Telangana | హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డితో బీజేపీ ముఖ్య నేతల రహస్య మంతనాలు నిజమేనా..? రెండు పార్టీల స్నేహ ‘హస్తం’ కండువాలు మార్చుకునేంతలా బలపడిందా..? కేంద్రం తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటూనే రాష్ట్రంలో ‘ఆపరేషన్ ఆకర్ష్’ పేరిట బీజేపీ నేతలకు సీఎం సీఎం వల విసురుతున్నారా? రాజాసింగ్ రెండు రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డిని ఉద్దేశించినవేనా? అంటే అవుననే సమాధానం వస్తున్నది.
ఇందుకు శనివారం అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. ‘మా మిత్రుడు మహేశ్వర్ రెడ్డి ఉన్నారు.. మంచి మనసుంటే ఈ రోజు కాకపోతే రేపైనా మాతోనే కూర్చుంటాడు..’ అని సీఎం రేవంత్ అసెంబ్లీ సాక్షిగా వ్యాఖ్యనించారు. ఇక ఈ వ్యాఖ్యలను మహేశ్వర్ రెడ్డి కూడా ఖండించకపోవడంతో పార్టీ మార్పు అనివార్యమా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
మరోవైపు ఏలేటి మహేశ్వర్‌రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గుర్తింపు, బీజేపీలో లేదని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి శనివారం చెప్పడం సైతం ఈ అనుమానాలను మరింత బలం చేకూరుస్తున్నది. ఎన్నికల ముందు వరకు కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అప్పటి పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితో పొసగకపోవడంతో పార్టీని వీడారు. బీజేపీలో చేరి నిర్మల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కాషాయపార్టీలో బీజేఎల్పీ నేతగా ప్రస్తుతం కొనసాగుతున్నారు.
కాంగ్రెస్ అధికారంలో వచ్చిన నాటి నుంచి సీఎం రేవంత్ రెడ్డిపై ఆయన విరుచుకుపడుతున్నారు. పలుమార్లు సంచలన ఆరోపణలు సైతం చేశారు. అయితే తనకు కొరకరాని కొయ్యగా మారిన ఏలేటి మహేశ్వర్‌రెడ్డిని పాత పరిచయాలతో పార్టీలో కీలక పదవి ఆఫర్ చేసి కాంగ్రెస్ కండువా కప్పుతారా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు మంత్రి సీతక్క ఇన్చార్జిగా ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచినా ఉమ్మడి జిల్లాకు ఇప్పటి వరకు ఎలాంటి మంత్రి పదవి దక్కలేదు. దీంతో ఏలేటికి మంత్రి పదవి, మరేదైనా క్యాబినెట్ ర్యాంకు పోస్ట్ ఇవ్వొచ్చనే చర్చ జోరుగా సాగుతున్నది.