హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): సింగరేణి నైని బొగ్గు బ్లాకుల వ్యవహారం కాంగ్రెస్ అంతర్గత ముసలాన్ని మరింత మండిస్తూనే ఉన్నది. ఇప్పటికే వలస కాంగ్రెస్, అసలు కాంగ్రెస్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధవాతావరణం కొనసాగుతుండగా, తాజా పరిణామాలు దానికి మరింత ఆజ్యంపోస్తున్నాయి. సింగరేణి బొగ్గు కుంభకోణం బయటపడిన తర్వాత సీఎంకు, సీనియర్ క్యాబినెట్ సహచరులకు మధ్య స్పష్టమైన అగాథం కనపడుతున్నది. తమవరకు వస్తే ఒక న్యాయం.. రేవంత్ వర్గానికి, ఆయన సన్నిహితులకు మరో న్యాయమా? అనే కోణంలో కాంగ్రెస్ సీనియర్ మంత్రులు కుతకుతలాడుతున్నట్టు కాంగ్రెస్ పార్టీలోని విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి.
నైని బ్లాకులో అక్రమాలు జరిగాయంటూ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క లక్ష్యంగా చేసుకుని ఆంధ్రజ్యోతిలో ముఖ్యమంత్రే కథనాలు రాయించారని కాంగ్రెస్ సీనియర్ మంత్రులు బలంగా నమ్ముతున్నారట. తనపై బురదచల్లుతున్నారని, వెనుక ఉండి కథనాలు రాయిస్తున్నారంటూ పైకి నర్మగర్భ వ్యాఖ్యలు చేసినప్పటికీ, లోలోన భట్టి తీవ్ర మనస్తాపం చెందినట్టు వార్తలు కూడా వెలువడ్డాయి. ఆదివారం భట్టిపై ఆరోపణలతో కథనాలు వెలువడగానే, అదేరోజు విక్రమార్క మీడియా ముందుకు వచ్చారు. పనిగట్టుకొని తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, దాని వెనుక ఎవరున్నారో బయటపెడుతానని అప్పుడే ప్రకటించారు. నైని బ్లాక్ టెండర్లను రద్దు చేస్తానంటూ ఆదివారంనాడే ప్రకటించారు. అన్నట్టుగానే మూడ్రోజుల్లో ఆ టెండర్లను రద్దు చేస్తూ అధికారిక ఆదేశాలు వెలువడ్డాయి.
సైట్ విజిట్ సర్టిఫికెట్ పేరిట టెండర్లలో అక్రమాలు జరిగినట్టు రేవంత్ అనుకూల మీడియాలో కథనాలు వెలువడగా, వాటిని రద్దు చేయడం ద్వారా భట్టి గట్టి జవాబిచ్చారని కాంగ్రెస్ సీనియర్ మంత్రులు భావిస్తున్నట్టు సమాచారం. సైట్ విజిట్ అనేదే అక్రమాలకు ఆస్కారమిచ్చినట్టుగా అనుమానిస్తున్నప్పుడు.. మరి, అదే ప్రాతిపదికన రేవంత్ మేన బావమరిది దక్కించుకున్న టెండర్లపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదనేది అసలు ప్రశ్న. ఇదే విషయంపై పలువురు సీనియర్ మంత్రులు తీవ్రంగా చర్చించుకుంటున్నట్టు సమాచారం. రేవంత్ బావమరిది అక్రమాలకు పాల్పడ్డారంటూ పలు పత్రికల్లో కథనాలు వస్తున్నాయని, వాటిమీద ముఖ్యమంత్రి ఎందుకు పెదవి విప్పడంలేదని వారు ప్రశ్నిస్తున్నారని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతున్నది.
భట్టిపై బట్టకాల్చి మీదేసిన ముఖ్యమంత్రి, బావమరిదిపై వచ్చిన ఆరోపణల మీద సమాధానం చెప్పకుండానే దావోస్‌కు వెళ్లిపోయారని ఆ సీనియర్ మంత్రులు రగలిపోతున్నారని తెలిసింది. టెండర్లు రద్దు చేయడం ద్వారా డిప్యూటీ సీఎం తన నిజాయితీని నిరూపించుకునే ప్రయత్నం చేశారని.. మరి, సీఎం తన నిజాయితీని ఎప్పుడు నిరూపించుకుంటారని వారు ప్రశ్నిస్తున్నట్టు పార్టీలో అంతర్గతంగా ప్రచారం జరుగుతున్నది. సింగరేణి టెండర్ల వ్యవహారంలో సీఎం చేతికీ బొగ్గు మసి అంటిందని, మరి తన బావమరిది టెండర్లను రద్దు చేయడం ద్వారా పారదర్శకతను చాటుకోవాలని మంత్రులు డిమాండ్ చేస్తున్నట్టు వారి సన్నిహితులు చెప్తున్నారు. దీనిపై ప్రతిస్పందన ఏం వస్తుందోనని కాంగ్రెస్ మంత్రులు ఎదురుచూస్తుండగా.. సీఎం మాత్రం దావోస్ పర్యటన పేరిట 31 వరకు విదేశాల్లోనే ఉండనున్నారు.
ఒకరిపై వచ్చిన ఆరోపణల మీద చర్యలు!.. మరొకరిపై మాత్రం నిమ్మకునీరెత్తినట్టు ఉండటం!! రేవంత్‌లోని ద్వంద్వవైఖరిపైనా కాంగ్రెస్ సీనియర్ మంత్రుల మధ్య తీవ్రంగా చర్చ జరుగుతున్నట్టు సమాచారం. ‘ఇటీవల సీనియర్ మంత్రి ఒకరిపై ఆరోపణలు చేస్తూ ఓ మీడియాలో కథనాలు రాగానే ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకున్నది. గంటల వ్యవధిలోనే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని వేసింది. తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ.. ముగ్గురు పాత్రికేయులను అరెస్టు చేసింది. మరి.. రాష్ట్ర డిప్యూటీ సీఎం, దళితమంత్రి మీద ఆరోపణలు వస్తే, ఆధారరహితంగా కథనాలు వస్తే ప్రభుత్వం ఎలా స్పందించాలి? కనీసం సీఎం స్పందనేది? ఆ కథనాలు రాసిన మీడియాపై చర్యలు ఎందుకు తీసుకోరు? ఇదేం ద్వంద్వవైఖరి?’ అంటూ అసలు కాంగ్రెస్‌కు చెందిన సీనియర్ మంత్రులు మండిపడుతున్నారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి.
సాధారణంగా క్యాబినెట్ సహచరుల మీద తీవ్రమైన ఆరోపణలు వచ్చినప్పుడు తొలుత స్పందించాల్సింది ముఖ్యమంత్రే. ఆ ఆరోపణలు ఆయన మంత్రివర్గంపై పడిన మరకలాగానే జనం చూస్తారు. కానీ భట్టి విక్రమార్క ఉదంతంపై రేవంత్ నేరుగా స్పందించకపోగా, ఆ ఆరోపణలను ఆయన ఖండించిందీ లేదు. ఇప్పుడిదే విషయం మంత్రుల్లో కోపాగ్నికి మరింత ఆజ్యం పోస్తున్నది. రేవంతే ఆ కథనాలు రాయిస్తున్నారన్న అనుమానాన్ని వారు వ్యక్తంచేస్తున్నట్టు వినికిడి. ‘మంత్రులకు వ్యతిరేకంగా వస్తున్న కథనాల్లో సీఎం ప్రమేయం లేకపోయి ఉంటే, ఆయన బహిరంగంగా వాటిని ఖండించాలి కదా. కానీ ఇంతవరకు అలా చేయలేదు.
దీన్నిబట్టి చూస్తే ఈ బురదచల్లుడు వెనుక ఆయన ప్రమేయం ఉన్నట్టుగానే భావించాల్సి వస్తుంది’ అని మంత్రులు చర్చించుకుంటున్నారని కాంగ్రెస్ ఆంతరంగిక వర్గాలు చెప్తున్నాయి. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే పదే పదే మీడియాకు లీకులు ఇస్తుండటం మరీ చిన్నపిల్లల వ్యవహారంలా తయారైందన్న అభిప్రాయం అధికార పార్టీ సీనియర్ నేతల్లో వ్యక్తమవుతున్నది. ‘ఏ అంశంలోనైనా సీఎం నేరుగా మాట్లాడొచ్చు. ప్రజలకుగానీ, పార్టీ నేతలకు గానీ క్లారిటీ ఇవ్వవచ్చు. కానీ ప్రతిపక్ష నేతల విచారణ మొదలుకొని, సొంతపార్టీ సహచరుల వరకు ఆధారరహితమైన ఆరోపణలన్నీ అనుకూల మీడియాలో కథనాలుగానే వెలుగుచూస్తున్నాయి. క్యాబినెట్ సహచరుల మీద కూడా మీడియాకు లీకులు ఇవ్వడం ప్రభుత్వ పాలనను పిల్లలాటగా మార్చేస్తున్నది’ అని కాంగ్రెస్ సీనియర్ నేత అభిప్రాయపడ్డారు.
నెలకు సగటున రూ.60 కోట్ల మేర జరుగుతు న్న దందాను వదలేసి, ఇంకా ఏమీ జరుగని టెండర్ల మీద ఎల్లో మీడియా అధిపతి గగ్గోలు పెట్టడం వెనుక మర్మం అందరికీ తెలుసని అసలు కాంగ్రెస్ నేతలు అంటున్నారు. సీఎం వారం రోజులు విదేశీ పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో రాజకీయంగా అస్థిరత సృష్టించేందుకు నిందారోపణ పూరిత కథనాలు రాయించారని అనుమానిస్తున్నారు. గతంలో కూడా ఆయన ఇటువంటి ప్రయత్నాలు చేశారని, ఉద్దేశపూర్వకంగానే 20శాతం కమీషన్ల మంత్రిగా ప్రచారం చేశారని, సెక్రటేరియట్ వద్ద కాంట్రాక్టర్లతో ధర్నా చేయించి అధిష్ఠానానికి ఆ వీడియో క్లిప్పింగులు పంపించారని అసలు కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు.
నైని గనుల షెడ్యూల్ ప్రకారం ఈనెల 22 సాయంత్రం 5 గంటల నుంచి బిడ్డింగ్ ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉన్నదని, కానీ ఎల్లో పత్రిక ఈనెల 18న కథనం రాసిందని గుర్తు చేశారు. అప్పటికి ఇంకా ఎవరూ పాల్గొనని టెండర్లో ఏదో జరిగిపోయిందని, అందుకు బాధ్యుడు డిప్యూటీ సీఎం అని పేరు పెట్టి రాయటంపై దళిత సంఘాలు మండిపడుతున్నాయి. ఇంత దారుణం జరిగినా ముఖ్యమంత్రి మాట్లాడకపోవటాన్ని తీవ్రంగా తప్పు పడుతున్నాయి.