హైదరాబాద్, మే 3 (నమస్తేతెలంగాణ) : ఎండాకాలం సెలవుల నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. శనివారం రికార్డు స్థాయిలో 91,005 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. స్వామివారికి 36,257 మంది తలనీలాలు సమర్పించుకున్నారని, భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం ఒక్కరోజే రూ.3.37 కోట్లుగా నమోదై రికార్డు సృష్టించినట్లు అధికారులు వెల్లడించారు. ఆదివారం భక్తుల రద్దీ మరింత పెరగడంతో సర్వదర్శనం కోసం వేచి ఉండే భక్తుల క్యూలు ఏటీజీహెచ్ ప్రాంతం వరకు కొనసాగుతున్నది.
దర్శన టోకెన్లు లేని సామాన్య భక్తులకు శ్రీవారిని దర్శించుకునేందుకు సుమారు 16 గంటలపైగా సమయం పడుతున్నది. సెలవులు ముగిసే వరకు భారీ రద్దీ కొనసాగే అవకాశం ఉన్నందున, టీటీడీ అధికారులు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. భక్తులు రద్దీ దృష్ట్యా తమ ప్రయాణాలు సాగించాలని టీటీడీ కోరింది. సెలవుల కారణంగా భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరు గు తున్నదని, సెలువుల అనంతరం సా ధారణ స్థాయికి చేరుకుంటుందని తెలిపింది.