Kodanda Reddy | హైదరాబాద్, ఫిబ్రవరి 21(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వరిపంట పొట్ట దశలో ఉన్నది.. మొక్కజొన్న పంటచేలలో గింజ పాలుపోసుకుంటున్నది.. రాష్ట్రవ్యాప్తంగా 50.65 లక్షల ఎకరాల్లో రైతులు వరిసాగు చేస్తున్నారు.. కొన్ని జిల్లాల్లో పైరు ఎదుగుతున్నది.. ఈ దశలో సీజన్ మధ్యలోనే పంటలసాగుపై రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ చేతులెత్తేసింది. వరిసాగు చేయవద్దని ప్రకటించింది. ఈ విషయాన్ని ఏకంగా వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి శుక్రవారం ఆకస్మికంగా విలేకరుల ముందుకొచ్చి చెప్పడంపై రైతుల్లో ఆందోళన నెలకొన్నది. సాధారణంగా మార్చి తర్వాతే ఎండలు ముదురుతాయని, ఈ ఏడాది ఆ పరిస్థితికి భిన్నంగా ఫిబ్రవరిలోనే ఎండలు మండిపోతున్నాయని ఈ సందర్భంగా కోదండరెడ్డి చెప్పుకొచ్చారు.
ఎండ దెబ్బతో భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయని, నీళ్లుంటేనే పంటలు వేసుకోవాలని, నీళ్లు లేనప్పుడు వరి వేయడం వలన ప్రయోజనం ఉండదని చెప్పారు. పంటలపై పెట్టుబడులు పెట్టి రైతులు నష్టపోవద్దని సూచించారు. ముఖ్యంగా బోర్లు వేసి అప్పులపాలు కావొద్దని, సీఎం రేవంత్‌రెడ్డి వ్యవసాయానికి చేయాల్సింది మొత్తం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఎండల తీవ్రతతో పంటలు ఎండిపోతున్నాయని, దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నట్టు తమ కమిషన్ దృష్టికి వచ్చిందని వివరించారు. ఉన్న పంటలను కాపాడుకుంటే చాలని సూచించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకే ఆయన విలేకరుల సమావేశం పెట్టి మాట్లాడినట్టు తెలుస్తున్నది.
ఒకవైపు సాగునీరందక పంటలు ఎండుతున్నాయి. సాగునీటికోసం అన్నదాతలు రోడ్డెక్కుతున్నారు. మరోవైపు మన ప్రాజెక్టులను ఎండబెట్టి ఏపీకి నదీజలాలు తరలుతున్నాయి. ఈ దశలో కోదండరెడ్డితో సర్కారు కరువు పాట పాడటంపై అన్నదాతల్లో అనుమానం రేకెత్తిస్తున్నది. వాస్తవానికి నవంబర్, డిసెంబర్ మాసాల్లో రైతులు వరినాట్లు వేస్తారు. ఆ తర్వాత మొక్కజొన్న, వేరుశనగ విత్తనాలు వేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఏదైనా సలహాలు, సూచనలు చేయాలనుకుంటే ఆ సమయంలోనే రైతులకు చెప్పాలి. కానీ పైరు పొట్టదశకు వచ్చే సీజన్లో, మొక్కజొన్న గింజ పాలుపోసుకునే వేళ కోదండరెడ్డి వచ్చి పంటలు వేసుకోవద్దని సూచించడం సర్కారు బేలతనమేనని రైతులు అంటున్నారు. వరికి బోనస్, రైతు భరోసా, ధాన్యం కొనుగోళ్ల నుంచి తప్పించుకోవడానికే ప్రభుత్వం కొత్త నాటకానికి తెరలేపిందని రైతులు అనుమానిస్తున్నారు.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోదావరిపై కాళేశ్వరం, కృష్టా మీద భీమా, నెట్టెంపాడు, పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టులతో రిజర్వాయర్లు నింపి చెరువులకు నీళ్లు మళ్లించేవారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్‌పై కక్షతో కాళేశ్వరం ప్రాజెక్టును పండబెట్టి, చెరువులను ఎండబెట్టిన ఫలితం.. రైతు అనుభవంలోకి వస్తున్నది. కుంగిన పిల్లర్లతో సంబంధం లేకుండా నీళ్లు లిఫ్ట్ చేసే అవకాశం ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా రిజర్వాయర్లను నింపకపోవడంలో వేసవి ఆరంభంకాక ముందే గ్రామాల్లో తీవ్రత ఎకువగా కనిపిస్తున్నది. వాగులు, బావులు, బోర్లు ఎండిపోతున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా నారు దశలోనే మూడు లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయిందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఫిబ్రవరి చివరి నాటికి మరో మూడు లక్షల ఎకరాల్లో వరి, మొక్కజొన్న, వేరుశనగ పంటలు ఎండిపోయే ప్రమాదం ఉన్నదని అధికారులు ప్రభుత్వానికి నివేదించినట్టు తెలిసింది. సీజన్ ఆరంభంలోనే చెరువులు నింపి ఉంటే భూగర్భజలాలు పెరిగేవి. ఇప్పుడా పరిస్థితి లేకపోవడంతో భూగర్భ జలమట్టాలు పడిపోతున్నట్టు అధికారులు చెప్పినట్టు తెలిసింది. ప్రధానంగా సాగునీరందక, విద్యుత్తు లేక బోర్లు, ఊటబావుల కింద పంటలు ఎండిపోతున్నట్టు అధికారులు నివేదించడంతో కోదండరెడ్డి ఆకస్మికంగా మీడియా ముందుకు వచ్చినట్టు తెలుస్తున్నది.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ సమయానికి కాళేశ్వరం నీళ్లు పారి చెరువులు నిండి బోరుబావుల్లో జల ఊరేదని సూర్యాపేట జిల్లా కర్విరాల కొత్తగూడెం రైతు సత్యనారాయణ చెప్పారు. కేసీఆర్‌పై కోపంతోనే చెరువులు ఎండబెట్టి, ఇప్పుడు పంట వేసుకోవద్దంటే ఎటుపోవాలని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ పాలనలో ఎండాకాలంలో సైతం చెరువులు, చెక్‌డ్యాంలు నిండి పంటలకు నీళ్లు అందాయని, ఆ రోజు నిండుగా పారిన కాల్వల్లో ఈ రోజు చుక్కనీరు పారడం లేదుని అదే జిల్లాలోని ఎర్రపహడ్ గ్రామానికి చెందిన మల్లేశం తన అనుభవాన్ని చెప్పారు.