Telangana | హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): మండల విద్యాధికారులకు శిక్షణ అంశం.. మూడు ఉత్తర్వుల జారీ.. మూడింటిలోనూ మార్పులు, చేర్పులతో వేర్వేరు అంశాలతో షెడ్యూల్ విడుదల. ఇది జరిగింది కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే.. ఇదీ విద్యాశాఖ నిర్వాకం. ప్రణాళికాలోపం, చిత్తశుద్ధిలేమి, నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తున్నది. రోజుల వ్యవధిలో మూడు రకాల ఉత్తర్వులిచ్చి విద్యాశాఖ ఉన్నతాధికారులు తమకు తామే సాటి అని నిరూపించుకున్నా రు. ప్రణాళికలు రూపొందించడంలో తమను మించినవాళ్లు లేరని చాటుకున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమం ముగిసింది.
ఇదే కోవలో మండల విద్యాధికారుల (ఎంఈవోలు)కు శిక్షణ ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది. స్టేట్ కౌన్సిల్ ఆప్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ డెవలప్‌ంట్ (ఎస్సీఈఆర్టీ) ఈ శిక్షణను ఇస్తుందని ఈ నెల 21న ఓ ప్రొసీడింగ్‌ను జారీచేశారు. ఆ తర్వాత 23న మరో ప్రొసీడింగ్ ఇచ్చారు. రోజు గడించిదో లేదో ఈ నెల 24న మూడో ప్రొసీడింగ్‌ను జారీచేశారు. దీంతో రెండు విడతల శిక్షణకు మూడు రకాల ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో ఎంఈవోలు, సమగ్ర శిక్ష జిల్లా కోఆర్డినేటర్లు అయోమయానికి గురయ్యారు.
తొలుత ఈ నెల 27 నుంచి 31 వరకు 5 రోజులపాటు అన్ని జిల్లాల పరిధిలోని ఎంఈవోలు, సమగ్ర శిక్ష జిల్లా కోఆర్డినేటర్ల శిక్షణ షె డ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. రంగారెడ్డి జిల్లాలోని కన్హా శాంతివనంలో రెసిడెన్షియల్ పద్ధతిలో ఈ శిక్షణ ఉంటుందని 21న ప్రకటించారు. ప్రతినిధులంతా సోమవారం 5 గంటలలోగా రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.
ఏమయిందో ఏమో షెడ్యూల్లో మార్పులు చేస్తూ ఈ నెల 23న ఉత్తర్వులు ఇచ్చారు. సమగ్రశిక్ష జిల్లా కో ఆర్డినేటర్లను ఈ శిక్షణ నుంచి తప్పించారు. ఎంఈవోలకే శిక్షణను ఇస్తామని పేర్కొన్నారు. శిక్షణ శిబిరం వేదికను మార్చారు. అందరికీ ఒకేసారి కాకుండా మల్టిజోన్ల వారీగా రెండు విడుతల్లో శిక్షణ ఉంటుందని తెలిపారు. 5 రోజుల శిక్షణను 3 రోజులకు కుదించారు. ఈ నెల 26 నుంచి 28 వరకు మల్టి జోన్-1 పరిధిలోని 19 జిల్లాల్లో 351 మండలాల ఎంఈవోలకు, ఈ నెల 29 నుంచి 31 వరకు మల్టి జోన్-2 పరిధిలో 14 జిల్లాల్లో 278 మండలాల ఎంఈవోలకు జూబ్లీహిల్స్‌లోని ఎంసీఆర్‌హెచ్చార్డీలో రెసిడెన్షియల్ పద్ధతిలో శిక్షణనిస్తామని సెలవిచ్చారు.
రోజు తిరగగానే ఈ నెల 24న మరో ఉత్తర్వును విడుదల చేశారు. ఈ నెల 26-28 వరకు మల్టిజోన్ పరిధిలోని (సిద్దిపేట, మెదక్ జిల్లాలను మినహాయించి) 17 జిల్లాల్లోని 304 మండలాల ఎంఈవోలకు శిక్షణను ఇస్తామని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా మల్టి జోన్-1 శిక్షణ షెడ్యూల్‌ను మార్చారు. వీరికి ఈ నెలలో కాకుండా జూన్ 3-5 వరకు మల్టి జోన్ పరిధిలోని 14 జిల్లాలతో పాటు మల్టి జోన్-2లోని సిద్దిపేట, మెదక్ జిల్లాల్లోని మొత్తం 325 మంది ఎంఈవోలకు శిక్షణనుస్తామని ఉత్తర్వులు ఇచ్చారు.