 
                                                            హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులకు ఆటంకం తొలిగింది. పర్యావరణ అనుమతులు ఉన్న 7.15 టీఎంసీలకు సంబంధించిన పనులు కొనసాగించేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం అనుమతి ఇచ్చింది. ఈ నీటిని తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించుకుకోవాలని స్పష్టం చేసింది. ప్రజలు తాగునీటి ఎద్దడి ఎదురోవద్దనే ఉద్దేశంతో ఈ అవకాశం కల్పిస్తున్నట్టు జస్టిస్ సంజీవ్‌ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేశ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొన్నది.
ప్రాజెక్టు నిర్మాణంలో పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించారంటూ జాతీయ హరిత ట్రిబ్యునల్ తెలంగాణకు విధించిన రూ.500 కోట్ల జరిమానాపై సుప్రీంకోర్టు స్టే విధించింది. గతంలో కర్నూలుకు చెందిన రైతులు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా తెలంగాణకు జరిమానా విధించింది. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఈ పిటిషన్‌పై తాజాగా విచారణ జరిపిన ద్విసభ్య ధర్మాసనం.. పనులు కొనసాగించేందుకు వెసులుబాటు కల్పించింది. తదుపరి విచారణను ఆగస్టుకు వాయిదా వేసింది.
 
                            