ఆదిలాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్ జిల్లాలో జొన్న రైతుల పరిస్థితి అధ్వానంగా మారింది. కొనుగోళ్లలో జాప్యం, అకాల వర్షాల కారణంగా నష్టపోతున్న రైతులు, పంట కొనుగోళ్లలో కోతల కారణంగా నష్టపోవాల్సిన దుస్థితి నెలకొన్నది. యాసంగిలో రైతులు సాగు చేసిన జొన్నలను ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా సేకరిస్తున్నది. ఎకరాకు 15 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. జిల్లాలో పది కొనుగోలు కేంద్రాల్లో ప్రాథమిక సహకార సంఘాల ద్వారా రైతుల వద్ద నుంచి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాల్‌కు రూ.3,371 చొప్పున పంటను తీసుకుంటున్నారు.
ప్రైవేటు వ్యాపారులు జొన్నలను క్వింటాల్‌కు రూ.2,600 ఇస్తుండటంతో రైతులు ప్రభుత్వ కేంద్రాలకు పంటను తీసుకొచ్చి అమ్ముకుంటున్నారు. మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాలు జొన్న రాశులతో నిండిపోతున్నాయి. నిర్వాహకులు దోపిడీ చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. క్వింటాల్‌కు కేజీ అధికంగా తూకం వేస్తుండటంతో నష్టపోతున్నామని పేర్కొంటున్నారు. సంచి బరువు ఎంత ఉంటే అంతే పరిమాణంలో జొన్నలను తీసుకోవాలని కోరుతున్నారు.
నేను 27 క్వింటాళ్ల జొన్నలను ఆదిలాబాద్ మార్కెట్ యార్డుకు తీసుకొచ్చిన. సంచిలో 50 కిలోలు నింపి కాంటా చేయాల్సి ఉండగా 51 కిలోల వరకు నింపుతున్నారు. ఖాళీ సంచి బరువు 600 గ్రాముల వరకు ఉంటుంది. 350 నుంచి 400 గ్రాములను ఎక్కువగా తీసుకుంటున్నారు. దీంతో రైతులు నష్టపోవాల్సి వస్తున్నది.
– రాములు, రైతు, మావల, ఆదిలాబాద్