హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): అభివృద్ధి పనులతో పాటు పర్యావరణహితంగా, కాలుష్యరహితంగా పట్టణాలను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర పురపాలక శాఖ ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతున్నది. ఒకవైపు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తూనే ఇతర కార్యక్రమాలపై దృష్టిసారిస్తున్నది. ఎఫ్ఎస్టీపీలు, దోభీఘాట్లు, మొక్కల పెంపకం, వార్డుకో ట్రీ పార్కు, మల్టి లేయర్ ఎవెన్యూ ప్లాంటేషన్, ఇంటింటా చెత్త సేకరణ, ఇంటివద్దే వర్మీ కంపోస్టు తయారీకి ప్రత్యేక శిక్షణ, గ్రీన్ బడ్జెట్‌కు పది శాతం నిధుల కేటాయింపు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల ఏర్పాటు వంటి అనేక చర్యలను తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది.
దీనిలో భాగంగా ఫికల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎఫ్ఎస్టీపీ)లను నిర్మించడానికి రూ.428 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది. వీటిని ప్రతి మున్సిపాలిటీ, నగర పాలక సంస్థకు ఒక్కోటి చొప్పున నిర్మిస్తున్నారు. ఎఫ్ఎస్టీపీల లేకపోవడంతో మావనవ్యర్థాలను పట్టణ శివారులు, వాగులు, కాలువల్లో వదులుతున్నారు. అవి భూముల్లోకి ఇంకి నీరు కూడా కలుషితమవుతోంది. ఈ నేపథ్యంలో మానవ వ్యర్థాల సమస్యకు పరిష్కారం చూపడానికి దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో వీటి నిర్మాణం చేపట్టారు.
నీటి కాలుష్యం ఉత్పన్నం కాకుండా ఉండేందుకు రజక వృత్తిదారుల కోసం ప్రతీ మున్సిపాలిటీ, నగర పాలక సంస్థలో ఒక్కోటి చొప్పున ఆధునిక దోభీఘాట్ నిర్మాణం చేపడుతున్నారు. వీటికోసం రూ.282 కోట్లు ఖర్చు చేస్తున్నారు. మున్సిపల్ చట్టంలోనే గ్రీన్ బడ్జెట్‌కు 10 శాతం నిధులను కేటాయించారు. దీని ద్వారా రూ.800 కోట్లు ఖర్చు చేశారు. మొక్కల పెంపకం, ప్రతి వార్డుకో ట్రీపార్కు, మల్టి లేయర్ ఎవెన్యూ ప్లాంటేషన్ ఏర్పాటు చేస్తున్నారు.