బాన్సువాడ రూరల్, జనవరి 25 : గురుకుల సిబ్బంది నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్నది. గురుకుల సిబ్బంది చేయాల్సిన పనిని విద్యార్థులతో చేయించడంతో ఆటో నుంచి ప్రమాదవశాత్తు కిందపడి మద్నూర్ మండలం కొడిచెరకు చెందిన కావస్కర్ సంగీత (13) అనే విద్యార్థిని మృతిచెందింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని బోర్లం సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకున్నది. ప్రత్యక్ష సాక్షులు, గురుకుల సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. గురుకుల పాఠశాలకు చెందిన కుర్చీలను ప్రిన్సిపాల్ తన సొంత అవసరాల కోసం బాన్సువాడకు తీసుకెళ్లి, వాటిని తిరిగి గురుకుల పాఠశాలకు ప్యాసింజర్ ఆటోలో తీసుకువచ్చారు.
ఆటోలో నుంచి కుర్చీలను సిబ్బంది కాకుండా విద్యార్థులు దించుతుండగా, ప్రమాదవశాత్తు ఆటోలో నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థిని సంగీత కింద పడింది. సీసీ రోడ్డు ఉండడంతో తలకు బలమైన గాయం కావడంతో వెంటనే బాన్సువాడ ప్రభుత్వ ఏరియా దవాఖానకు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే విద్యార్థిని మృతి చెందినట్టు ధ్రువీకరించారు. విద్యార్థిని మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు, రైతుబంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు అంజిరెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జుబేర్తోపాటు బీజేపీ నాయకులు ఏరియా దవాఖానకు చేరుకొన్నారు.
ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకొని ప్రిన్సిపాల్ సునీతీ తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకొని, విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యవసాయ సలహాదారుడు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, సబ్ కలెక్టర్ కిరణ్మయి దవాఖానకు చేరుకొని విద్యార్థిని మృతిపై ఆరాతీశారు. విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు.