హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా 4,400 సమస్యాత్మక ప్రాంతాలున్నట్టు రాష్ట్ర పోలీసుశాఖ ప్రాథమికంగా గుర్తించింది. ఆ వివరాలను ఎన్నికల సంఘానికి ఇటీవల సమర్పించింది. నోటిఫికేషన్ వెలువడగానే అదనపు బలగాలను ఆయా ప్రాంతాలకు కేటాయించనున్నది. ట్రై కమిషనరేట్లలో 1,100 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు.
హైదరాబాద్ కమిషనరేట్లో 550, రాచకొండ కమిషనరేట్లో 350, సైబరాబాద్ కమిషరేట్ పరిధిలో 200 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించినట్టు అడిషనల్ డీజీ ఒకరు ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు. మిగిలిన 3,300 ప్రాంతాలను జిల్లాల్లో గుర్తించామని తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత.. ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు చెప్పారు. ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల్లో మూడు ప్రధాన పార్టీల అభ్యర్థుల ఆధారంగా సిబ్బందిని పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు ఉన్నతాధికారులు తెలిపారు. సరిహద్దు రాష్ర్టాల నుంచి సుమారు 20 వేల మంది వరకు హోంగార్డులను ఎన్నికల కోసం అడిగామన్నారు.