హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ): పల్లెలను హైస్పీడ్ ఇంటర్నెట్తో అనుసంధానించేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన టీ-ఫైబర్ పథకం దేశానికే ఆదర్శంగా నిలిచింది. దీనినే స్ఫూర్తిగా తీసుకొన్న కేంద్ర ప్రభుత్వం ‘ఫిజిటల్’ (ఫిజికల్ అండ్ డిజిటల్) ప్రాజెక్టును రూపొందించింది. ఈ పథకం పైలెట్ ప్రాజెక్టును ఈ నెల 15న మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గుణ జిల్లా ఉమ్రి గ్రామంలో ప్రారంభించింది. గ్రామీణ ప్రాంతాలతోపాటు మారుమూల ప్రాంతాల్లో విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, ఆర్థిక, ఈ-గవర్నన్స్ సేవలకు హై-స్పీడ్ ఇంటర్నెట్ను అందించేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపు, నాటి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ విజన్ వెరసి ‘డిజిటల్ తెలంగాణ’ లక్ష్యంతో టీ-ఫైబర్ నాడు పురుడు పోసుకున్నది. భవిష్యత్తు అంతా డిజిటల్దేనని, అన్నిరకాల సేవల్లో ఇంటర్నెట్ ప్రాధాన్యాన్ని గుర్తించి ముందుచూపుతో కేసీఆర్ ప్రభుత్వం 2017లో టీ-ఫైబర్‌ను ప్రారంభించింది. దీనిని కేంద్ర ప్రభుత్వం ‘ఫిజిటల్’గా మార్చి, ప్రధాని మోదీ విజన్ అని చెప్పుకోవడం కొసమెరుపు.
టీ-ఫైబర్ ప్రాజెక్టును కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రశంసించినట్టు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి శ్రీధర్‌బాబు అసెంబ్లీ సాక్షిగా వెల్లడించారు. నిరుడు ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) కార్యక్రమంలో టీ-ఫైబర్‌ను అన్ని రాష్ర్టాలకు రోల్ మోడల్‌గా కేంద్రం మంత్రి అభివర్ణించారని శ్రీధర్‌బాబు తెలిపారు. అన్ని రాష్ర్టాలు టీ-ఫైబర్‌ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించినట్టు చెప్పారు. తెలంగాణలో పర్యటించి టీ-ఫైబర్ అమలు తీరును పరిశీలించి రావాలని అధికారులను కేంద్ర మంత్రి ఆదేశించారని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం టీ-ఫైబర్‌ను దిక్సూచిలా తీసుకోవడంపై తాను గర్వపడుతున్నట్టు మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.
డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ ఆవశ్యకతను గుర్తించిన అప్పటి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ‘ఇంటింటికీ ఇంటర్నెట్’ అందించాలనే లక్ష్యంతో దేశంలోనే తొలిసారిగా 2017లో టీ-ఫైబర్‌ను ప్రారంభించారు. ఇంటింటికీ నీళ్లు అందించాలనే సంకల్పంతో కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకంతో ఈ టీ-ఫైబర్ ప్రాజెక్టును అనుసంధానించారు. ఇంటర్నెట్ సేవలు అందించే ‘ఆప్టిక్ ఫైబర్’ లైన్లను పైపులైన్లతోపాటు వేసి ఖర్చును భారీగా తగ్గించారు. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలను ఇంటర్నెట్తో జోడించాలని సంకల్పించారు. తద్వారా ప్రభుత్వ సేవలను పౌరులకు మరింత చేరువ చేయాలని భావించారు.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో ప్రయోగాత్మకంగా టీ-ఫైబర్ ప్రాజెక్టు ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 464 మండలాల్లోని 8,778 గ్రామ పంచాయతీలతోపాటు 10,128 గ్రామాల్లోని 83.58 లక్షల గృహాలకు హైస్పీడ్ ఇంటర్నెట్ అందించాలని, తద్వారా 3.05 కోట్ల మందికి ఇంటర్నెట్ సేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. టీ-ఫైబర్ ప్రాజెక్టుకు ఐసీటీ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ డిజిటల్ ఇండియా విభాగంలో నాలెడ్జ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (కేసీసీఐ) బిజినెస్ ఎక్స్‌లెన్స్-2022 అవార్డు లభించింది.