న్యూఢిల్లీ, డిసెంబర్ 12: నేరాన్నే కాకుండా నేరస్థుడి పరిస్థితిని కూడా పరిగణనలోకి తీసుకోవడం కోర్టుల విధి అని సుప్రీం కోర్టు పేర్కొన్నది. ‘శిక్ష విధించే సమయంలో నేరం జరిగిన తీరుతో పాటు నేరస్థుడి సామాజిక, ఆర్థిక పరిస్థితులు, అతని మానసిక స్థితిని, అవకాశం ఇస్తే అతను మారతాడా, అతనికి పునరావాసం కల్పించవచ్చా.. ఇలాంటి అంశాలను కూడా కోర్టులు పరిగణనలోకి తీసుకోవాలి’ అని సూచించింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి ఆస్తి వివాదంలో ఇద్దరు సోదరులను, మేనల్లుడిని చంపేశాడు. ఈ కేసులో అతనికి మరణ శిక్ష పడింది. ఆ శిక్షను సుప్రీం కోర్టు జీవిత ఖైదు కిందకు మార్చింది. 30 ఏండ్లు జైల్లో ఉండాలని ఆదేశించింది. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు కీలక వ్యా ఖ్యలు చేసింది. ‘నేరస్థుడు గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చాడు. పేదవాడు. ఇదే అతని మొదటి నేరం. అంతకుముందు ఎలాంటి నేర రికార్డు లేదు. నేరం చేసిన తర్వాత కూడా జైల్లో క్రమశిక్షణతో ఉన్నాడు. ఇవన్నీ లెక్కలోకి తీసుకోవాలి’అని సూచించింది.