Paddy Procurement | హైదరాబాద్, డిసెంబర్ 12(నమస్తే తెలంగాణ): ధాన్యం కొనుగోలు లక్ష్యాన్ని చేరుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ఈ వానకాలం సీజన్లో 91.61 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలన్నది పౌరసరఫరాల సంస్థ లక్ష్యం. కానీ, ఇప్పటివరకు అందులో సగం కూడా కొనుగోలు చేయలేకపోయింది. ఈ నెల 11వ తేదీ వరకు 40.29 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేసింది. పౌరసరఫరాల సంస్థ పెట్టుకున్న లక్ష్యం చేరుకోవాలంటే ఇంకా 51.32 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుచేయాలి. కానీ, అంత భారీ మొత్తంలో ధాన్యం వచ్చే పరిస్థితి లేదు.
ఇప్పటికే 80% వరకు ధాన్యం కొనుగోళ్లు ముగిశాయి. కొనుగోలు కేంద్రాలకు మరో 8-10 లక్షల టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉన్నదని పౌరసరఫరాల సంస్థ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఈ సీజన్లో ధాన్యం కొనుగోలు లక్ష్యాన్ని చేరుకోవడం అసాధ్యమనే అభిప్రాయం అధికారుల్లో వ్యక్తమవుతున్నది. ఈ సీజన్లో 66.78 లక్షల ఎకరాల్లో వరి సాగైందని, 153 లక్షల టన్నుల ధాన్యం వస్తుందని, ఇందులో ప్రభుత్వం 91 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందంటూ తొలుత పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేసిన ప్రకటన ఆచరణలో విఫలమైంది.
ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాన్ని చేరుకోకపోవడానికి ప్రభుత్వం, పౌరసరఫరాల సంస్థల నిర్లక్ష్యమే కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొనుగోళ్లు ఆలస్యం చేయ డం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని భావిస్తున్నారు. అక్టోబర్ 1 నుంచే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్టు ప్రభు త్వం ప్రకటించినప్పటికీ, నవంబర్ వరకూ కొనుగోళ్ల ప్రక్రియ గాడిన పడలేదు. మిల్లర్లకూ. ప్రభుత్వానికి మధ్య ఏర్పడిన పంచాయితీ చాలారోజులపాటు ఎటూ తేలకపోవడంతో ఆదిలోనే కొనుగోళ్లు నిలిచిపోయా యి. బ్యాంకు గ్యారెంటీలు, సన్న ధాన్యం నిబంధనలపై అసంతృప్తితో ఉన్న మిల్లర్లు చివరి వరకు ధాన్యం దించుకోకుండా నిరాకరించారు. దీంతో కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం ఎక్కడ దించాలో తెలియని పరిస్థితి ఏర్పడింది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై అపనమ్మకంతో చాలామంది రైతులు తమ ధాన్యాన్ని ప్రైవేటు వ్యాపారులకు, మిల్లర్లకు అమ్మేసుకున్నారు. మద్దతు ధర దక్కకపోయినా ప్రైవేటుకు విక్రయించేందుకే మొగ్గు చూపారు. ఇప్పటికే సుమారు 30 లక్షల టన్నులకుపైగా ధాన్యాన్ని రైతులు ప్రైవేటులో విక్రయించినట్టు సమాచారం. ప్రభుత్వం వేగంగా ధాన్యం కొనుగోళ్లు చేపట్టి ఉంటే ప్రైవేటుకు విక్రయించిన ధాన్యం ప్రభుత్వానికే వచ్చేదని, రైతులకు మద్దతు ధర దొరికేదనే అభిప్రాయాలు ఉన్నాయి.
సన్న ధాన్యం కొనుగోళ్లోనూ అదే పరిస్థితి. తొలుత 50 లక్షల టన్నుల సన్నాలు కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకు 14 లక్షల టన్నులే కొనుగోలు చేసింది. రూ.500 బోనస్ భారాన్ని తగ్గించుకునేందుకే సన్న ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం వహించిందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం కొర్రీలు పెట్టకుండా సన్న ధాన్యం కొనుగోలు చేసి ఉంటే, ఇప్పటికే 25-30 లక్షల టన్నుల ధాన్యం సర్కారు కేంద్రాలకు వచ్చేదని అంటున్నారు. ఇదంతా ప్రైవేట్ వ్యాపారుల గుప్పెట్లోకి వెళ్లిపోయింది.