Cement Industry | సూర్యాపేట, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): సూర్యాపేట జిల్లా పరిధిలోని కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల పరిధిలోని కృష్ణపట్టె వెంట ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీలతో ఆయా గ్రామాల ప్రజలు వేగలేకపోతున్నారు. రెండు నియోజకవర్గాల పరిధిలోని మేళ్లచెరువులో కీర్తి, మైహోమ్ ఫ్యాక్టరీలు ఉండగా. మఠంపల్లి మండలంలో నాగార్జున, గ్రే గోల్డ్, సాగర్, చింతలపాలెం మండలంలో అంజని, జువారీతోపాటు పాలకవీడు మండలంలో డెక్కన్, పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. నిత్యం ఫ్యాక్టరీలు వెదజల్లే లైమ్ పౌడర్, బొగ్గు కాల్చడం ద్వారా వెలువడే కార్బన్ మోనాక్సైడ్‌తో కూడిన బూడిద ఇండ్ల్లు, రోడ్లు, పంటలపై పర్చుకుంటున్నది. వేసవిలో రోడ్లపై దుమ్ములేస్తుండడంతో కనీసం బయట తిరుగడం కష్టమవుతున్నది. గాలి కాలుష్యంతో ఊపిరితిత్తుల వ్యాధులతోపాటు అనేక రకాల జబ్బులు వస్తున్నాయి. సిమెంట్ కోసం భూమి లోపల ఉన్న సున్నపు రాయి తీసేందుకు భారీ గుంతలు తీయడంతో నీళ్లు కలుషితమై వాటిని తాగిన పశువులు అనేకం చనిపోయాయి.
సిమెంట్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసే చోట దాదాపు ఐదు ఎకరాల పరిధిలో మట్టితో పాటు వాయు, జల కాలుష్యం ముప్పు ఉంటుందని అధికారుల ద్వారా తెలిసింది. సిమెంట్ ఫ్యాక్టరీల నుంచి వెలువడే కాలుష్యంతో వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లుతున్నది. ఫ్యాక్టరీకి అతి సమీపంలో ఉన్న రైతులు ఏకంగా వ్యవసాయానికి దూరమై, విధిలేని పరిస్థితుల్లో తమ భూములను సిమెంట్ ఫాక్టరీలకు విక్రయించుకున్న ఘటనలు ఉన్నాయి.
మా ప్రాంతంలో దక్కన్ పరిశ్రమ నుంచి వెలువడుతున్న కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్నాం. ఫ్యాకరీ చుట్టు పక్క గ్రామాల ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. పంట పొలాలు నాశనం అవుతున్నాయి. సిమెంట్ పరిశ్రమ వాహనాల వల్ల గ్రామాల్లో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఫ్యాక్టరీలో స్థానికులకు ఉద్యోగాలు నామమాత్రమే.