హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నెలకొల్పిన ‘రైతు డిస్కమ్’ రైతుల పాలిట శాపంగా మారుతుందనే ఆందోళన వ్యక్తమవుతున్నది. రైతన్నకు ధీమా కల్పిస్తున్న ఉచిత విద్యుత్తుకు క్రమంగా ఎసరుపెడుతుందనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. పేరేమో.. రైతు డిస్కమ్.. కానీ, దీని పేరిట జరిగేదంతా రైతు వ్యతిరేక చర్యలే. మూడో డిస్కమ్ పేరిట ప్రభుత్వం అనేక సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నది. సాగుకు స్మార్ట్‌మీటర్లు వస్తాయి. దాదాపు 5.22 లక్షల ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లు బిగిస్తారు.
ప్రభుత్వం ఎంత స్మార్ట్‌గా రైతు డిస్కమ్‌ను ఏర్పాటు చేసిందో.. అంతే స్మార్ట్‌గా రైతన్న నెత్తిన కుచ్చుటోపీ పెడుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలోని వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు, ఎత్తిపోతల పథకాలు, జలమండలి, మున్సిపల్ వాటర్ కనెక్షన్లు, మిషన్ భగీరథ పథకాల విద్యుత్తు కనెక్షన్లను కొత్తగా ఏర్పాటైన ‘రైతు డిస్కమ్’ పరిధిలోకి చేర్చారు. ఈ డిస్కమ్ ఏర్పాటును విద్యుత్తు రంగ నిపుణులు, విద్యుత్తు ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఉచిత విద్యుత్తు (వ్యవసాయ) కనెక్షన్లు, ఎత్తిపోతల పథకాలు, మిషన్ భగీరథ కనెక్షన్లను ప్రభుత్వం రైతు డిస్కమ్ పరిధిలోకి తెచ్చింది. ఇవేవీ నెల వారీ బిల్లులు వసూలు చేసుకునే కనెక్షన్లు కావు. ఈ బిల్లుల మొత్తాన్ని ప్రభుత్వమే సబ్సిడీ రూపంలో చెల్లిస్తుంది. ఇప్పటికే ఇరిగేషన్ శాఖకు చెందిన కనెక్షన్ల బకాయిలు గుట్టల్లా పేరుకుపోయాయి. విద్యుత్తు బిల్లుల రూపంలో ఆ శాఖ రూ.27,027 కోట్లు బకాయి పడ్డది. ఇదిలా ఉంటే సర్కార్ ఇస్తామన్న సబ్సిడీ సకాలంలో ఇవ్వడంలేదు. నెలకు రూ.1,200 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, ఇవ్వడంలేదు. దీంతో విద్యుత్తు సంస్థల్లో జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొన్నది.
రైతు డిస్కమ్‌కు ఆదాయం ఉండదు. నయాపైసా బడ్జెట్ ఉండదు. సర్కార్ ఇచ్చే సబ్సిడీ సరిపోకపోతే ఈ డిస్కమ్ నడిచే పరిస్థితి ఉండదు. దివాలా తీస్తుంది. అప్పుడు.. ఉచిత విద్యుత్తు భారాన్ని డిస్కమ్ మోయలేకపోతున్నదన్న వాదనను తెరపైకి తెస్తుంది. ఇక రైతులే బిల్లులు కట్టండి అనే పరిస్థితికి తీసుకొస్తారనే వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తంగా రైతు డిస్కమ్ పేరిట రైతులకు టోపీపెట్టేందుకు కాంగ్రెస్ సర్కార్ పావులు కదుపుతున్నదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రైతుల పేరిట ఏర్పాటైన డిస్కమ్ లాభాలతో ఉండాలి. ఈ డిస్కమ్‌కు సర్కార్ బడ్జెట్ రూపంలో మద్దతునివ్వాలి. కానీ, దీనికి విరుద్ధంగా సర్కార్ చర్యలున్నాయి. రైతు పేరిట ఏర్పాటైన ఈ డిస్కమ్ వేల కోట్లు అప్పులతో ఏర్పడింది. దమ్మిడి ఆదాయం లేకుండా కార్యకలాపాలు సాగించనున్నది. సర్కార్ ఉత్తర, దక్షిణ డిస్కమ్‌ల అప్పులను రైతు డిస్కమ్‌కు బదలాయించింది. టీజీ జెన్కో, సింగరేణి నుంచి విద్యుత్తు వినియోగించుకున్నందుకు ఉత్తర, దక్షిణ డిస్కమ్‌లు రూ.31,697 కోట్లు చెల్లించాల్సి ఉన్నది. వీటిలో రూ.26,950 కోట్లు రైతు డిస్కమ్‌కు బదలాయించారు. మరో రూ.9,032 కోట్ల రుణాలను సైతం మూడో డిస్కమ్ ఖాతాలోనే వేశారు.
మొత్తంగా రైతు పేరిట ఏర్పాటు చేసిన డిస్కమ్ రూ.35,982 కోట్ల అప్పుతో ఆవిర్భవించింది. ప్రభుత్వ శాఖల మొండిబకాయిలు రూ.35,982 కోట్లున్నాయి. ఈ మొండి బకాయిలను ఇప్పుడున్న డిస్కమ్‌లే వసూలు చేసుకోలేకపోయాయి. రైతు డిస్కమ్ ఎలా వసూలు చేసుకోగలుగుతుందన్నది ప్రశ్న. ఈ మొండిబకాయిలు వసూలయ్యేదెప్పుడు.. అప్పులు తీర్చేదెప్పుడు..అన్న ప్రశ్నలొస్తున్నాయి. ఒకవేళ వసూలైనా అప్పులు, జనరేటర్లకు చెల్లించాల్సిన మొత్తం రూ. 35,982 కోట్లే. అంటే థర్డ్ డిస్కమ్ బ్యాలెన్స్ జీరో అన్నమాట.
ఉత్తర, దక్షిణ డిస్కమ్‌లు కొంత క్రాస్ సబ్సిడీ రూపంలో ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి. పారిశ్రామిక, కమర్షియల్ కనెక్షన్లకు అధిక టారిఫ్ విధించడంతో ఇక్కడ వచ్చిన ఆదాయాన్ని ఉచిత విద్యుత్తుకు సర్దుబాటు చేస్తున్నారు. ఉచిత కనెక్షన్లు రైతు డిస్కమ్‌లోకి, అధిక ఆదాయం తెచ్చే పారిశ్రామిక, వాణిజ్య, హెచ్డీ కనెక్షన్లు ఉత్తర, దక్షిణ డిస్కమ్ పరిధిలోకి వచ్చాయి. అంటే ఈ క్రాస్ సబ్సిడీ కట్ అయినట్లే లెక్క. ఉత్తర, దక్షిణ డిస్కమ్‌లు క్రాస్ సబ్సిడీని వాడుకుంటాయి. అంటే కమర్షియల్, పరిశ్రమల కనెక్షన్ల నుంచి వచ్చే లాభాన్ని పొందుతాయి.
రైతు డిస్కమ్‌కు క్రాస్ సబ్సిడీని బదిలీచేయడం కుదరదు. రైతు డిస్కమ్‌కు రూపాయి ఆదాయముండదు కేవలం సర్కార్ ఇచ్చే సబ్సిడీయే దీనికి ఆధారం. ఇప్పుడు ఆదాయం ఉండి. క్రాస్‌సబ్సిడీ రూపంలో కొంత మొత్తం సర్దుబాటు చేస్తేనే డిస్కమ్‌ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంలేదు. విద్యుత్తు సక్రమంగా అందడంలేదు. కరెంట్ కోతలు విధిస్తున్నారు. ప్రభుత్వమిచ్చే సబ్సిడీతో నడిచే డిస్కమ్ ఎలా మనుగడ సాగించగలుగుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
రాష్ట్రంలో మూడో డిస్కమ్ ఏర్పాటు నిర్ణయాన్ని సాక్షాత్తు అదే సంస్థల్లోని ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సర్కార్ చర్యలను విద్యుత్తు ఇంజినీర్లు, ఉద్యోగులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. మూడో డిస్కమ్ ఏర్పాటును పునః పరిశీలించాలని తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ (టీజీ పీఈజేఏసీ) డిమాండ్ చేసింది. దాదాపు 20కి పైగా సంఘలతో కూడిన జేఏసీ ఇటీవలే ఉన్నతాధికారులను కలిసి తమ అభ్యంతరాలు వ్యక్తంచేసింది. రైతు డిస్కమ్ పేరిట ఇప్పుడున్న దక్షిణ డిస్కమ్, ఉత్తర డిస్కమ్‌లను ప్రైవేటీకరించే ప్రమాదం పొంచి ఉన్నదని, ఎనర్జీ ఆడిటింగ్, మీటరింగ్, సెటిల్మెంట్ సమస్యలు ఉత్పన్నమవుతాయని ఆందోళన వ్యక్తంచేసింది. అంతేకాకుండా ట్రూ అప్ (వాస్తవ) సర్దుబాటు సమస్యలొస్తాయని చెప్తున్నారు. ఈ నిర్ణయంపై సర్కార్ పునరాలోచన చేయాలని అన్ని సంఘాలు ముక్తకంఠంతో కోరుతున్నాయి.

సాగుకు స్మార్ట్ మీటర్లు పెట్టేందుకు సర్కార్ పచ్చ జెండా ఊపింది. రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ (ఆర్డీఎస్ఎస్)లో రాష్ట్రం చేరింది. గతంలో వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టే ప్రతిపాదన ఉండగా, తాజాగా ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్లకు స్మార్ట్‌మీటర్లు పెట్టబోతున్నారు. దీనికి రైతు డిస్కమ్ పేరిటనే సర్కార్ అంకురార్పణ చేయనున్నది. రాష్ట్రంలో 5,22,479 అగ్రికల్చర్ ట్రాన్స్‌ఫార్మర్లున్నాయి. వీటిన్నింటికీ స్మార్ట్‌మీటర్లు బిగిస్తారు. స్మార్ట్ మీటర్లు ఇన్స్టాల్ చేసేందుకు రూ.1,306 కోట్లు ఖర్చుచేస్తారు. మీటర్లు బిగించిన తర్వాత మీటర్ రీడింగ్ తీసి విద్యుత్తు వినియోగం నమోదు చేస్తారు. థర్డ్ డిస్కమ్ వినియోగించే మొత్తం విద్యుత్తును లెక్కిస్తారు. ఆ తర్వాత బిల్లులు జారీచేసే అవకాశం ఉంటుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మొదట జీరో బిల్లులు జారీచేసి.. ఆ తర్వాత క్రమంగా ఉచిత విద్యుత్తును ఎగవేసి మొత్తం బిల్లులు జారీచేసే ప్రమాదం లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.