హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం రెండు బీసీ గురుకుల డిగ్రీ లా కాలేజీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు హన్మకొండలో ఒకటి, రంగారెడ్డి జిల్లా కందుకూరులో మరొకటి మంజూరు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది నుంచే తరగతులు ప్రారంభిస్తారు. ఈ కాలేజీల్లో బీఏ ఎల్ఎల్బీ, బీబీఏ ఎల్ఎల్ఎల్బీ 5 ఇంటిగ్రేటెడ్ కోర్సులను ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ ఇప్పటికే 16 డిగ్రీ కాలేజీలను ఏర్పాటుచేశారు. ఈ విద్యాసంవత్సరంలో మరో 17 బీసీ డిగ్రీ కాలేజీలను మంజూరు చేశారు.
ఈ 17 కాలేజీల్లో వినూత్న, ఉపాధినిచ్చే కోర్సులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే వికారాబాద్లో ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో ఫిల్మ్ అండ్ మీడియా, యానిమేషన్ అండ్ వీఎఫ్ఎక్స్, ఫొటోగ్రఫీ అండ్ డిజిటల్ ఇమేజింగ్ కోర్సులతో బీఏ(హనర్స్), సంగారెడ్డి కాలేజీలో హోటల్ మేనేజ్ మెంట్ కోర్సులను అందుబాటులోకి తెచ్చింది. 13 బీసీ గురుకుల గురుకుల కాలేజీల్లో బీఎస్సీ(ఎంపీసీఎస్), బీఎస్సీ(బీజెడ్సీ), బీకాం, బీఏ కోర్సులు ప్రవేశపెట్టింది. మిగిలిన 2 గురుకుల డిగ్రీ కాలేజీల్లో న్యాయవిద్యను ప్రవేశపెడుతూ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 33 బీసీ డిగ్రీ గురుకులాల ద్వారా 31,680 మంది బీసీ విద్యార్థులకు ప్రపంచస్థాయి ఉన్నత విద్య అందనుండటం విశేషం. అదేవిధంగా, ఇప్పటికే ఎస్సీ డిగ్రీ గురుకుల కాలేజీల్లో సైనిక్, ఆర్మ్ఫోర్స్, ఫైన్ఆర్ట్స్, హోటల్ మేనేజ్మెంట్ కోర్సులను నిర్వహిస్తున్నారు.
బీసీల విద్యాభివృద్ధికి కేరాఫ్ కేసీఆర్ సరారే: మంత్రి గంగుల
దేశంలో బీసీల సమగ్ర విద్యాభివృద్ధికి కేరాఫ్ కేసీఆర్ సరారేనని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ కొనియాడారు. నూతనంగా 17 డిగ్రీ గురుకులాలను ఈ ఏడాది నుంచే ప్రారంభిస్తున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్ సంకల్పం వల్లే బీసీ గురుకులాలు 19 నుంచి 327కు పెరిగాయని హర్షం వ్యక్తం చేశారు. విద్య ద్వారా వెనకబడిన వర్గాల జీవితాల్లో స మూల మార్పులు వస్తాయని సీఎం కేసీఆ ర్ విశ్వసించడమేగాక ఆ దిశగా నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారని కొనియాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి మంత్రి గంగుల ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.