Paddy Procurement | హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ ) : రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించి నెలరోజులైనా ఇప్పటి వరకు కొనుగోలు చేసింది 5.77లక్షల టన్నులే. ఇప్పటికీ కనీసం పరికరాలను కూడా కేంద్రాలకు సరఫరా చేయలేదు. ప్యాడీ క్లీనర్లు, వేయింగ్ మిషన్లు, తేమ మిషన్లు, టార్పాలిన్లు.. ఇలా వేటినీ ఇవ్వలేదు. పాత పరికరాలతోనే కాలం వెళ్ల్లదీస్తున్నారు. వాటినే కొనుగోలు కేంద్రాలకు అందజేస్తున్నారు. గోనె సంచుల కొనుగోళ్ల కోసం పౌర సరఫరాల సంస్థ రెండు రోజుల క్రితం టెంటర్లు పిలవగా, ప్యాడీ క్లీనర్లు, టార్పాలిన్లు, వేయింగ్ మిషన్లు, తేమ మిషన్లు, కాలిపర్స్ సరఫరా కోసం ఇప్పటివరకూ టెండర్లు పిలవలేదు. ఆగ్రోస్, హాకా సంస్థలకు ఆయా పరికరాల సరఫరా బాధ్యతను అప్పగించారు. కానీ, ఇప్పటివరకు ఈ ప్రక్రియ టెండర్ వరకు కూడా వెళ్లలేదు. దీని వెనుక ఆగ్రోస్‌లో ఏదో గూడుపుటాని నడుస్తున్నట్టు తెలిసింది. ఇతర ప్రైవేటు సంస్థలకు టెండర్లు అప్పగించడానికి బదులుగా తానే సొంతంగా సరఫరా చేయాలనే ఆలోచనలో ఆగ్రోస్ ఉన్నట్టు సమాచారం. ఇందుకోసం ఇటీవల సంస్థకు చెందిన ఇద్దరు కీలక అధికారులు గుజరాత్, పంజాబ్ రాష్ర్టాల్లో పర్యటించినట్టు తెలిసింది. అక్కడ పలు సంస్థలతో మాట్లాడుకొని సరఫరా చేసేలా అంతర్గతంగా ఒప్పందం చేసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇందుకోసం టెండర్ల ప్రక్రియను కావాలనే వాయి దా వేసినట్టు తెలిసింది.
ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇప్పటివరకు కొనుగోలు చేసిన ధాన్యమే ఉదాహరణగా నిలుస్తున్నది. మార్చి 20 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించినట్టు పౌరసరఫరాల సంస్థ ప్రకటించింది. ఇప్పటివరకు 5.77 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. నెల రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు కనీసం ఆరు లక్షల టన్నులు కూడా దాటకపోవడం గమనార్హం. ఒకవైపు రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం పోసి రోజుల తరబడిగా వారు ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 7,337 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ, అవి కేవలం పేపర్లకే పరిమితమవుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొనుగోలు కేంద్రాల్లో వేయింగ్ మిషన్లు, తేమ మిషన్లు, ప్యాడీ క్లీనర్లు, గన్నీ సంచులను అందుబాటులో ఉంచలేదని తెలిసింది. 7,337 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ప్రభుత్వం ఇప్పటివరకు కొనుగోలు చేసింది 5.77 లక్షల టన్నులు. ఈ లెక్కన ఒక్కో కొనుగోలు కేంద్రంలో సరాసరిగా 78 టన్నులు మాత్రమే కొనుగోలు చేసినట్టు లెక్క!