హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): పంచాయతీ ఎన్నికల్లో రహస్య ఓటింగ్ విధానం అపహాస్యమవుతున్నది. గుట్టుగా ఉండాల్సిన ఓటు బహిర్గతమవుతున్నది. రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) అనుసరిస్తున్న విధానమే ఇందుకు కారణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లను గుట్టుగా ఉంచకుండా బహిరంగంగా ప్రకటించడంపై ఉద్యోగవర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులు, ఎన్నికల విధుల్లో ఉన్నవారు ముందుగానే పోస్టల్ బ్యాలెట్‌ను సమర్పిస్తారు. కౌంటింగ్ సమయంలో వాటిని ఓపెన్ చేసి లెక్కిస్తారు.
ఆ ఓటు ఎవరికి వేశారనేది బయటపెట్టరు. కానీ, తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లను బహిరంగంగా ప్రకటించారు. కౌంటింగ్ ప్రారంభానికి ముందే పోస్టల్ బ్యాలెట్లను తెరచి, ఆ ఓటు ఏ అభ్యర్థికి పడిందో పోలింగ్ బూత్ అధికారి వెల్లడించారు. వార్డుకు ఒక్కరే పోస్టల్ బ్యాలెట్ సమర్పించడంతో ఆ ఉద్యోగి ఎవరి ఓటు వేశారో తెలిసిపోవడంతో ఓటు దక్కని అభ్యర్థులు ఆ ఉద్యోగిని టార్గెట్ చేస్తున్నారు.
సాధారణంగా ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అధికంగా ఉంటాయి. వాటన్నింటినీ ఒకచోట పెట్టి లెక్కిస్తారు. దీంతో ఎవరు ఎవరికీ ఓటు వేశారో తెలియదు. కానీ, గ్రామాలు, వార్డుల్లో ఎవరు ఉద్యోగి అనే విషయం తెలిసిపోతుంది. వార్డుకు ఒక్కరే ఉద్యోగి ఉండి ఆ వ్యక్తి పోస్టల్ బ్యాలెట్ ద్వారా వేసిన ఓటును బహిరంగా ప్రకటిస్తే అందరికీ తెలిసిపోతుంది. ఆ ఓటు దక్కించుకున్న అభ్యర్థి సంతోషపడినప్పటికీ మిగిలిన అభ్యర్థులు ఆ ఉద్యోగిపై కోపం పెంచుకొనే అవకాశం ఉంటుంది.
బ్యాలెట్ పేపర్లపై ఓటర్లంతా స్వస్తిక్ ముద్ర వేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్‌కు మాత్రం టిక్ చేస్తే చెల్లుబాటు అవుతున్నది. ఆ ఓటు ఎవరికి పడిందో కౌంటింగ్‌కు ముందే బహిర్గతమవుతున్నది. అలా తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్‌ను ఉపయోగించుకున్న ఉద్యోగులు ఎవరికి ఓటు వేశారో తెలియడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పోస్టల్ బ్యాలెట్‌పై టిక్ చేయడాన్ని, ఆ ఓటును పోలింగ్ అధికారులు బహిరంగంగా ప్రకటించడాన్ని నిలిపివేయాలని ఉద్యోగులు కోరుతున్నారు.