ఉన్నంతలో రంది లేకుండా బతికిన ఆ ఇంట వ్యవసాయం కోసం చేసిన అప్పులు చిచ్చుపెట్టాయి. పచ్చగా కళకళలాడిన వారి కుటుంబాన్ని ఆగం చేశాయి. సకాలంలో రైతు భరోసా అందక, రుణమాఫీ కాక అప్పులతో పాటు మిత్తీలు పెరిగిపోయి ఇంటిపెద్ద పురుగుల మందుతాగి ప్రాణాలు వదలడంతో అతడి భార్యాపిల్లలు రోడ్డున పడ్డారు. అతడి అంత్యక్రియలకూ తల్లడిల్లిన కుటుంబీకులు, ఇప్పుడు కనీసం తిండికి లేక గోస పడుతున్నారు. ఆదుకోవాల్సిన పాలకులు, అధికారులు కన్నెత్తి చూడకపోవడంతో తమ బతుకులు ఎట్ల గడవాలని దిక్కులు చూస్తున్నారు. గతంలో కేసీఆర్ సర్కార్ అమలు చేసిన రైతుబీమా కింద రూ.5 లక్షల సాయం తప్ప ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ నుంచి ఆ కుటుంబానికి రూపాయి కూడా అందలేదు. పాలకుల నుంచి కనీసం పరామర్శలూ దొరకలేదు.
Telangana | 9న పిట్టల సుధాకర్(43) పురుగుల మందు తాగి ప్రాణం తీసుకున్నాడు. సుధాకర్‌కు భార్య విజయ, కొడుకు రాహుల్, కూతురు రవళి తల్లి వెంకటమ్మ ఉన్నారు. కుటుంబానికి ఊరిలోనే మూడెకరాల భూమి ఉన్నది. గతంలో ఉన్నంతలో బ్రతికేవారు. సుధాకర్ ఆధునిక పంటలు పండించుకుని ఆర్థికంగా ఎగగాలనే ఉద్దేశంతో అప్పులు తెచ్చి బావి తవ్వించాడు. నీటి ఊటలు తక్కువగా ఉండటంతో మరికొంత అప్పు చేసి సైడుబోర్లు వేశాడు. ఇదే తరుణంలో కూతురు రవళి పెండ్లి కోసం మరింత అప్పు చేశాడు. ఆ తర్వాత పరిణామాలలో తెచ్చిన అప్పులకు మిత్తీలు పెరిగిపోయాయి. సాగునీరు లేక పంటల దిగుబడి సరిగా రాలేదు. అప్పుల భారం మోయలేనంతగా పెరిగింది. సుధాకర్ చనిపోయే నాటికి మొత్తం అప్పు రూ.15 లక్షలకు చేరుకుంది. అప్పులవాళ్ల నుంచి ఒత్తిడి పెరిగింది. అప్పు విషయంలో కొందరు పరుషపదజాలంతో నిలదీయడంతో నిరాశకు గురైన సుధాకర్ వ్యవసాయ బావి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ టైమ్‌లో కనీసం అంత్యక్రియల ఖర్చు కూడా భరించలేని స్థితిలో వారి కుటుంబం ఉన్నది. బంధుమిత్రుల సాయంతో అంత్యక్రియల తంతు ముగిసింది.
సాంకేతిక కారణాలతో సుధాకర్ కుటుంబానికి రైతు బీమా పథకం అందలేదు. 2024 ఏప్రిల్ 5న ‘నమస్తే తెలంగాణ’ పత్రిక ‘అప్పులు భారమై-పంటలు దూరమై’అనే శీర్షికన కథనాన్ని ప్రచురించింది. అధికారులు సుధాకర్ ఇంటికి వెళ్లి వివరాలు సేకరించారు. సాంకేతిక సమస్యలను పరిష్కరించి కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బీమా కింద రూ.5 లక్షలను మంజూరు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి సుధాకర్ కుటుంబానికి ఏ రకమైన సాయమూ అందలేదు. పాలకుల నుంచి కనీసం పరామర్శ కూడా దక్కలేదు. పిట్టల సుధాకర్ సంవత్సరీకం దగ్గరికి వస్తున్నా ఇప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం నుంచి ఏలాంటి సహకారాలు అందించలేదు. సుధాకర్ భార్య విజయ, వృద్ధాప్యంలో ఉన్న తల్లి వెంకటమ్మ కూలీ పనులకు పోతూ జీవన పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు ఇద్దరు కూలీ పనులు చేస్తున్నప్పటికి అప్పులకు మిత్తీ కట్టలేక పోతున్నారు. ప్రస్తుతం సుధాకర్ కుటుంబానికి తిండికీ ఇబ్బందులు ఉన్నాయి. సాగు కోసం అప్పుల బాధతో కుటుంబ యాజమానిని కొల్పోయి చచ్చిచెడీ బతుకీడుస్తున్న సుధాకర్ కుటంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరుఫున ఏ ఒక్కరూ కనీసం ఓదార్చడానికి రాలేదు. విజయకు వితంతు ఫించను మంజూరు చేయలేదు. సుధాకర్ మరణంతో రైతు బీమా కోసం డెత్ సర్టిఫికెట్ మంజూరైంది. దీని ఆధారంగా రైతు బంధు(రైతు భరోసా) వర్తించకుండా పోయింది. భూమి సుధాకర్ నుంచి భార్య పేరు మీదికి మారితేనే రైతు భరోసా పథకం వర్తిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల అరకొరగా చేసిన పంట రుణాల మాఫీపైనా చాలా మంది రైతుల తరహాలోనే సుధాకర్ కుటుంబానికి స్పష్టత లేదు.
అందరు వడ్లు, మక్కలు పండించుకుంటున్రు. మనం గూడ మంచి పంటలు పండించుకుందామని మా ఆయన అప్పులు చేసి బాయి తవ్విండు. నీళ్లు పడకపోతే సైడుబోర్లు వేయించిండు. అప్పులు ఎక్కువైనయి. ఇంతలనే అప్పు చేసి నా బిడ్డకు పెండ్లి చేసినం. పాత అప్పులు కొత్త అప్పులు మూటలెక్కయ్యి కష్టంల పడ్డం. అప్పులోళ్ల లొల్లి ఎక్కువయ్యి బాయికాన్నే పురుగుల మందు తాగి చచ్చిపోయిండు. అప్పులోళ్లను ఆగపట్టుడు కట్టంగా ఉంది. ఏం చెయ్యాల్నో తెలుత్తలేదు. కేసీఆర్ సారు తీసుకచ్చిన రైతుబీమా కింద వచ్చిన ఐదు లచ్చలతోటి కొంచెం నిమ్మలపడ్డం. ఇప్పడు మిగిలిన అప్పులు ఎట్ల గట్టాల్నో తెలుత్తలేదు. మేము ఇంత మందాగి సత్తే మంచిగుండు అనిపిత్తాంది.’