హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్‌లో సర్వీస్ సెక్టార్‌ను సరళీకరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం సచివాలయంలో సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. అక్కడ లైడార్ సర్వే చేపట్టాలని పేర్కొన్నారు. ప్రాపర్టీలతోపాటు చెరువులు, నాలాలను పక్కాగా మ్యాపింగ్ చేసే అంశంపై దృష్టిసారించాలని అన్నారు.
సింగిల్ బిల్డింగ్ వ్యవస్థ, సులభతరమైన అనుమతులపై అధ్యయనం చేయాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీ, వాటర్‌బోర్డు, ఎలక్ట్రిసిటీతోపాటు ఏయే విభాగాలను చేర్చాలో.. ఆయా అంశాలను పరిశీలించాలని సూచించారు. అవసరమైతే నిపుణుల కమిటీని నియమించుకోవాలని తెలిపారు. అలాగే ఔటర్ రింగ్‌రోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్ అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.