హైదరాబాద్, ఏప్రిల్10 (నమస్తే తెలంగాణ): పదో తరగతి హిందీ పేపర్ లీకేజీ కేసు దర్యాప్తునకు ప్రధాన నిందితుడైన కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ సహకరించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు దృష్టికి తెచ్చింది. తన సెల్‌ఫోన్‌ను దర్యాప్తు అధికారులకు ఇవ్వడం లేదని ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ చెప్పారు. పదో తరగతి పరీక్ష పేపర్ల లీకేజీ కేసులో కింది కోర్టు తనను రిమాండ్‌కు తరలిస్తూ జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ బండి సంజయ్ దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ సోమవారం విచారణ చేపట్టారు. ఏజీ వాదనలను కొనసాగిస్తూ, కిందికోర్టు సంజయ్‌కు బెయిల్ మంజూరు చేసినందున దీనిపై విచారణ అవసరం లేదని, దర్యాప్తునకు సహకరించని ఆయన బెయిల్‌ను రద్దు చేయాలని కోరారు. బండి తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, రిమాండ్ రిపోర్ట్‌ను కొట్టేయాలన్న పిటిషన్‌పై విచారణ మూసివేయాలన్న ప్రభుత్వ వాదనను వ్యతిరేకించారు. సీనియర్ న్యాయవాది వాదనలు వినిపిస్తారని, విచారణను వాయిదా వేయాలని కోరారు. దీంతో ఈ నెల 21వరకు గడువు ఇస్తూ హైకోర్టు విచారణను వాయిదా వేసింది.
హైదరాబాద్, ఏప్రిల్10 నమస్తే తెలంగాణ: ఎస్సీ, ఎస్టీ కేసులో వ్యక్తిగత పూచీకత్తు తీసుకొని ఎంపీ అర్వింద్‌ను విడుదల చేయాలని పోలీసులకు హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. 2021 చంచల్‌గూడ జైలు వద్ద విలేకరుల సమావేశంలో ఎస్పీ, ఎస్టీలను కించపరిచేలా మాట్లాడారంటూ నమోదైన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దీనిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ సోమవారం విచారణ చేపట్టారు. పిటిషనర్‌ను అరెస్టు చేయాలనే యోచనలో పోలీసులు లేరని, సీఆర్పీసీలోని 41ఎ నోటీసులు జారీ చేస్తామని పబ్లిక్ ప్రాసిక్యూటర్ సీ ప్రతాప్‌రెడ్డి చెప్పారు. పీపీ హామీని హైకోర్టు పరిగణనలోకి తీసుకున్నది. అరెస్టు చేసే ఉద్దేశం పోలీసులకు లేనందున వ్యక్తిగత పూచీకత్తుపై అర్వింద్‌ను విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అర్వింద్‌పై ఫిర్యాదు చేసిన బంగారు సాయిలును ప్రతివాదిగా చేర్చాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. తొలుత పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది రచనారెడ్డి స్పందిస్తూ, విచారణకు ఎంపీ అర్వింద్ సహకరిస్తారని, ఎస్సీ, ఎస్టీలను కించపరిచే ఉద్దేశం ఆయనకు లేదని తెలిపారు.
హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఫోన్ రికవరీ కోసం వరంగల్ కమిషనరేట్ పోలీసులు నోటీసు పంపించారు. ఈ నోటీసుపై తన న్యాయవాదులు విద్యాసాగర్‌రెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డి, అమరేందర్‌రెడ్డి ద్వారా బండి సోమవారం లేఖ పంపించారు. కరీంనగర్లో తనను పోలీసులు అరెస్టు చేసిన సమయంలో ఫోన్ పోయిందని, దీనిపై అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశానని లేఖలో వివరణ ఇచ్చినట్టు తెలిసింది. బండి సంజయ్ పంపించిన లేఖను న్యాయవాదులు హనుమకొండలోని వరంగల్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలోని సెంట్రల్ డీసీపీ బారి, కమలాపూర్ ఇన్స్పెక్టర్ సంజీవ్‌కు అందజేసినట్టు సమాచారం.
ఇదే కేసులో కమలాపూర్ మండలం దేశరాజుపల్లికి చెందిన పోతబోయిన వర్షిత్ ఆలియాస్ చందును అరెస్టు చేసినట్టు సోమవారం పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఏ3 నిందితుడిగా ఉన్న మహేశ్‌కు చందు దగ్గరి బంధువు అని తెలిసింది.
హిందీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో డిబార్ అయిన విద్యార్థి దండెబోయిన హరీశ్ హైకోర్టు ఉత్తర్వులతో సోమవారం జరిగిన సామాన్యశాస్త్రం పరీక్షకు హాజరయ్యాడు. ఎంజేపీ బాలుర విద్యాలయంలో పదో తరగతి చదువుతున్న హరీశ్‌కు రెండు పరీక్షలు రాసేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. సంబంధిత పత్రాలు పట్టుకుని పరీక్ష కేంద్రానికి రావడంతో అధికారులు అతడిని హాల్లోకి అనుమతించారు.