TG iPASS | హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): పెట్టుబడిదారుల పట్ల స్నేహపూర్వక విధానాలు, అనుమతుల కోసం సింగిల్ విండో వ్యవస్థ… ఇదీ తెలంగాణ పారిశ్రామిక రంగం పట్ల ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రత్యేక ముద్ర. అయితే ఇది ఒకప్పటి మాట. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ఏర్పాటైనప్పటినుంచి రాష్ట్రం ఈ ప్రత్యేకతను కోల్పోయిందనే ప్రచారం పరిశ్రమ వర్గాల్లో జోరుగా సాగుతున్నది. భూ కేటాయింపులు లేక, అనుమతులు లభించక ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు నానా ఇబ్బందులు పడుతున్నారు. భారీగా పెట్టుబడులు సాధిస్తున్నట్లు సర్కార్ ఊదరగొడుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి మరోలా ఉంది. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే టీఎస్ ఐపాస్(తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజక్ట్ అఫ్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టం) చట్టాన్ని ప్రవేశపెట్టిన విషయం విదితమే. నూతనంగా ఏర్పాటైన రాష్ట్రం కావడంతో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడంతోపాటు రాష్ర్టాన్ని పరిశ్రమలకు గమ్యస్థానంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో అప్పటి సీఎం కేసీఆర్ ఈ మేరకు వినూత్న చట్టానికి శ్రీకారం చుట్టారు. అంతేకాదు, ఈ నిర్ణయం వెనుక కూడా పెద్ద కసరత్తే జరిగింది.
పారిశ్రామికవేత్తలతో సుమారు 9 గంటలపాటు సుదీర్ఘంగా చర్చించి.. వారు ఆలోచనలకు అనుగుణంగా ఈ చట్టానికి రూపకల్పన చేశారు. ఓ వైపు కొత్త పారిశ్రామికవాడలను అభివృద్ధి చేస్తూనే.. మరోవైపు ఉన్న పరిశ్రమలను కాపాడుకునేందుకు రెప్పపాటు కూడా కరెంటు పోకుండా తగిన చర్యలు తీసుకున్నారు. మరోవైపు, పరిశ్రమల శాఖ మంత్రిగా కేటీఆర్ దేశ విదేశాల నుంచి పెట్టుబడులు రాబట్టేందుకు, ముఖ్యంగా బహుళ జాతి సంస్థలు రాష్ట్రంలో కొలువుదీరే విధంగా, వారు తమ పెట్టుబడులను మరింత విస్తరించుకునే విధంగా తనదైన శైలిలో విశేషంగా కృషిచేశారు.
పెట్టుబడిదారులు అనుమతుల కోసం ఎక్కడా తిరగకుండా పరిశ్రమకు అవసరమైన అన్ని శాఖల అనుమతులు ఒకే దరఖాస్తుతో ఆన్లైన్ ద్వారా లభించడమే టీజీ ఐపాస్ ప్రత్యేకత. పదేళ్లపాటు నిరాటంకంగా సాగిన ఈ చట్టం రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ఏర్పాటైనప్పటినుంచి గాడితప్పింది. ఇప్పుడా అనుమతుల జారీ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. కనీసం దరఖాస్తులను పరిశీలించేవారు లేకుండా పోయారు. మంత్రులు, ఎమ్మెల్యేల సిఫారసు ఉంటేనే పరిశ్రమకు అనుమతులు మంజూరవుతున్నాయి. దీంతో టీజీఐఐసీలో వందలాది దరఖాస్తులు అటకెక్కాయి. అంతేకాదు, పెట్టుబడిదారులతో చర్చించి వారి సమస్యలు, డిమాండ్లను విని సానుకూల ధోరణితో పరిష్కరించే చర్యలు ప్రభుత్వం తీసుకోవడం లేదు. గతంలో ఏ పారిశ్రామికవేత్త తనకు ఏ విధమైన సమస్య ఎదురైనా వెంటనే కేటీఆర్కు చెబితే క్షణాల్లో సమస్య పరిష్కారమయ్యేది. ఇప్పుడా స్నేహపూర్వక విధానం కనుమరుగై స్తబ్ధత నెలకున్నది.