కాస్మొపాలిటన్ సొగసుతో, పటిష్ట లా అండ్ ఆర్డర్‌తో విశ్వనగర కిరీటాన్ని సిగన ధరించిన సిటీ.. హైదరాబాద్. నిన్నమొన్నటి దాకా హైదరాబాద్ అంటే ఐటీ రాజధాని! కొలువులు, పెట్టుబడుల కోలాహలం! ట్యాంక్‌బండ్‌పై ఫన్‌డేగా మారిన సండే! నగరాన్ని క్లీన్‌సిటీగా మెరిపించిన పారిశుద్ధ్య కార్మికులు.. గ్రీన్‌సిటీగా నిలిపిన మున్సిపల్ యంత్రాంగం.. సేఫెస్ట్ సిటీగా మార్చిన పోలీస్ వ్యవస్థ.. బెస్ట్ సిటీగా మలిచిన కేసీఆర్ సర్కారు! ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, వరద నియంత్రణలో ఎస్ఎన్డీపీ.. ప్రతిదినం ప్రగతి శోభితం. భాగ్యనగరానికి భరోసానిచ్చిన సిటీ నిర్వహణ. షీ-టీముల పహారాలో స్వేచ్ఛగా సంచరించిందీ నగరం. నిఘా నీడలో నిశ్చింతగా నిద్రించిందీ నగరం.
కాంగ్రెస్ ఏలుబడిలో నగరం నరకమైంది! కట్టుకథలే తప్ప, పెట్టుబడుల్లేవు. కంపెనీలు, కొలువుల్లేవు. ప్రగతి కార్యక్రమాల్లేవు. ప్రారంభోత్సవాల్లేవు. దానికితోడు లా అండ్ ఆర్డర్ పడిపోయింది. క్రైమ్‌రేటు పెరిగిపోయింది. వరుస కాల్పుల ఘటనలు, దోపిడీలు, నడిరోడ్డుపై హత్యలు, నేరాలు-ఘోరాలు, అగ్ని ప్రమాదాలతో నగరం బిక్కుబిక్కుమంటున్నది. అంతర్రాష్ట్ర ముఠాలు స్వైరవిహారం చేస్తున్నయ్. విజిబుల్ పోలీసింగ్ లేదు. పెట్రోలింగ్ లేదు. ఆకతాయిల ఆగడాలు, అమ్మాయిలపై వేధింపులు ఎక్కువైనయ్. నగర నిర్వహణను పట్టించుకున్న నాథుడే లేడు. పారిశుద్ధ్యం కనిపించడం లేదు. ట్రాఫిక్ అస్తవ్యస్తమైంది. వానొస్తే వణుకుతున్నది నగరం. అభద్రనగరిగా హైదరాబాద్ మారిపోయింది.
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ) : ఆ పదేండ్లు…. భాగ్యనగరం బతుకమ్మ, బోనాల సాంస్కృతిక వైభవం.. నగరం నడిమధ్యన టాంక్‌బండ్‌పై బతుకమ్మలాడిన ఆడబిడ్డల వైభోగం. ఈ నగరం రంజాన్ పండుగకు ఘుమఘుమలాడిన బిర్యానీ, హలీమ్ మాధుర్యం. ఈ నగరం గోల్కొండ కోట మీద తెలంగాణ జెండా ఎగరేసిన చారిత్రక ఘట్టాల సంబురం. చార్మినార్ వద్ద గాజుల పండుగ గలగలలాడిన కోలాహలం.. ఐటీ భవనాల తళతళల్లో తరించిన నుమాయుష్. చారిత్రక, సాంస్కృ తిక, ఆర్థిక, ఆతిథ్య రంగాల వైభవాల సమాహారం. దేశదేశాల ప్రజలెందరో మనసు పడ్డ.. మక్కువ చూపిన ఏకైక భారతీయ నగరం. రోజుకో కొత్త పరిశ్రమ, వారానికో జాతీయ, అంతర్జాతీయ సదస్సు, సీజన్‌కో క్రీడాకార్యక్రమం, ఏడాది పొడవునా ఎడతెగని పర్యాటక శోభ.. ఎప్పుడూ కోలాహలం. 24 గంటల కరెంటు, పుష్కలమైన మంచినీరు, వీధి వీధినా పోలీసు వాహనాల భద్రత, లక్షల సీసీ కెమెరాల నిఘాలో జనం నిర్భయంగా నిద్రించిన నగరం. ట్రాఫిక్ కానిస్టేబుళ్ల నియంత్రణలో జంఝాటాలు లేని ప్రయాణ విహారం, ఇంటింటా చెత్త సేకరణ తరలింపుతో దుర్గంధమెరుగని సౌరభం. షీ టీమ్స్ పహారాలో యువతులు స్వేచ్ఛగా సంచరించిన నగరం. మొత్తంగా అది ఒక వైభవోపేతమైన గతం!
ఇవాళ ఈ నగరానికేమైంది? పరిస్థితి ఎందుకు తారుమారైంది? విశ్వనగరం ఎందుకు విషాదనగరమైంది? ఒక భారీ వర్షానికే నాలుగైదు గంటల ట్రాఫిక్ నరకమా? వర్షాలు ఇవాళ కొత్తగా కురుస్తున్నాయా? వాహనం కదలడానికి గంటల నిరీక్షణా? ఒక్క కానిస్టేబుల్ కానరాని పరిస్థితా? ట్రాఫిక్ పోలీస్ వ్యవస్థ ఏమైంది? అసలు నగరంలో ఒక పరిపాలన అనేది ఉందా? ఏ ఒక్క శాఖ అయినా పనిచేస్తున్న దా? ఇటు నగరంలో శాంతిభద్రతలు ఉన్నాయా? ఎన్ని హత్యలు? ఎన్ని లైంగికదాడులు? ఐటీ మ హిళా ఉద్యోగులకే కాదు, ఆఖరుకు పసిపిల్లలకు కూడా రక్షణ లేదు. జువెల్లరీ షాపు లూటీ, ఏటీఎంల దోపిడీ, పట్టపగలే కాల్పులు, హత్యలు, కల్తీకల్లుకు 10 మంది బలి. మొన్న వృద్ధదంపతుల మీద దాడి చేసి ఇల్లు దోపిడీ. ఇవాళ పదేండ్ల బాలిక మీద లైంగికదాడికి యత్నించి.. అడ్డుకుంటే కత్తిపోట్లు. మరోవైపు బీహార్, యూపీ, రాజస్థాన్, బెంగాల్ నేరగాళ్ల సైబర్ దాడుల్లో లక్షలు, కోట్లలో మోసాల డైలీ సీరియళ్లు. చిట్ఫండ్ల మీద అదుపు లేదు. సైబర్ నేరాల మీద అదుపు లేదు. లైంగిక దాడుల మీద, ఇండ్లలో దోపిడీల మీద అదుపు లేదు. ఒక ఎమ్మెల్యే ఇంటి మీద వాహనాల్లో వచ్చి దాడికి దిగినా ఆపే దిక్కు లేదు. సినిమా ఈవెంట్ జరిగితే తొక్కిసలాటలు.. మరణాలు. కూడళ్లలో పోలీస్ వాహనాల జాడ లేదు. నేరస్థుల్లో భయమే లేదు. ఇవి చాలవన్నట్టు కరెంటు షాక్‌లతో డజన్లకొద్దీ చావులు, కల్తీకల్లుకు పదుల సంఖ్యలో మరణాలు. ఎక్కడపడితే అక్కడ సామూహిక లైంగిక దాడులు. పేరుకుపోతున్న చెత్తను ఎత్తే దిక్కు లేదు. సీజనల్ రోగాలు విజృంభిస్తున్నాయి. దవాఖానలు కిటకిటలాడుతున్నాయి. అసలీ నగరానికేమైంది? ఈ నగరంలో ఒక ప్రభుత్వం ఉన్నదా? ఒక పరిపాలన ఉన్నదా? ఎన్ని కరెంటు షాక్ ఘటనలు? ఎల్బీనగర్లో ఇద్దరు, గుల్జార్‌హౌస్‌లో 17 మంది మృతి? ఇంకా మేలుకోరా? ఈసారి రామంతాపూర్‌లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల ర్యాలీలో కరెంటు షాక్ తో ఐదుగురు బలి. ర్యాలీ సమాచారం పోలీసులకు లేదా? రహదారి క్లియర్‌గా ఉందో లేదో తనిఖీ చేయలేదా? వేలాడే వైర్లు ఎంత ప్రమాదకరమో తెలియదా? ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే త్వరలో వినాయక నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన వేడుక. సజావుగా సాగుతుందా? ప్రశాంతంగా ముగుస్తుందా? ఆ విఘ్నేశ్వరుడికే తెలియాలి!!
ట్రై కమిషనరేట్ల పరిధిలోని చాలా ప్రాంతాల్లో సీసీ కెమెరాలు అలంకారప్రాయంగా మారాయి. కొన్ని ప్రాంతాల్లో కెమెరాలే లేకపోవడం గమనార్హం. దీంతో కేసుల దర్యాప్తు ముందుకు సాగడంలేదు.
దోపిడీ దొంగలకు గ్రేటర్ హైదరాబాద్ అడ్డాగా మారుతున్నది. ఇలా వచ్చి అలా దోచుకొంటున్నారు. పోలీసు గస్తీ చురుగ్గా లేకపోవడంతో ముఠాలు రెచ్చిపోతున్నాయి. దొంగలు రావడం.. దోచుకుపోవడం.. సీన్ కట్ చేస్తే రంగంలోకి పోలీసు బృందాలు దిగడం… వారం పదిరోజుల తర్వాత ముఠాలను ప్రెస్మీట్లో హాజరుపర్చడం.. ఘనత వహించామని చెప్పడం.. పోలీసులకు పరిపాటిగా మారిందని విమర్శలు వినిపిస్తున్నాయి. నగరాన్ని దోపిడీ దొంగలు అడ్డాగా చేసుకుంటున్నా పోలీసులు ముందే పసిగట్టలేకపోతున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కొన్ని ముఠాలు నగరంలో జోరుగా విహరిస్తున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వరుసగా జరుగుతున్న ఘటనలతో పలు అంతర్రాష్ట్ర ముఠాలు నగరంలోకి చొరబడి యథేచ్ఛగా తిరుగుతున్నాయనే సందేహాలు సర్వత్రా వినిపిస్తున్నాయి.