హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): ఓటు హక్కు నమోదు కోసం కొత్తగా 17 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది. తాము చేపట్టిన విస్తృత ప్రచారం వల్లే ఇది సాధ్యమైందని తెలిపింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఓటర్ల జాబితాను తప్పుల్లేకుండా రూపొందించేందుకు ఎన్నికల కమిషన్ జనవరిలో ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ను ప్రారంభించిందని, అందులో భాగంగా ఓటు హక్కు నమోదు, తప్పుల సవరణపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించినట్టు తెలిపింది. ఆ చర్యల ఫలితంగా ఆరుగురి కంటే ఎక్కువ మంది ఓటర్లు ఉన్న ఇండ్లను సర్వే చేసినట్టు వివరించింది.
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 17 లక్షల మంది కొత్తగా ఓటుహక్కుకు పేర్లు నమోదు చేసుకున్నారని, అందులో జీహెచ్ఎంసీ పరిధిలోని 4 జిల్లాల్లోనే 7.15 లక్షల వరకు ఉన్నారని తెలిపింది. ఓటరు కార్డులో పేర్లు, చిరునామా, ఇతర వ్యక్తిగత వివరాల సవరణకు దాదాపు 11.80 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని, వీరిలో జీహెచ్ఎంసీ పరిధిలో 3.77 లక్షల మంది ఉన్నారని వెల్లడించింది. పూర్తిగా తప్పుల్లేని ఓటర్ల జాబితాను రూపొందించడానికి 40 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, తొలగింపుల ధ్రువీకరణకు తహసీల్దార్, ఇద్దరు డిప్యూటీ తహసీల్దార్లను నియమించామని తెలిపింది.