Vinesh Phogat : మాజీ రెజ్లర్, ప్రస్తుత ఎమ్మెల్యే వినేశ్ ఫొగాట్ (Vinesh Phogat) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. తనను పునరాగమనం చేయకుండా భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) అడ్డుకుంటుందని ఆరోపించిన వినేశ్ ఈసారి తాను బ్రిజ్ భూషణ్ (Brij Bhushan) బాధితురాలినే అంటూ ఎక్స్‌లో వీడియో పెట్టింది. రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా భూషణ్ వేధింపులకు బలైన ఆరుగురిలో నేను ఒకరు అని ఆ వీడియోలో చెప్పింది వినేశ్. అయితే.. కేసు కోర్టు పరిధిలో ఉన్నందున పూర్తి వివరాలు చెప్పడానికి ఆమె నిరాకరించింది.
భారత రెజ్లింగ్ సమాఖ్యతో పోరాడుతున్న వినేశ్ ఫొగాట్ తొలిసారి తాను బాధితురాలిని అని బహిరంగంగా ప్రకటించింది. ఆదివారం సోషల్ మీడియా ఎక్స్‌లో వీడియో పెట్టిన వినేశ్ తనను కూడా బ్రిజ్ భూషణ్ వేధించాడని చెప్పింది. ‘సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం బాధితుల వివరాలు వెల్లడించకూడదు. ఎందుకంటే పేర్లు, వివరాలు బహిర్గతం చేయడం బాధితుల గౌరవం, పరువుకు భంగం కలిగిస్తుంది. అయినా సరే కొన్ని పరిస్థితుల కారణంగా నేను ఈరోజు మీకు ఓ విషయం చెప్పాలనుకుంటున్నా. కేసు కోర్టులో పెండింగ్‌లో ఉన్నందున నేను ఇన్నాళ్లు మాట్లాడలేదు. కానీ, మీకు ఒక విషయం చెప్పాలి.
🇮🇳🙏 pic.twitter.com/hQrGmMLMrS
— Vinesh Phogat (@Phogat_Vinesh) May 3, 2026
బ్రిజ్ భూషణ్‌పై కేసు వేసిన ఆరుగురు బాధితుల్లో నేను ఒకరు. మేము సాక్ష్యాలను సమర్పించినా.. కేసు ఇంకా నడుస్తోంది అని వినేశ్ వెల్లడించింది. 2023లో రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా ఉన్న బ్రిజ్ భూషణ్‌ను పదవి నుంచి తొలగించాలని రెజ్లర్లు ధర్నాకు దిగిన విషయం తెలిసిందే. మహిళా రెజ్లర్లను అనుచితంగా తాకుతూ.. లైంగిక వేధింపులకు గురి చేసిన భూషణ్‌పై వేటు వేయాలని జరిగిన ఉద్యమానికి వినేశ్ ఫొగాట్ నాయకత్వం వహించింది. రెజ్లర్ల పోరాటంతో భూషణ్‌ను తప్పించి ఎన్నికలు నిర్వహించారు. ప్రస్తుత అధ్యక్షుడు సంజయ్ సింగ్ మాజీ చీఫ్ భూషణ్ చేతిలో కీలుబొమ్మ అని వినేశ్ విమర్శిస్తోంది. అందుకనే ఆసియా క్రీడలతో పునరాగమనం చేయాలనుకుంటున్న తనను రెజ్లింగ్ సమాఖ్య అడ్డుకుంటోందని ఆమె ఆరోపిస్తోంది.
పారిస్ ఒలింపిక్స్‌లో పతకం చేజారిన బాధలో వినేశ్ ఫొగాట్ రెజ్లింగ్‌కు వీడ్కోలు పలికింది. ఆపై రాజకీయాల్లో అడుగుపెట్టిన ఆమెమె కుస్తీ పోటీలకు దూరమై దాదాపు 20 నెలలు అవుతోంది. ఆసియా క్రీడలతో పునరాగమనం చేయాలని భావించిన ఆమెకు అడుగడుగునా ఆటంకాలు ఎదురువుతున్నాయి. ఉద్దేశపూర్వకంగానే తనకు భారత రెజ్లింగ్ సమాఖ్య అడ్డుపడుతోందని వినేశ్ అంటోంది.

‘నేషనల్ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నమెంట్‌తో నేను పునరాగమనం చేయాలని ఆశిస్తున్నా. అందుకు రిజిస్ట్రేషన్ గడువు ఏప్రిల్ 30వ తేదీ వరకూ ఉంది. పేరు నమోదు చేసుకునేందుకు ప్రయత్నించగా వెబ్సైట్ పోర్టల్‌లో దరఖాస్తు ప్రక్రియ ముగిసింది అని చూపిస్తోంది. ఈ విషయమే రెజ్లింగ్ సమాఖ్య సిబ్బందిని సంప్రదించేందుకు పలుమార్లు ప్రయత్నించాను. కానీ, వారు నా ఫోన్ ఎత్తడం లేదు అని వినేశ్ ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సంస్థతో తన గోడును వెళ్లబోసుకుంది. రెజ్లింగ్ సమాఖ్య నుంచి ఇలా తిరస్కారాలకు గుర్వవడం ఇదే మొదటిసారి కాదని, ఫెడరేషన్ కప్ సమయంలోనూ తనకు ఇదే పరిస్థితి ఎదురైందని వినేశ్ వాపోయింది.
My registration to participate in the upcoming ranking tournament was done this morning. I could not complete the registration yesterday as the link was closed.
Thank you for the support from everyone. I am looking forward to competing in my first competition after 20 months. pic.twitter.com/zxInXup7hX
— Vinesh Phogat (@Phogat_Vinesh) April 28, 2026
అయితే.. రెజ్లింగ్ సమాఖ్య మాత్రం వినేశ్ ఫొగాట్ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. రిజిస్ట్రేషన్ సమయంలో వినేశ్ ఒక్కరే కాదు చాలామంది రెజ్లర్లు సమస్యలు ఎదుర్కొన్నారని డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు సంజయ్ సింగ్(Sanjay Singh) తెలిపాడు. ‘వినేశ్ మాదిరిగానే ఇతర రెజ్లర్ల నుంచి కూడా మాకు ఫిర్యాదులు వస్తున్నాయి. వారికి మా సిబ్బంది సహాయం చేసి వారి సమస్యకు పరిష్కారం చూపించారు. మేము పోటీలో పాల్గొనకుండా ఎవరినీ అడ్డుకోము. ఎందుకంటే.. ఈ టోర్నమెంట్లో అందరూ పోటీపడవచ్చు’ అని సంజయ్ సింగ్ వెల్లడించారు. మరునాడే వినేశ్ ఫొగాట్ తన పేరును రిజిష్టర్ చేసుకున్నానని ఎక్స్ వేదికగా వెల్లడించింది. ఆసియా క్రీడలు సెప్టెంబర్‌లో, అనంతరం అక్టోబర్‌లో వరల్డ్ ఛాంపియన్షిప్స్ ప్రారంభం కానున్నాయి.