Integrated Markets | హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థల్లో ప్రారంభించిన సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణాలు పడకేశాయి. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మాణాలకు నిధులు విడుదల చేయకపోవడంతో కాంట్రాక్టర్లు చెతులెత్తేశారు. ఇప్పటికే రూ.200 కోట్లు ప్రభుత్వం బకాయి ఉందని, ఆ డబ్బులు ఇచ్చే వరకు పనులు పునఃప్రారంభించమని స్పష్టం చేస్తున్నారు. దీంతో మార్కెట్లు అందుబాటులోకి రాకుండాపోయాయి.
ప్రజలకు అవసరమైన పండ్లు, కూరగాయలు, మాసం, చేపలు, పూలు అన్నీ ఒకే దగ్గర లభించాలనే లక్ష్యంతో ప్రతి మున్సిపాలిటీలో ఒక్కొ సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్లను నిర్మించాలని బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. వీటి కోసం రూ.500 కోట్లను కేటాయించింది. పట్టణం, నగరం మధ్యలో అన్ని వసతులతో ఉండాలని నిర్ణయించారు.
మురుగునీరు నిలిచిపోకుండా మోడల్ డ్రైనేజీ, మరుగుదొడ్లు, మోడల్ లైటింగ్, ప్రహరీ, అంతర్గత రహదారులు, పార్కింగ్ సౌకర్యం, సీసీ కెమెరాలు, మొక్కల పెంపకం, జీరో వేస్ట్ తదితర వాటికి చర్యలు చేపట్టారు. మార్కెట్లు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండే విధంగా రూపకల్పన చేశారు. రాష్ట్రంలో మొత్తం 144 సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్లను మంజూరు చేశారు. 25 వేల కంటే తక్కువ జనాభా ఉన్న 57 పట్టణాల్లో ఒక్కొ దాన్ని రూ.2 కోట్లతో, 25 వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న 81 పట్టణాల్లో ఒక్కొక్కటి రూ.4.50 కోట్లతో నిర్మించనున్నారు. లక్ష కంటే ఎక్కువ జనాభా ఉన్న పట్టణాల్లో లక్షకు ఒక మార్కెట్ చొప్పున గరిష్ఠంగా ఐదు నిర్మించాలని నిర్ణయించారు.
బీఆర్ఎస్ హయాంలోనే 15 మార్కెట్లు పూర్తి అయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వాటి గురించి పట్టించుకోకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు నిలిపివేశారు. కాంట్రాక్టర్లు ప్రభుత్వ అధికారులను ఎన్నిసార్లు కలిసినా పైసా విడుదల చేయలేదు. దీంతో కాంట్రాక్టర్లు అక్కడి యంత్రాలను వేరే పనులకు తరలించారు. తమకు బిల్లులు చెల్లిస్తేనే పనులు ప్రారంభిస్తామని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా నిధులు విడుదల చేసి సమీకృత మార్కెట్లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.