హనుమకొండ, ఏప్రిల్ 5: తెలంగాణలో నడిచేది ప్రజాపాలన కాదని, కాంగ్రెస్ ప్రజాపీడిత పాలన అని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. ఆదివారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినియ్భాస్కర్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కేరళలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘నేను ఫ్లైట్ ఏర్పాటు చేస్తా.. మా తెలంగాణకు వచ్చి ఊరూరా తిరిగి మేము ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఎలా అమలు చేస్తున్నామో చూడాలి’ అని చెప్పడం వింతగా ఉన్నదని దుయ్యబట్టారు. ‘తెలంగాణ ప్రజలకు మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు పూర్తి స్థాయిలో అమలు చేసినట్టు నిరూపిస్తే నేను హనుమకొండ చౌరస్తాలో ఉరి వేసుకుంటా’నని సిరికొండ సవాల్ విసిరారు.
అసెంబ్లీ, శాసనమండలిలో అత్యంత ప్రధాన అంశాలైన గవర్నర్ ప్రసంగం, బడ్జెట్, పద్దులపై చర్చలు నడుస్తున్న సమయంలో సీఎం ఎన్నికల ప్రచారానికి వెళ్లాడని విమర్శించారు. శనివారం గజ్వేల్‌లోని మాజీ సీఎం కేసీఆర్ క్యాంపు ఆఫీసుపై చేసిన దాడి ప్రభుత్వ కార్యాలయంపై దాడేనని పేర్కొన్నారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు.
రాహుల్‌గాంధీ ఆఫీసులో ప్రధాని మోదీ ఫొటో పెట్టారా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని చూసి ఓర్వలేని కాంగ్రెస్, బీజేపీలు కేసీఆర్‌పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టక ముందు తెలంగాణలో పంటలు ఎలా పండాయి? కట్టిన తర్వాత పంటలు ఎంత మేరకు పండాయో అందరికీ తెలుసని అన్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పార్లమెంట్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై వ్యతిరేకంగా మాట్లాడారని, ఆయనకు తన శాఖపై పూర్తి అవగాహన లేదని విమర్శించారు.
పక్క రాష్ట్రం తరహాలో తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డి ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తున్నాడని, దాడులను ప్రేరేపిస్తున్నాడని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తొలి ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత కేసీఆర్‌కు చెందిన గజ్వేల్ క్యాంపు కార్యాలయంపై దాడి దుర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు. అధికార పక్షమే ప్రభుత్వ కార్యాలయాలపై చేస్తున్న దాడులను ప్రజాస్వామ్యంలో దాడులుగా పరిగణిస్తున్నామని అన్నారు. ఆరు గ్యారెంటీలపై కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ప్రజలు నిలదీస్తుంటే దిక్కుతోచని స్థితిలో కాంగ్రెస్ దాడులకు తెగబడుతున్నదని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు.