Bandi Sanjay | హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): ధరణే మా ధైర్యం అంటూ ప్రజలు చేస్తున్న నినాదాలు.. పిడికిలి ఎత్తి చేస్తున్న సంఘీభావ ప్రకటనలు బీజేపీకి శరాఘాతంలా తగిలాయి. దెబ్బకు దయ్యం దిగివచ్చినట్టు.. ధరణి పోర్టల్‌పై రాష్ట్ర బీజేపీ మాట మార్చేసింది. శుక్రవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వచ్చినా ధరణి పోర్టల్‌ను కొసాగిస్తామని చెప్పారు. ధరణిని రద్దు చేస్తామని, బంగాళాఖాతంలో పడేస్తామని, పక్కన పడేస్తామని.. ఇలా ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యానాలు చేస్తున్న జాతీయపార్టీల్లో ఒకదానికి ఇప్పుడు బుద్ధి వచ్చింది.
సీఎం కేసీఆర్ ఏ సభలో పాల్గొన్నా ధరణి గురించి, పోర్టల్ వల్ల కలిగిన ప్రయోజనాల గురించి ప్రజలకు వివరిస్తున్నారు. ప్రజలంతా ముక్తకంఠంతో ‘ధరణి ఉండాల్సిందే’ అని దద్దరిల్లేలా సమాధానం ఇస్తున్నారు. ధరణి జోలికిపోతే చేతులు కాలడం ఖాయమని, ఎన్నికల్లో ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారని గుర్తించింది. దీంతో నిరుడు జూలైలో ధరణి సమస్యలపై మౌన దీక్ష చేసిన నోటితోనే.. ఇప్పుడు ‘ధరణిని కొనసాగిస్తాం’ అంటూ బండి ప్రాప్తకాలజ్ఞత ప్రదర్శించారు.
‘ఒక పెద్ద విప్లవం వచ్చినప్పుడు.. గొప్ప సంస్కరణ వచ్చినప్పుడు బాలారిష్టాలు కొన్ని ఉంటాయి. వాటిని టీతింగ్ ప్రాబ్లమ్స్ అంటరు. చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి. వాటిని మనం తట్టుకొని ముందుకుపోవాలి’. 2020 అక్టోబర్ 29న ధరణి పో ర్టల్ ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యా ఖ్యలు ఇవి. ధరణి పోర్టల్ ప్రారంభమైన తర్వాత కొ న్ని ఇబ్బందులు, లోపాలు వస్తుంటాయని, వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని, సరిదిద్దుతామని చె ప్పారు. ఇటీవల జరిగిన సభల్లోనూ 99 శాతం మంది రైతులు భూములు సాఫ్‌గా ధరణి పోర్టల్‌లో ఉన్నాయని, ఒక్క శాతం మాత్రమే వివాదాలు ఉన్నాయని, వాటిని కూడా పరిష్కరిస్తున్నామని చెప్తున్నారు.
‘ప్రతీపశక్తులు వ్యతిరేక ప్రచారానికి సిద్ధంగా ఉంటాయి. ఎక్కడో ఏదో మండలంలో చిన్న సమస్య వస్తే నెగెటివ్ కోణంలో చూపించే అవకాశం ఉంటుంది’ అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ధరణి పోర్టల్‌ను ప్రారంభించిన రోజే చెప్పారు. ఆయన చెప్పినట్టే ప్రతిపక్షాలు మొదటి రోజు నుంచీ చిన్న సమస్యలను భూతద్దంలో పెట్టి చూపించి ప్రజలను భయపెట్టటానికి ప్రయత్నిస్తున్నాయి. ధరణి పోర్టల్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేసేవరకు వెళ్లాయి. కానీ ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ధరణి పోర్టల్‌కు మద్దతు పలుకుతున్నారు.