KCR | ఎన్నికల్లో మతాల గురించి మాట్లాడటం నిబంధనలకు విరుద్ధం. హోంమంత్రి అమిత్‌షా రోజూ దేవుడిబొమ్మ నెత్తిమీద, చేతుల్లో పెట్టుకొని సభల్లో మాట్లాడితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు కనిపించదు. డైరెక్ట్‌గానే హిందువులు, ముస్లింలని అడ్డగోలుగా స్వయంగా దేశ ప్రధాని మాట్లాడితే ఈసీకి కనిపించదు. ‘నీ గుడ్లు పీకి గోలీలు ఆడతా.. నీ పేగులు తీసి మెడలో వేసుకుంటం, నిన్ను పండబెట్టి తొక్కుతం’ అని సీఎం మాట్లాడితే ఎన్నికల కమిషన్‌కు అది సభ్యంగా కనిపిస్తున్నది.
– కేసీఆర్
వాళ్ల గుండెలు వణుకుతున్నయ్.. అందుకే ఆగవట్టిండ్రు 48 గంటల తర్వాత.. నిషేధించిన నా గొంతు మళ్లీ మాట్లాడుతున్నది. నేను ఏం చేశానని నా గొంతును ఆపారు? ఎందుకు నా గొంతు నొక్కిండ్రు? కేసీఆర్ బస్సుయాత్ర ప్రారంభమైన తర్వాత కాంగ్రెస్, బీజేపీలకు గుండెలు వణుకుతున్నయ్. ఇద్దరికిద్దరు కుమ్మక్కయ్యి ఎట్లయిన నన్ను ఆగవట్టాలెనని, నిలువరించాలెనని కుట్ర చేసి, నాపై బ్యాన్ పెట్టించిండ్రు.
– కేసీఆర్
రాబోయే రోజుల్లో సింగరేణిని ఊడగొట్టి.. అదానీకి అప్పగిస్తే కార్మికుల నోట్లో మట్టి.. ప్రజల నోట్లో మట్టి.. మొత్తం సింగరేణి ప్రాంతాల్లో ఉన్న మన బతుకులు బొగ్గయ్యే పరిస్థితి ఉంటుంది. సింగరేణి కార్మికులు చైతన్యంతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. నేను ఎందుకు అదానీని అడుగు పెట్టనీయలేదో, ఇప్పుడు ముఖ్యమంత్రి ఎందుకు ఆహ్వానిస్తున్నాడో ఇంట్లో చర్చించుకోవాలి.
-కేసీఆర్
రేవంత్ హామీల ఎగవేతపై రామగుండం రోడ్‌షోలో కేసీఆర్ వ్యంగ్యాస్ర్తాలు విసిరారు. ‘మనం కల్యాణలక్ష్మి ఇస్తుంటిమి. వీళ్లు తులం బంగారం కలిపి ఇస్తమన్నరు. ఇచ్చిండ్రా? మీకు రెండు తులాలు వచ్చిందటగదా. నిజమేనా?’ అనగా.. లేదు లేదంటూ ప్రజలనుంచి సమాధానం వచ్చింది. ‘కనీసం తులం బంగారమన్న ఇచ్చిండ్రా? లేదా?’ అని అడగగా.. ‘ఎక్కడా రాలేదు’ అని ప్రజలు ప్రతిస్పందించారు. ‘అంటే తులం బంగారమూ తుస్సుమన్నట్టేనా’ అని కేసీఆర్ అనడంతో నవ్వులు విరిశాయి. మరో సందర్భంలో ‘మీ అందరికీ 6వేల పెన్షన్ ఇచ్చిండ్రంట కదా’ అని కేసీఆర్ ప్రశ్నించగా.. ప్రజలు రాలేదని సమాధానమిచ్చారు. ‘నాలుగు వేల పెన్షన్ కూడా ఇయ్యట్లేదా? మేం ఇచ్చిన రెండువేల పెన్షన్ కూడా జనవరి నెలలో ఎగబెట్టిండ్రు గుర్తున్నదా?’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్ ఎన్నికలు పూర్తికాగానే ప్రధాని మోదీ, సీఎం రేవంత్‌రెడ్డి, మోదీ చోటే భాయ్ అదానీ కలిసి సింగరేణి సంస్థను ముంచుతారని బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు హెచ్చరించారు. ఎన్నికల కమిషన్ విధించిన 48 గంటల నిషేధం పూర్తవడంతో శుక్రవారం రాత్రి కేసీఆర్ తన బస్సుయాత్రను తిరిగి ప్రారంభించారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ తరఫున ప్రచారం చేశారు. గోదావరిఖనిలో జరిగిన రోడ్‌షోలో ప్రసంగించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తాను సీఎంగా ఉన్నప్పుడు అ దానీని తెలంగాణలో అడుగు పెట్టనీయలేదని, కానీ రేవంత్‌రెడ్డి దావోస్‌కు వెళ్లి సంతకాలు పెట్టి మరీ ఆహ్వానించారని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికలు కాగానే సింగరేణిని ఊడగొడతారని, ఈ ప్రాంత ప్రజల బతుకులు బొగ్గయ్యే పరిస్థితి ఉన్నదని హెచ్చరించారు.
నాడు మంచిగా ఉన్న సింగరేణిని నిండా ముంచిందే కాంగ్రెస్ పార్టీ అని కేసీఆర్ దుయ్యబట్టారు. ‘సింగరేణి మన ఆస్తి. వందశాతం మనకే ఉండే. కేంద్రం నుంచి తెచ్చిన అప్పులు చెల్లించలేక.. 49% వాటాను కేంద్రానికి అప్పగించింది దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ’ అని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో సింగరేణికి ఎన్నో లాభాలు, పునర్వైభవం తెచ్చామని వివరించారు. నాడు హైటెక్, ఇంటెక్ పేరుపై ఉన్న కార్మిక సంస్థలు డిపెండెంట్ ఉద్యోగాలను మునగ్గొట్టాయని విమర్శించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక వాటిని పునరుద్ధరించి 19వేలకుపైగా యువతకు ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. ఆనాడు నష్టాల్లో ఉన్న సింగరేణిని లాభాల్లోకి తెచ్చామని వివరించారు. ‘సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్’ అనే పేరు మీద మెడికల్ కాలేజీ ఏర్పాటుచేశామని తెలిపారు. ఆ మెడికల్ కాలేజీలో 5% సీట్లు కార్మికుల పిల్లలకే వచ్చేలా కృషి చేశామని చెప్పారు.
‘పార్లమెంట్ ఎన్నికలు కావడమే ఆలస్యం.. మోదీ, రేవంత్‌రెడ్డి కలిసి సింగరేణిని ఊడగొడతరు’ అని కేసీఆర్ హెచ్చరించారు. ‘తెలంగాణకు సింగరేణి కొంగుబంగారం. ఒక ఉద్యోగ వనరు. దీనిని ఇంకా విస్తరించాలి. బయ్యారం ఉక్కు గనులుగానీ, గోదావరి ఇసుక గనులుగానీ సింగరేణికే ఇవ్వాలని నేను ఆలోచించిన’ అని పేర్కొన్నారు. అలాంటిది ఇప్పుడు అదానీ బొగ్గును తీసుకొనిరావడానికి సీఎం ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు. ‘కొప్పుల ఈశ్వర్ ఎంపీగా గెలిస్తే.. మొత్తం బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో కొట్లాడి, పీక పట్టుకొని.. బిడ్డా మా సింగరేణిని ఎట్లా మూస్తవ్ అని కొట్లాడుతరు’ అని పేర్కొన్నారు. లేదంటే సింగరేణి మాత్రం మునిగిపోతుందని, మీ బిడ్డగా గోదావరిఖని సెంటర్లో చెప్తున్నా.. ‘తస్మాత్ జాగ్రత్త’ అని హెచ్చరించారు. ‘నాడు ఉద్యమంలో ఒక దీపంతో మరో దీపం వెలిగించినట్టు.. ఎప్పుడైతే తెలంగాణకు ప్రమాదం వస్తతో, ఎప్పుడైతే తెలంగాణ ప్రమాదంలో పడుతుందో మనందరం ఏకం కావాలె. సరైన నిర్ణయాలు తీసుకోవాలె’ అని కోరారు. ఎవరైతే మన హక్కులు కాపాడుతారో, మన నదులను కాపాడుతారో, మన సింగరేణినిని కాపాడుతారో ఆలోచించాలని విజ్ఞప్తిచేశారు. అలా జరుగకపోతే పెద్ద ప్రమాదంలో పడతామని హెచ్చరించారు.
‘రాజకీయాల్లో మతాల గురించి మాట్లాడటం చాలా పెద్ద తప్పు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధం. అమిత్‌షా రోజూ దేవుడిబొమ్మ నెత్తిమీత, చేతుల్లో పెట్టుకొని సభల్లో మాట్లాడితే ఈసీకి కనిపించదు. డైరెక్ట్‌గానే హిందువులు, ముస్లింలని అడ్డగోలుగా మతాన్ని అడ్డుపెట్టుకొని ప్రధాని మాట్లాడినా ఎన్నికల కమిషన్‌కు అది కనిపించదు’ అని కేసీఆర్ ఎద్దేవా చేశారు. ‘మన రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఏం చేశావని ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తే.. అతను ‘నీ గుడ్లు పీకి గోలీలు ఆడతా.. నీ పేగులు తీసి మెడలో వేసుకుంటం, నిన్ను పంటబెట్టి తొక్కుతం’ అని మాట్లాడితే ఎన్నికల కమిషన్‌కు అది సభ్యంగా ఉన్నది’ అంటూ ఆవేదన వ్యక్తంచేశారు. అయితే, చేనేత కార్మికులకు అన్యాయం జరుగుతున్నదని మాట్లాడితే.. తనపై అన్యాయంగా కక్షకట్టారని చెప్పారు.
‘ఐదు నెలల కింద రాష్టంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇప్పుడెలా ఉన్నాయి? ఎవరి చేతగానితనం దానికి కారణం? ఇవాళ పెద్దపల్లి జిల్లాల్లోనే 50వేల ఎకరాలకుపైగా పంట పొలాలు ఎండిపోయాయి. దీనికి కారణం ఎవరు? గత పదేండ్లలో పొలాలు ఎప్పుడైనా ఎండాయా? పోయిన పదేండ్లలో పొలాలు ఎండాయా?’ అని కేసీఆర్ ప్రశ్నించారు. ఇందుకు అశేష జనవాహిని.. ‘లేదూ.. లేదూ’ అంటూ సమాధానం ఇచ్చారు. ఈ పరిస్థితికి కారణం ఎవరో ఆలోచన చేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ‘గత 9 ఏండ్లలో కరెంటు కోతలు లేవు. ఈరోజు కరెంటు కోతలు ఎవరు పెట్టారు’ అని కేసీఆర్ ప్రశ్నించగా ‘కాంగ్రెస్.. కాంగ్రెస్.. కాంగ్రెస్’ అంటూ పెద్ద ఎత్తున ప్రజల నుంచి సమాధానం వచ్చింది. గోదావరిఖనిలో గత ఆరేడు సంవత్సరాలుగా పుష్కలంగా అందరికీ నల్లాపెట్టి, ప్రతి ఇంట్లో ప్రతిరోజూ నీళ్లు ఇచ్చామని తెలిపారు. ‘ఈరోజు రెండ్రోజులకు ఒకసారి, దినం తప్పి, దినం నీళ్లు ఎందుకు వస్తున్నాయి? ఎందుకు మురికినీళ్లు వస్తున్నాయి? దీనికి కారణం ఎవరు? దీనిని ఆలోచన చేయాలి’ అని పిలుపునిచ్చారు.
ముఖ్యమంత్రి ఏ ఊరికిపోయినా.. ఆ దేవుళ్లమీద ఒట్లు వేస్తున్నడని కేసీఆర్ ఎద్దేవా చేశారు. ‘యాదగిరిగుట్టకు పోతే నర్సన్నమీద ఒట్టు, భద్రాచలం పోతే రాములవారి మీద ఒట్టు.. ఎవడైనా పనిచేసేటోడు దేవుళ్ల మీద ఒట్లు పెట్టుకుంటడ? ఎప్పుడైనా తొండి చేసేటోడే ఒట్లు పెట్టుకుంటడు’ అని ఎద్దేవా చేశారు. నాడు ‘కేసీఆర్ ఒకటే లక్ష మాఫీ చేసిండు.. నేను రెండు లక్షలు మాఫీ చేస్తా.. మీరు ఉరుకుండ్రి, డబ్బులు తీసుకోండ్రి, డిసెంబర్ 9న పదిన్నరకే మొత్తం మాఫీ చేస్తానని నేటి ముఖ్యమంత్రి చెప్పిండు.. ‘అయిందా రుణమాఫీ?’ అని కేసీఆర్ ప్రశ్నించగా.. ‘లేదూ.. కాలేదు..’ అని ప్రజల నుంచి సమాధానం వచ్చింది. ‘అప్పుడే డిసెంబర్ 9 పోవడంతో.. మళ్లీ ఇప్పుడు ఆగస్టు 15 అంటుండు. ఇంకొక మంత్రేమో మేము ఇస్తమని చెప్పలేదంటడు. మొత్తానికి నిరుద్యోగ భృతి కూడా ఎగబెట్టిండు. ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘వచ్చే ఎన్నికల్లో గత్తరబిత్తరగా, ఆగమాగం కాకుండా.. ఆలోచించి.. ఎవరు ఏ టైంకు ఉంటే కరెక్టో ఆలోచించి ఓటు వేయాలి’ అని ప్రజలను కోరారు.
నాడు తెలంగాణ వస్తేనే ప్రజల బాధలు తీరుతాయని భావించి 2001లో గులాబీ జెండా ఎగురవేశానని కేసీఆర్ గుర్తు చేశారు. తన ప్రాణాలు అడ్డంపెట్టి తెలంగాణ కోసం పోరాడానని, చావునోట్లో తల పెట్టి రాష్ర్టాన్ని సాధించానని గుర్తుచేశారు. రాష్ట్రం వచ్చాక సింగరేణిని బాగు చేసుకున్నామని, ప్రాజెక్టులు కట్టుకున్నామని, నీళ్లు, కరెంటు తెచ్చుకున్నామని, పేదసాదలను ఆదుకున్నామని వివరించారు. ఇప్పుడు అరచేతిలో వైకుంఠం చూపించి, ఆరు గ్యారెంటీలు అని చెప్పి మోసం చేసిన కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాత పెట్టే సమయం, బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందని పిలుపునిచ్చారు. తాము ఇచ్చిన వాగ్ధానాలన్నీ అమలయ్యాయని సీఎం అంటున్నాడని, నిజమేనా? అని కేసీఆర్ ప్రశ్నించగా.. ‘కాలేదు.. కాలేదు’ అంటూ ప్రజలు పెద్ద ఎత్తున సమాధానం ఇచ్చారు. ‘ముసలివాళ్లకు రూ.4వేల పెన్షన్ వచ్చిందా?’ అని ప్రశ్నించగా ‘రాలేదు.. రాలేదు’ అని ప్రజల నుంచి సమాధానం వచ్చింది. గతంలో రూ.200 పెన్షన్ ఉంటే తాను రూ.2 వేలకు పెంచి వారిని కడుపులో పెట్టుకొని కాపాడుకున్నామని గుర్తుచేశారు.
కాంగ్రెస్ పార్టీ రూ.4 వేలు ఇస్తమని చెప్పి మోసం చేసిందని దుయ్యబట్టారు. పైగా జనవరిలో రూ.2 వేలు కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టిందని మండిపడ్డారు. దళితులకు దళితబంధు బంద్ చేశారని విమర్శించారు. ‘ఎందుకు బంద్ చేయాలె? వాళ్లు ఏం పాపం చేసినరు? వాళ్లు పైకి రావొద్దా? అట్లనే అట్టడుగున ఉండాల్నా? సంవత్సరానికి లక్ష కుటుంబాలన్నా పైకి రావాలని మేం పోయిన సంవత్సరం 1.30 లక్షల కుటుంబాలకు యూనిట్లు మంజూరు చేసినం. డబ్బులు కూడా విడుదల చేసినం. వాటిటన్నింటినీ రేవంత్‌రెడ్డి వాపస్ తీసుకున్నడు’ అని పేర్కొన్నారు. దీనికి దళితులు ప్రతీకారం చెయ్యాలని, ముఖ్యమంత్రి మెడలు వంచాలంటే బీఆర్ఎస్కు ఓటేసి ఒక సురుకు అంటియ్యాలని కోరారు. అప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వానికి క్యాలి (తెలివి) వస్తుందని చెప్పారు. బీఆర్ఎస్ బలంగా ఉంటేనే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల అమలు కోసం ఉద్యమాలు చేస్తుందని పేర్కొన్నారు. పెద్దపల్లి పార్లమెట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ మూడో స్థానంలో ఉన్నదని, బీజేపీ, బీఆర్ఎస్ మధ్యే పోటీ ఉన్నదని స్పష్టంచేశారు. ముస్లింలు పొరబాటున కాంగ్రెస్‌కు ఓటేస్తే ఫలితం ఉండదని హెచ్చరించారు.
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నదులు అప్పజెప్తే చప్పుడు చెయ్యడని, కృష్టా నదిని కేఆర్ఎంబీకి అప్పగించిండని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘గోదావరి నీళ్లు ఎత్తుకపోతా.. ఇచ్చంపల్లి దగ్గర ప్రాజెక్టు కడతా.. తమిళనాడుకు ఇస్తా, కర్ణాటకకు ఇస్తానని ప్రధాని మాట్లాతుంటే, సీఎంకి లెటర్లు పంపుతుంతే.. దానికి కుయ్యు లేదు. కుట్కులేదు’ అని మండిపడ్డారు. ‘నేను సీఎంగా ఉన్ననాడు ఇదే ప్రతిపాదన మోదీ తెచ్చిండు. నా ప్రాణం పోయినా మంచిదే కానీ గోదావరి నీళ్లు ఎత్తుకపోతనంటే ఒప్పుకోను అని చెప్పా. అలాంటిది ఈ ముఖ్యమంత్రి మౌనం వెనుక ఉన్న మతలబు ఏంది? అని ప్రజలు ఆలోచన చేయాలి’ అని కోరారు. ‘ఉన్న ఒకే ఒక్క నది గోదావరి. మన బతుకు. దాన్నే తీసుకొని పోతానంటే.. కాంగ్రెస్ పార్టీ, మంత్రులు, ఎవ్వరూ నోరు తెరిచి మాట్లాడే పరిస్థితి లేదు’ అని అన్నారు.
తాను అధికారంలో ఉన్నప్పుడు అదానీని రాష్ట్రంలో అడుగుపెట్టనీయలేదని, కానీ ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి సంతకాలు పెట్టి మరీ ఆహ్వానించారని కేసీఆర్ పేర్కొన్నారు. అదానీని ప్రధాని మోదీ చిన్నతమ్ముడిగా అభివర్ణించారు. ‘భారతదేశాన్ని మింగుతున్న అదానీ.. రూ.14 లక్షల కోట్లకు పడగెత్తిన అదానీ.. మోదీ అండదండలతో దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను కబళిస్తున్నడు. ఉన్న ఓడరేవులన్నీ ఆయనకు అన్యాక్రాంతం అయినయి. ఉన్న ఎయిర్‌పోర్టులన్నింటినీ అదానికే మోదీ అంకితం చేసిండు’ అని విమర్శించారు. తాను సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్రంలో కరెంటు ఉత్పత్తి కోసం ఆస్ట్రేలియా నుంచి బొగ్గు దిగుమతి చేసుకోవాలని మోదీ సూచించారని తెలిపారు.
ఆస్ట్రేలియా నుంచి బొగ్గు దిగుమతి చేస్తున్నది అదానీ అని పేర్కొన్నారు. ‘అంటే అదానీకి లాభం కలిగించేందుకు.. మనకు రూ.4వేలకే టన్ను దొరికే బొగ్గును టన్నుకు రూ.28 వేలు పెట్టి ఆస్ట్రేలియా నుంచి కొనుమన్నడు. నేను ఒప్పుకోలే. నాకు సొంతంగా సింగరేణి బొగ్గు ఉన్నది. కాబట్టి నా ప్రాణం పోయినా సరే నేను ఒప్పుకోను అని చెప్పిన. బిడ్డా ఇక్కడ అడుగుపెడితే ఖబర్దార్ అని హెచ్చరించిన’ అని పేర్కొన్నారు. ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి దావోస్‌కు పోయి అదానీకి పాటక్ (గేట్లు) తెరిచాడని విమర్శించారు. తెలంగాణకు వచ్చి, నాలుగు చేతులా దోచుకోండి అని సంతకాలు పెట్టి వచ్చాడని మండిపడ్డారు.
‘48 గంటల తర్వాత.. నిషేధించిన నా గొంతు మళ్లీ మాట్లాడుతున్నది. నేను ఏం చేశానని నా గొంతును ఆపారు? ఎందుకు నా గొంతు నొక్కారు?’ అని కేసీఆర్ నిలదీశారు. ‘ చేనేత కార్మికులకు ఆర్డర్లు ఇవ్వడం లేదు. గత ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ల బిల్లులు చెల్లించడం లేదు. అనేకమంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తే.. ఓ కాంగ్రెస్ నాయకుడు ‘మొన్నటిదాక దొబ్బితిన్నది చాలదా? నిరోధ్‌లు, పాపడాలు అమ్ముకోండి’ అన్నారు. చేనేత కార్మికులు మీకంత చులనగా కనిస్తున్నారా? అని కోపంలో నేనొక మాట అన్నా.. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అలా మాట్లాడొచ్చా? అని ప్రశ్నించినా.. బతుకు కావాలని, అన్నం కావాలని, చేసిన పనికి పెండింగ్‌లో ఉన్న రూ.370 కోట్లు పెండింగ్ ఉన్నాయని, కోపమొచ్చి నేనొక మాట అన్నా’ అని వివరించారు. ‘కేసీఆర్ బస్సుయాత్ర ప్రారంభమైన తర్వాత కాంగ్రెస్, బీజేపీలకు గుండెలు వణుకుతున్నయ్’ అని కేసీఆర్ చెప్పగానే ప్రజల నుంచి హర్షధ్వానాలు వచ్చాయి. ‘ఇద్దరికిద్దరు కుమ్మక్కయి, నన్ను నిలువరించాలని, కుట్ర చేసి, నాపై బ్యాన్ పెట్టారు’ అని చెప్పారు. తాను గోదావరిఖనికి రెండు గంటల ముందే వచ్చానని, బ్యాన్ ఉండటం వల్ల 8.15 తర్వాత బయటికి వచ్చినట్టు తెలిపారు.
కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో ఒక్కటైనా అమలవుతున్నదా? అని కేసీఆర్ ప్రశ్నించగా.. ‘లేదు.. లేదు’ అని ప్రజల నుంచి సమాధానం వచ్చింది. ‘మహిళాలకు రూ.2,500 వచ్చాయా?’ అంటే.. ‘లేదూ.. లేదూ’ అని నినదించారు. ‘రైతులకు రెండు లక్షల రుణమాఫీ అయిందా?’ అంటే ‘కాలేదు.. కాలేదు’ అని చెప్పారు. ‘ఆటో రిక్షా కార్మికుల చావులు ఆగుతున్నాయా’? అని అడుగ్గా.. ‘లేదూ.. పెరిగినయ్’ అంటూ ప్రజలు నినదించారు. ‘మహిళలకు ఉచిత బస్సు పెట్టడం మంచిదే కానీ.. ఆటో రిక్షా కార్మికులను పట్టించుకోకపోవడం బాధ కలిగించింది’ అని కేసీఆర్ చెప్పారు. ‘ఉచిత బస్సు ప్రయాణం ద్వారా వచ్చే నష్టాలతో ఆటో రిక్షా కార్మికులు చనిపోతుంటే.. ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. వాళ్ల గురించి ఏ మంచీ, చెడూ ప్రభుత్వం ఆలోచన చేయడంలేదు’ అని ఆవేదన వ్యక్తంచేశారు. ‘ఆటో రిక్షా కార్మికులకు న్యాయం జరగాలి. కార్మికులారా! మీరు ఉద్యమించండి. మీ తరఫున బీఆర్ఎస్ ఉంటుంది. రేపు అసెంబ్లీలో మీ తరఫున మేము పోరాడతాం’ అని కేసీఆర్ హామీ ఇచ్చారు. ‘రైతు కూలీలకు రూ.12,000 ఇస్తమని చెప్పారు. ఎక్కడైనా ఇచ్చిండ్రా? గతంలో మనం కల్యాణలక్ష్మి ఇచ్చేది.. వీళ్లు తులం బంగారం ఇస్తామన్నారు. మీకు రెండు తులాలు వచ్చిందటగద నిజమేనా?’ అని కేసీఆర్ ప్రశ్నించారు. ‘లేదూ.. ’ అంటూ ప్రజల నుంచి సమాధానం వచ్చింది. ‘లేదా.. రాలేదా?.. అయితే తులం బంగారం తుస్సుమన్నదా?’ అని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
కొప్పుల ఈశ్వర్ సౌమ్యుడు, వినయం, విధేయత ఉన్నవాడని కేసీఆర్ అన్నారు. నిస్వార్థంగా బతికినవాడని, మంచి పేరుప్రతిష్ఠలు ఉన్నాయని పేర్కొన్నారు. గోదావరి ఖని బిడ్డ అని, గని కార్మికుడని చెప్పారు. ఆయనను గెలిపిస్తే సింగరేణి కార్మికుల పక్షాన కొట్లాడుతారని భరోసా ఇచ్చారు. సింగరేణిని కాపాడుకోవాలంటే కొప్పుల ఈశ్వర్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
గుజరాత్ మాడల్‌ను ఆదర్శంగా తీసుకుంటానని సీఎం రేవంత్‌రెడ్డి అంటున్నారని, అది పెట్టుబడుల రాజ్యమని కేసీఆర్ విమర్శించారు. ‘మోదీ సాబ్ మీరు మాకు పెద్దన్న. నేను మీ చిన్నన్న. నేను గుజరాత్ మాడల్‌లో చేసుకుంట అని రేవంత్ అంటున్నడు. ఆ గుజరాత్ల మన్నుగూడ లేదు. అంతా దరిద్రం పాడైంది. పేదల సంక్షేమం చూడరు. పెట్టుబడిదారుల రాజ్యమే తప్ప కార్మికులకుగానీ, ప్రజలకుగానీ మాట్లాడే పరిస్థితే లేదు’ అని వివరించారు.
మోదీ పదేండ్ల నుంచి అధికారంలోకి వచ్చారని, ఆయన పాలనలో మత విద్వేషం, హింస, దేశాన్ని నాశనం చేయడం తప్ప.. దేశానికి ఎప్పుడూ మేలు జరగలేదని కేసీఆర్ ధ్వజమెత్తారు. ‘సబ్ కా సాత్.. సబ్ కా వికాస్ అయ్యిందా?’ అని ప్రశ్నించగా.. ‘కాలేదు’ అని ప్రజల నుంచి పెద్ద ఎత్తున సమాధానం వచ్చింది. ‘భేటీ బచావో, భేటీ పడావో.. ఏమన్నా ఉన్నదా?’ అని అడడగా ‘లేదు.. లేదు’ అని సమాధానం ఇచ్చారు. ‘మీ ఖాతాల్లో రూ.15 లక్షలు పడ్డయా?’ అని ప్రశ్నించగా ‘పడలేదు’ అని సమాధానం వచ్చింది. ‘ఇంకెప్పుడొస్తయి.. 15 ఏండ్లకు వస్తయా?’ అని ఎద్దేవా చేశారు.
‘మోదీ పాలనలో దేశం ‘సత్యనాశ్’ అయ్యింది. ఇప్పుడు ప్రపంచ మార్కెట్లో డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.84. మోదీ కన్నా ముందు 14 మంది ప్రధానమంత్రులు పనిచేశారు. ఎవరి హయాంలోనూ రూపాయి విలువ ఇంత తక్కువకు దిగజారలేదు. దేశం అప్పులపాలయ్యింది. కంపెనీలు మాయమైతున్నయి. పబ్లిక్‌సెక్టార్ మూతపడుతున్నది. కార్మికులు రోడ్డున పడుతున్నరు. చివరికి రైల్వేలాంటి లక్షలాది కార్మికులు బతికే సంస్థను కూడా క్రమంగా ప్రైవేట్‌పరం చేస్తున్నారు’ అని మోదీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. మోదీ రాజ్యంలో ప్రైవేటీకరణ తప్ప మరేమీ లేదని మండిపడ్డారు. పరిస్థితి ‘ఒకప్పుడు నేషనలైజేషన్.. ఇప్పుడు ప్రైవేటైజేషన్’గా మారిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ లేపే మత విద్వేషంలో పడితే మనకేం రాదని చెప్పారు.
బీజేపీకి ఈ ఎన్నికల్లో 200 సీట్లకు మించి రావని నివేదికలు వస్తున్నాయి. కేంద్రంలో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమే. 14 మంది బీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే తెలంగాణ నదులు, నీళ్లు, సింగరేణి, మన ఉద్యోగాలను కాపాడుకునే అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ ఎంపీల గెలుపులోనే తెలంగాణ గెలుపు ఉన్నది.
– కేసీఆర్