంవత్సర టారిఫ్‌లను ఖరారు చేస్తూ ఈఆర్సీ ఉత్తర్వులు విడుదల చేసింది. ప్రస్తుతం 2025 ఏప్రిల్ 1 నుంచి కొనసాగుతున్న టారిఫ్‌లే 2027 మార్చి 31 వరకు అమల్లో ఉంటాయని వెల్లడించింది. విద్యుత్తు పంపిణీ సంస్థ (డిస్కమ్)లు ఈ ఏడాది చార్జీలు పెంచాలని ప్రతిపాదించలేదు. ఈ మేరకు అవి సమర్పించిన పిటిషన్లపై బహిరంగ విచారణ జరిపిన ఈఆర్సీ.. తాజాగా పాత టారిఫ్‌లనే ఖరారు చేసింది.
‘టైమ్ ఆఫ్ ది డే’ టారిఫ్‌ను ప్రకటించిన ఈఆర్సీ.. పీక్ సమయంలో పీక్ చార్జీలు వసూలు చేసేందుకు అనుమతించింది. హెచ్‌టీ వినియోగదారులకు అందే రాత్రి పూట అలవెన్సును కట్ చేసింది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు వినియోగించే విద్యుత్తుపై యూనిట్‌కు అదనంగా రూ.1.50 చొప్పున వసూలు చేస్తారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు వినియోగించే విద్యుత్తుపై యూనిట్‌కు 50 పైసలు చొప్పున తగ్గిస్తారు. రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు సాధారణ చార్జీలే ఉంటాయి.
ప్రస్తుతం రాష్ట్రంలోని రెండు విద్యుత్తు పంపిణీ సంస్థలు ఆర్థికంగా పీకల్లోతు కష్టాల్లో ఉన్నాయి. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటికే రూ.20 వేల కోట్ల లోటులో ఉన్నాయి. 2026-27లో దాదాపు రూ.50,242 కోట్లు అవసరమవుతాయని టీజీఎస్పీడీసీఎల్ అంచనా వేసింది. ఇందులో విద్యుత్తు చార్జీల రూపంలో రూ.40,659 కోట్లు సమకూర్చుకోగలమని పేర్కొంటూ.. మిగిలిన రూ.9,583 కోట్ల రెవెన్యూ లోటును ప్రభుత్వం భర్తీచేయాలని కోరింది. ఈ పిటిషన్‌పై ఈఆర్సీ సమగ్ర విచారణ జరిపి రూ.44,720 కోట్లకే అనుమతించింది. తద్వారా ఈ డిస్కమ్‌కు రూ.4 వేల కోట్లకుపైగా కోత పెట్టిన ఈఆర్సీ.. ఉత్తర డిస్కమ్ (టీజీఎన్పీడీసీఎల్)కు రూ.20,220.76 కోట్లకు అనుమతించింది. ఉచిత విద్యుత్తుకు ప్రభుత్వం ఇటీవల బడ్జెట్లో రూ.14 వేల కోట్లు మాత్రమే ప్రకటించినందున ఆ నిధులతో డిస్కమ్‌లు తమ లోటును పూడ్చుకోవడం కష్టమే.