హైదరాబాద్, ఏప్రిల్ 24(నమస్తే తెలంగాణ): అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. పంట నష్టంపై నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం బీఆర్కే భవన్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షా నికి దెబ్బతిన్న పంట నష్టం వివరాలను మే 1లోపు అందజేయాలని కలెక్టర్లను ఆదేశించారు. పంట నష్టంపై వెంటనే సర్వే చేపట్టాలని, ఇందుకోసం ప్రతి మండలానికి ప్రత్యేక అధికారులను నియమించాలని సూచించారు. రాష్ట్రంలో మరికొన్ని రోజులపాటు ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నందున కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడవకుండా తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, విపత్తుల నిర్వహణశాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, పంచాయితీరాజ్‌శాఖ కమిషనర్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
గత నెలలో జరిగిన పంట నష్టానికి సంబంధించిన పరిహారాన్ని సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంగళవారం నుంచి పంపిణీ చేస్తామని సీఎస్ వెల్లడించారు. గత నెలలో పలు జిల్లాల్లో కురిసిన అకాల వర్షాలకు వరి, మక్కజొన్న, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. సీఎం కేసీఆర్ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులతో నేరుగా మాట్లాడి అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని అప్పటికప్పుడే ప్రకటించి మానవీయతను చాటుకున్నారు. క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించిన వ్యవసాయశాఖ 26 జిల్లాల్లో 1.51 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్టు నిర్ధారించింది. ఆయా రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.151 కోట్లను ఇటీవలే విడుదల చేసింది. దీంతో ఆ నిధులను నేరుగా రైతుల ఖాతాల్లో మంగళవారం నుంచి జమ చేయనున్నారు. దీంతో సీఎం కేసీఆర్ రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నట్టయ్యింది.