రాజన్న సిరిసిల్ల, మార్చి 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర సర్కారు నిర్లక్ష్యంతో ఇప్పటికే ఆగమైన సిరిసిల్ల వస్త్రపరిశ్రమ, పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో మరింత ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. వార్ ఎఫెక్ట్‌తో క్రూడాయిల్ ధరలు పెరగడంతో వస్త్ర పరిశ్రమలో ఉపయోగించే యార్న్, రసాయనాల ధరలు అమాంతం పెరుగడంతో సిరిసిల్లలోని పాలిస్టర్, కాటన్ పరిశ్రమ సందిగ్ధంలో పడింది. ఇప్పటికే ప్రభుత్వ అరకొర ఆర్డర్లతో ముక్కుతూ.. మూలుగుతూ నడుస్తుండగా, తాజా పరిస్థితులతో మరింత ఆందోళనకరంగా మారింది. గుజరాత్ రాష్ట్రం సిల్వాస నుంచి పాలిస్టర్ యార్న్ దిగుమతి, కాటన్ యార్న్ ఆంధ్రా, తమిళనాడు నుంచి రావాల్సి ఉంటుంది. క్రూడాయిల్, ఇంధన ధరలు పెరగడంతో రవాణాపై ప్రభావంపడి యార్న్ రేట్లు పెరిగాయి. 20 రోజులుగా పెట్టుబడితో పాటు గిట్టుబాటు ధర రాని పరిస్థితులు కనబడటంతో యజమానులు, ఆసాములు, కార్మికులు ఆందోళన చెందుతున్నారు.
ఇటు ప్రభుత్వ ఆర్డర్లను టెండర్ల ద్వారా గుజరాత్ కంపెనీలకు సర్కార్ కట్టబెట్టడంతో కార్మికులకు చేతినిండా పనిలేకుండాపోయింది. ఇచ్చిన ఆర్డర్లకు ప్రభుత్వం ధరలు తగ్గించడంతో గిట్టుబాట ధర రాక వస్ర్తోత్పత్తికి విఘాతం కలుగుతున్నది. కరోనాలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆనాటి కేసీఆర్ సర్కార్ వస్త్ర పరిశ్రమకు ప్రభుత్వ ఆర్డర్లు, బతుకమ్మ చీరలు ఇచ్చి ఆదుకున్నది. ప్రస్తుతం యుద్ధ ప్రభావంతో భారీగా పెరిగిన యార్న్ ధరలతో వస్ర్తోత్పత్తి ముందుకు సాగడం గగనంగా మారింది. ప్రభుత్వమే ముందుకు వచ్చి ఈ విపత్కర పరిస్థితుల నుంచి బయటపడేసి ఆదుకోవాలి, లేదంటే వస్త్ర పరిశ్రమలోని 6 వేల మంది కార్మికులు పనిలేకుండా రోడ్డు మీద పడే దుస్థితి వస్తుంది.

యార్న్ రేట్లు పెరగడంతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఆగమైపోయింది. గత నెలలో వచ్చిన యార్న్ ఇప్పటికే వినియోగించుకోవడంతో తదుపరి యార్న్ కోసం ఆందోళన చెందుతున్నారు. పాలిస్టర్ యార్న్ కిలోకు రూ.107 ఉండగా అదనంగా మరో రూ.33 పెరిగి, రూ.140కి చేరింది. కాటన్ యార్న్ పాత రేటు కిలో రూ.152 ఉండగా రూ.16 పెరిగి రూ.168 చేరింది. అద్దకం పరిశ్రమలో వినియోగించే రసాయనాల ధరలు 30 శాతం పెరగడంతో అదనంగా మీటరు వస్త్రం తయారీకి రూ.5 నుంచి రూ.6 భారం పడుతున్నంది. ఇదిలా ఉంటే.. ప్రభుత్వం మాత్రం అందించిన ఆర్డర్లకు ధర తగ్గించడం గమనార్హం. దీంతో వస్త్ర పరిశ్రమ యజమానులు, అసాములు, కార్మికులు అందోళన చెందుతున్నారు. అంతంత మాత్రంగా నడుస్తున్న పరిశ్రమలు యార్న్ రేటుతో మూతపడే పరిస్థితి నెలకొంది. దీంతోపాటు 20 రోజులగా వస్ర్తోత్పత్తి నిల్వలు పేరుకుపోయాయి.
యుద్ధ ప్రభావం సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై తీవ్రంగా పడింది. సిరిసిల్ల పరిశ్రమకు దక్కాల్సిన ప్రభుత్వ అర్డర్లను ఇటీవలే టెండర్ల ద్వారా గుజరాత్‌కు చెందిన కంపెనీలకు అప్పజెప్పారు. దీంతో సిరిసిల్లకు దక్కాల్సిన రూ.60 కోట్ల ప్రభుత్వ ఆర్డర్లు దూరమయ్యాయి. ఇటు యుద్ధ ప్రభావంతో నూలు ధరలు పెరిగి.. పెట్టుబడికి గిట్టుబాటు ధర లేకపోవడంతో వస్ర్తోత్పత్తి భారమైంది. దీంతో కాటన్, పాలిస్టర్లోని 6 వేల మంది కార్మికులు రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. యార్న్ రేటు పెరగడంతో కాటన్, పాలిస్టర్ పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. పెట్టుబడితో పాటు గిట్టుబాటు ధర రాకపోవడంతో పాటు నష్టాల్లో ఉండడంతో పరిశ్రమ నిర్వహణ కార్మికులకు ఉపాధిలేక ఆందోళన చెందుతున్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో పరిశ్రమకు ప్రభుత్వం అండగా ఉండాలని కార్మికులు వేడుకుంటున్నారు.
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో ప్రతిరోజూ 18 లక్షల మీటర్ల వస్ర్తోత్పత్తి జరుగుతున్నది. పాలిస్టర్ పరిశ్రమలో 15 లక్షల మీటర్లు, కాటన్ పరిశ్రమలో 3 లక్షల మీటర్లు వస్ర్తోత్పత్తి జరుగుతున్నంది. 18 వేల మరమగ్గాలపై పాలిస్టర్ వస్ర్తోత్పత్తి జరగగా.. 4 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. 5 వేల మరమగ్గాలపై కాటన్ వస్ర్తోత్పత్తి జరుగుతున్నది. రెండు పరిశ్రమల్లో 200 మంది యజమానులు, 1600 మంది అసాములు, 6 వేల మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారు. 20 రోజులుగా 3.60 కోట్ల మీటర్ల వస్ర్తోత్పత్తి జరిగి వీటి నిల్వలు పేరుకుపోయాయి. పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రభుత్వం పరిశ్రమను ఆదుకోవాల్సి ఉండగా పట్టించుకోకపోవడమే ఇందుకు కారణం. ఇది ఇలాగే కొనసాగితే పాలిస్టర్, కాటన్ పరిశ్రమలు మూతపడి కార్మికులు రోడ్డునపడే పరిస్థితి వస్తది.
క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వం పరిశ్రమకు సహకరించాలి. గత బీఆర్ఎస్ సర్కార్ కరోనా లాంటి విపత్కర పరిస్థితిలోనూ బతుకమ్మ చీరెలు, తదితర ఆర్డర్లు ఇచ్చి సంక్షోభంలేకుండా చూసింది. యుద్ధ ప్రభావంతో యార్న్ రేట్లు పెరిగి.. కాటన్, పాలిస్టర్ పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడింది. పెట్టుబడితోపాటు గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఉంది. మీటరు వస్ర్తానికి అదనంగా రూ.5 నుంచి రూ.6 భారం పడటంతో వస్ర్తోత్పత్తి నిర్వహణ కష్టంగా మారింది. 20 రోజులుగా యార్న్ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ్ల ప్రభుత్వమే సహకరించి మాంద్యాన్ని నివారించాలి. వస్త్ర పరిశ్రమకు అండగా నిలవాలి.
– మంచె శ్రీనివాస్, వస్త్ర పరిశ్రమ యజమాని, సిరిసిల్ల