హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): తాజాగా తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో ఏనుగుల మంద సంచరిస్తుందన్న సమాచారంతో రాష్ట్ర అటవీ శాఖ అప్రమత్తమైంది. ఏనుగుల మంద వస్తే ఆ సంక్షోభాన్ని ఎలా ఎదురోవాలన్న అంశంపై సోమవారం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా దూలపల్లి అటవీ అకాడమీలో ప్రత్యేకంగా అటవీశాఖ వర్క్‌షాప్ నిర్వహించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల అటవీ ముఖ్య అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో అటవీశాఖ సంరక్షణ ప్రధానాధికారి, పీసీసీఎఫ్ ఆర్ఎం డొబ్రియాల్ పాల్గొన్నారు. ఇటీవలే మహారాష్ట్రలో సంచరిస్తున్న ఏనుగుల మంద నుంచి ఓ ఏనుగు తప్పిపోయి రాష్ట్రంలోకి ప్రవేశించిందని, అటవీశాఖ అధికారులు ఎంతో శ్రమించి దానిని తిరిగి మహారాష్ట్ర అడవుల్లోకి పంపించినట్టు ఆర్ఎం డొబ్రియాల్ ఈ సందర్భంగా చెప్పారు.
ఏనుగుల మంద తిరిగి రాష్ట్రంలోకి ప్రవేశిస్తే జరిగే సంక్షోభం గురించి వర్షాప్లో చర్చించారు. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల ప్రజలకు, రైతులకు అవగాహన కల్పించాలని పీసీసీఎఫ్ జిల్లా అధికారులకు సూచించారు. ఛత్తీస్‌గడ్‌కు చెందిన రిటైర్డ్ సీసీఫ్ పీవీ నరసింహారావు ఏనుగుల మందను ఎదురోవడానికి ఆ రాష్ట్రంలో వారు ఉపయోగించిన వివిధ పద్ధతులను అధికారులకు ప్రొజెక్టర్ ద్వారా వివరించారు. వరల్డ్ వైల్డ్ ఫండ్ ఇండియా (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) బోర్డు చైర్మన్ అనిల్ వీ ఏపూర్ తన అనుభవాలను పంచుకున్నారు. కార్యక్రమంలో పీసీసీఎఫ్ (వైల్డ్‌లైఫ్) ఎంసీ ఫర్గెయిన్, పీసీసీఎఫ్ (ప్రొటెక్షన్-విజిలెన్స్) డైరెక్టర్ ఈలుసింగ్ మేరు, పీసీసీఎఫ్ (కంపా) డాక్టర్ సువర్ణ, అడిషనల్ పీసీసీఎఫ్ సునీతా భాగవత్ ఇతర అధికారులు పాల్గొన్నారు.