Congress | హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర కాంగ్రెస్ పరిస్థితి ‘హస్త’వ్యస్తంగా తయారైంది. పార్టీలో నాయకుల మధ్య రోజురోజుకూ విభేదాలు భగ్గుమంటున్నాయి. కొత్తగా చేరికలేమోగానీ.. ఉన్న నేతల మధ్య సమన్వయం లేక ద్వితీయశ్రేణి నాయకులు తలలుపట్టుకుంటున్నారు. కొంత కాలంగా ఏ పార్టీలో చేరాలా? అంటూ అన్ని పార్టీలతో రాయబారాలు నడిపి చివరకు హస్తం గూటికి చేరుతున్నట్టు ప్రకటించిన ఖమ్మం జిల్లా నేత పొంగులేటికి కాంగ్రెస్ మార్కు స్వాగతం లభిస్తున్నది. ఆయన అటు వస్తానని ప్రకటించాడో లేదో.. ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్‌లోకి వస్తారు.. సిగ్గుందా? అంటూ ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ నాయకురాలు, మాజీ ఎంపీ రేణుకా చౌదరి కడిగిపారేశారు. వేరే చోటు నుంచి పోటీచేసే దమ్ముందా? అని నిలదీశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే వద్దకు ఈ పంచాయితీని తీసుకెళ్లారు.
పొంగులేటికి సుధీర్ఘకాలం అనుచరుడిగా ఉన్న సత్తుపల్లి నియోజకవర్గనేత డాక్టర్ మట్టా దయానంద్, వైరా నియోజకవర్గ నేత ధరావత్ రామ్మూర్తినాయక్, ఖమ్మం నియోజకవర్గ మైనార్టీ నేత ముస్తాఫా తదితరులను వెంటపెట్టుకొని వెళ్లి పొంగులేటి నిజస్వరూపం గురించి వివరించారు. ఖమ్మం జిల్లాలోని ఇల్లెందు కాంగ్రెస్ నేతలు పార్టీ నేత చీమల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో రేవంత్‌రెడ్డిని కలిశారు. పార్టీకి ద్రోహం చేసి వెళ్లిపోయినవారిని తిరిగి చేర్చుకోవడం దారుణమని, పార్టీని నమ్ముకొని పనిచేసిన వారికి కాకుండా బడా కాంట్రాక్టర్లను చేర్చుకొని వారికి టికెట్టు ఇస్తే ఎలా? అంటూ నిలదీశారు. వీరి ప్రశ్నలకు రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పకుండానే జారుకోవడం గమనార్హం. ఇక పొంగులేటిని ఏ నియోజకవర్గానికి రాకుండా చూడాలని కాంగ్రెస్ పార్టీ నేతలు నిర్ణయించినట్టు తెలిసింది.
రాష్ట్రంలో పీపుల్స్‌మార్చ్ పేరుతో కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర సందిగ్ధంలో పడింది. ఇప్పటికే సరైన స్పందన లేక విలవిలలాడుతున్న భట్టివిక్రమార్కకు తన పాదయాత్ర ముగింపు సభ పెద్ద సవాలుగా మారింది. ఖమ్మం జిల్లాలోనే పెట్టుకొని జనసమీకరణ చేసుకోవాలని, దీనికి పార్టీ అగ్రనేతలు రాహుల్‌గాంధీ లేదా ప్రియాంక..వారు రాలేకపోతే మల్లికార్జున ఖర్గేను పిలుచుకోవాలని యోచిస్తున్నారు. అయితే, జూలై 2 లేదా 3వ తేదీన పొంగులేటి కూడా పార్టీలో చేరేందుకు ముహూర్తం పెట్టుకొంటున్నట్టు ప్రచారం జరగుతున్నది. భట్టి పాదయాత్ర ముగింపు సభలో తాను చేరితే మొత్తం క్రెడిట్ భట్టికే పోతుందని పొంగులేటి భావిస్తున్నట్టు సమాచారం.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు పెరిగింది. జనగామలో పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి గొడవ అందరికీ తెలిసిందే. ఎవరికి వారు తమకే టికెట్టు అంటే తమకే అని చెప్పుకొంటున్నారు. ఇటీవల పార్టీ శాసనసభాపక్ష నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర సందర్భంగా పొన్నాల లక్ష్మయ్య, కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి వర్గాలు కొట్టుకున్నాయి. ఇక వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో సైతం పార్టీ పీసీసీ సభ్యుడు, జనగామ జిల్లా పార్టీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి, హన్మకొండ జిల్లా డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ మధ్య గొడవ తారాస్థాయికి చేరింది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా కూడా ఇద్దరు నేతలు పశ్చిమ నియోజకవర్గంలోనే పోటాపోటీ ర్యాలీలు నిర్వహించారు. జంగా రాఘవరెడ్డి తనది పశ్చిమ నియోజకవర్గం లోకల్ అని, రాజేందర్‌కు ఇక్కడేం పని అని ప్రశ్నిస్తున్నారు. నాయిని రాజేందర్ తాను కూడా పశ్చిమ నియోజకవర్గం నుంచే పోటీచేస్తానని చెప్తున్నారు. వీరిద్దరూ ఇక్కడి నుంచి పోటీచేయడం ఏంటి.. నేను కదా అంటూ ఎర్రబెల్లి స్వర్ణ కూడా పోటీకి వస్తున్నారు. దీంతో ముగ్గురు నేతల మధ్య క్యాడర్ నలిగిపోతున్నది. ఎర్రబెల్లి స్వర్ణకు వరంగల్ జిల్లా డీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వడం ఇష్టంలేని కొండ మురళి వర్గం ఆమె పార్టీ కార్యక్రమాలు చేపట్టడాన్ని వ్యతిరేకిస్తున్నారు.