హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో వైకుంఠధామాల నిర్మాణం, పాత వైకుంఠధామాల ఆధునీకరణ శరవేగంగా జరుగుతున్నది. ఇప్పటికే అన్ని గ్రామాల్లో వైకుంఠధామాలను నిర్మించిన రాష్ట్ర ప్రభుత్వం.. పట్టణాల్లో కొత్తగా రూ.200 కోట్లతో 453 వైకుంఠధామాలను నిర్మిస్తున్నది. వీటిలో ఇప్పటికే 296 వైకుంఠధామాల నిర్మాణం పూర్తయింది. మరో 149 వైకుంఠధామాల పనులు కొనసాగుతున్నాయి. మిగిలిన 8 వైకుంఠధామాల స్థలాలపై కేసులు ఉండటంతో పనులు ప్రారంభంకాలేదు. 50 వేల కంటే తక్కువ జనాభా ఉన్న 99 పట్టణాల్లో ఒక్కో వైకుంఠధామాన్ని కోటి రూపాయాలతో నిర్మిస్తున్నారు. 50 వేల నుంచి లక్ష జనాభా ఉన్న 29 పట్టణాల్లో రెండేసి వైకుంఠధామాలను నిర్మించేందుకు రూ.2 కోట్లు కేటాయించారు.
లక్ష నుంచి 3 లక్షల జనాభా ఉన్న 9 పట్టణాల్లో ఒక వైకుంఠధామాన్ని రూ.కోటితో, మరో వైకుంఠధామాన్ని రూ.2 కోట్లతో నిర్మిస్తున్నారు. 3 లక్షలకుపైగా జనాభా ఉన్న 4 పట్టణాల్లో రెండేసి వైకుంఠధామాలను నిర్మించేందుకు రూ.2 కోట్ల చొప్పున కేటాయించారు. ప్రతి వైకుంఠధామంలో బర్నింగ్ యూనిట్లతోపాటు పూజా మంటపం, దింపుడు కళ్లం, సిట్టింగ్ గ్యాలరీలు, మూత్రశాలలు, ఆఫీసు గది, పార్కింగ్ ప్రాంతం, ఇంటర్నల్ రోడ్లు, గ్రీనరీ, లైటింగ్, ముఖద్వారం, బూడిద నిల్వచేసే గది, కట్టెలు నిల్వచేసే గది ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ మున్సిపాలిటీలకు కొత్తగా 176 వైకుంఠ రథాలను సమకూర్చాలని నిర్ణయించిన అధికారులు ఇప్పటి వరకు 174 వైకుంఠ రథాలను కొనుగోలు చేశారు. మిగిలిన 2 వైకుంఠ రథాలను త్వరలో కొనుగోలు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు.