హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): కేంద్ర జల్‌శక్తి శాఖ నేతృత్వంలోని అత్యున్నత స్థాయి టెక్నికల్ అప్రైజల్ కమిటీ (టీఏసీ) గురువారం మధ్యాహ్నం ఢిల్లీలో సమావేశం కానున్నది. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ‘సీతారామ ఎత్తిపోతల పథకం- సీతమ్మసాగర్ బహుళార్థక సాధక ప్రాజెక్టు’కు సంబంధించిన అనుమతులతోపాటు పలు సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన తుది అనుమతుల మంజూరుపై చర్చించనున్నది.
సీతారామ ఎత్తిపోతల పథకంపై గత ఫిబ్రవరిలో నిర్వహించిన టీఏసీ 157వ సమావేశం లో చర్చించినప్పటికీ, పలు అంశాలపై సందేహాలను వ్యక్తంచేస్తూ తుది అనుమతులను నిరాకరించారు. ఆయా అంశాలపై తెలంగాణ సహేతుకమైన ఆధారాలను సమర్పించగా, కేంద్ర ప్రభుత్వం సైతం సంతృప్తిని వ్యక్తంచేసింది. ఈ నేపథ్యంలో 158వ టీఏసీ సమావేశంలో తుది అనుమతులపై చర్చించనున్నారు. స మావేశంలో పాల్గొనేందుకు ఈఎన్సీ అనిల్‌కుమార్, గోదావరి అంతర్రాష్ట్ర విభాగం అధికారి సుబ్రహ్మణ్యప్రసాద్ ఢిల్లీకి తరలివెళ్లారు.