RRR | హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ ) : రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) దక్షిణ భాగం నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతున్నది. త్వరగా నిర్మించాలని ఓవైపు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూనే మరోవైపు కన్సల్టెంట్ల నియామకానికి పదేపదే టెండర్లను ఆహ్వానిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టాల్సిన ఈ పనులకు కన్సల్టెంట్లను ఎందుకు నియమిస్తున్నదో అర్థం కావడంలేదని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా, గతంలో రూపొందించిన అలైన్మెంట్ ప్రకారం కాకుండా కొత్త అలైన్మెంట్ ప్రకారం పనులు చేపట్టాలని, మార్చిన అలైన్‌మెంట్‌ను కేంద్రం ఆమోదించకుంటే తామే సొంతంగా పనులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం.
ట్రిపుల్ఆర్ దక్షిణ భాగానికి సంబంధించిన సమగ్ర ప్రాజక్టు నివేదిక (డీపీఆర్) తయారీ కోసం ఆర్అండ్బీ శాఖ నిరుడు నవంబర్ 25న గ్లోబల్ టెండర్లు పిలిచినప్పటికీ ఒక్క కన్సల్టెంట్ సంస్థ కూడా ముందుకు రాలేదు. దీంతో మరోసారి టెండర్లు పిలిచి, ఈ ఏడాది ఫిబ్రవరి 9 వరకు గడువిచ్చారు. తాజాగా ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్, నిధుల సమీకరణ, భూసేకరణ, పర్యవేక్షణ తదితర అవసరాల కోసం సమగ్ర రోడ్‌మ్యాప్‌ను రూపొందించేందుకు కన్సల్టెంట్లను ఆహ్వానించారు. మరోవైపు ట్రిపుల్ఆర్ ఉత్తర భాగం నిర్మాణం కోసం ఎన్హెచ్ఏఐ ఇదివరకే టెండర్లను ఆహ్వానించి, ఈనెల14 వరకు గడువిచ్చింది. ఆ పనులతోపాటు దక్షిణ భాగం పనులను చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్ర భుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. అదే సమయంలో డీపీఆర్ రూపకల్పన, రోడ్ మ్యాప్ తయారీ కోసం కన్సల్టెంట్ల నియామకానికి కూడా టెండర్లు పిలిచింది. దక్షిణ భాగాన్ని కూడా నిర్మించాలని కేంద్రాన్ని కోరుతూనే డీపీఆర్‌ల రూపకల్పనకు కన్సల్టెంట్లను ఎందుకు నియమిస్తున్నదో అర్థం కావడంలేదు.
వాస్తవానికి ట్రిపుల్ఆర్ ఉత్తర, దక్షిణ భాగాల నిర్మాణం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ప్రాథమికంగా అలైన్మెంట్లు రూపొందించారు. వాటి ఆధారంగానే ‘భారత్ మాల’ పథకం కింద ఉత్తర భాగం పనులను చేపడుతున్న కేంద్ర ప్రభుత్వం.. ‘వికసిత్ భారత్’ కార్యక్రమంలో భాగంగా దక్షిణ భాగం పనులు చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు గతంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించింది. కానీ, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం దక్షిణ భాగం అలైన్మెంట్లో మార్పులు చేయడంతోపాటు ఆ భాగాన్ని తామే నిర్మించనున్నట్టు ప్రకటించింది. ఆ మాటపై నిలబడకుండా దక్షిణ భాగం పనులను కూడా కేంద్రమే చేపట్టాలని విజ్ఞప్తి చేసింది. ట్రిపుల్ఆర్ దక్షిణ భాగాన్ని కూడా కేంద్రమే నిర్మిస్తే అందుకు అవసరమైన డీపీఆర్‌లు, ఇతరత్రా కార్యక్రమాలు ఎన్హెచ్ఏఐ ఆధ్వర్యంలోనే పూర్తిచేస్తారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ట్రిపుల్ఆర్ నిర్మాణ బాధ్యత ఎన్‌హెచ్‌ఏఐదే. భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడంతోపాటు అందుకయ్యే ఖర్చులో సగం భరిస్తే సరిపోతుందని, డీపీఆర్‌లు రూపొందించాల్సిన అవసరం లేదని ఎన్హెచ్ఏఐ అధికారులు చెప్తున్నారు. కాగా, గతంలో రూపొందించిన అలైన్మెంట్ ప్రకారం ట్రిపుల్ఆర్ దక్షిణ భాగం పొడవు 182.23 కిలోమీటర్లు. ఆ తర్వాత అలైన్‌మెంట్‌ను మార్చడంతో ఇది 195 కిలోమీటర్లకు పెరిగినట్టు తెలిసింది. కొత్త అలైన్మెంట్ ప్రకారం దక్షిణ భాగం నిర్మాణానికి ఎన్హెచ్ఏఐ ఒప్పుకోకుంటే ఆ పనులను తామే చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే కన్సల్టెంట్ల నియామకానికి టెండర్లను ఆహ్వానిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి.