హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): మున్సిపల్ ఎన్నికలను ఫిబ్రవరి రెండో వారంలోగా పూర్తిచేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఆదివారం ములుగు జిల్లా మేడారంలోని హరిత హోటల్లో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రివర్గం పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. సమావేశం అనంతరం భేటీ వివరాలను మంత్రులు పొంగులేటి, కోమటిరెడ్డి, సీతక్క మీడియాకు వివరించారు. రాష్ట్రంలో పదవీకాలం ముగిసిన 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలోని 2,996 వార్డులు, డివిజన్లకు ఎన్నికలు నిర్వహించాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లుచేసుకోవాలని నిర్ణయించినట్టు చెప్పారు.
2027 జూలై 27 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. నల్లగొండ జిల్లాలోని ఎంజీయూ లా కాలేజీలో కొత్తగా 24 పోస్టులు, ఫార్మసీ కాలేజీలో 28 పోస్టులు, ఐలమ్మ మహిళా వర్సిటీలో రిజిస్ట్రార్ పోస్టు భర్తీకి ఆమోదం తెలిపింది. మెట్రో రైల్ ఫేజ్-1 ప్రాజెక్టును స్వాధీనంపై చర్చించింది. ఫేజ్ 2-ఏ, ఫేజ్ 2-బీలోని కారిడార్ల నిర్మాణానికి రూ.2,787 కోట్ల అంచనా వ్యయంతో భూసేకరణ ప్రక్రియ పూర్తికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ము లుగు జిల్లాలో పొట్లాపూర్ లిఫ్ట్‌కు ఆమోదం తెలిపినట్టు మంత్రులు వెల్లడించారు.