కరీంనగర్, జనవరి 22(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/గోదావరిఖని : సింగరేణిలో నైని టెండర్ వ్యవహారం ఒకవైపు అధికార పార్టీలో మంటలు రేపుతుండగా.. ఇప్పుడు మరో బ్లాక్‌ను కొల్లగొట్టేందుకు రంగం సిద్ధమైంది. వివాదాస్పదమైన ‘సైట్ విజిట్ సర్టిఫికెట్’ నిబంధననే అడ్డుగా పెట్టి, ఏకంగా రూ.1,044.66 కోట్ల విలువైన మణుగూరులోని ప్రకాశం ఖని ఓపెన్‌కాస్టును అనుయాయులకు కట్టబెట్టేందుకు ముఖ్యనేత బంధువు చక్రం తిప్పుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. తాను చెప్పిన వారికి తప్ప ఎవరికీ సర్టిఫికెట్ ఇవ్వద్దని ఇప్పటికే సదరు నేత అధికారులకు హుకుం జారీ చేసినట్టు తెలుస్తున్నది.
టెండర్ దాఖలు చేసేందుకు వచ్చే నెల 2వరకు గడువు ఉండగా, ఇతరులెవరూ ఈ టెండర్లో పాల్గొనకుండా ఇప్పటికే బెదిరించినట్టు సమాచారం. సైట్ విజిట్ సర్టిఫికెట్ నిబంధన కేంద్ర, రాష్ట్ర స్థాయిలో దుమారం రేపడం, దీంతో నైని బ్లాక్ టెండర్‌ను రద్దు చేస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే నిబంధనతో మరో బొగ్గు బ్లాక్‌కు టెండర్లు పిలువడం, దాన్ని రద్దు చేయకుండా కొనసాగించడం కొత్త చర్చకు దారితీసింది.
నైని బ్లాక్ టెండర్ల విషయంలో పెట్టిన నిబంధనలు వివాదాస్పదం కావడం, మంత్రుల మధ్యే విభేదాలు పొడచూపడం, కార్మికుల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిన నేపథ్యంలో టెండర్‌ను రద్దు చేస్తున్నట్టు సర్కార్ ప్రకటించింది. అయితే ఈ విధానం అన్నింటికీ వర్తింపజేయకుండా కాంగ్రెస్ సర్కార్ దోబూచులాడుతున్నది. మణుగూరు ఏరియాలోని ప్రకాశం ఖని ప్రాజెక్టు టెండరే దీనికి నిదర్శనంగా నిలుస్తున్నది. నిజానికి సింగరేణిలో ఇప్పటివరకు ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గుపై కప్పబడి ఉండే ఓవర్ బర్డెన్(మట్టి తొలగింపు) పనులు మాత్రమే ప్రైవేట్ వ్యక్తులు నిర్వహిస్తున్నారు. దీనికి ఓపెన్ టెండర్ ఉండేది. అందులో పాల్గొన్న వారి అర్హత, సామర్థ్యాలను బట్టి సంస్థ టెండర్లు అప్పగించేది. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త ఎత్తగడలు వేస్తున్నది.
తాను అనుకున్న వ్యక్తులకు కట్టబెట్టేందుకు కొత్త నిబంధనను అమల్లోకి తెచ్చింది. తాజాగా ‘సైట్ విజిట్ సర్టిఫికెట్’ నిబంధనను తెచ్చి అనుకున్న వారికి అప్పగించింది. ఇదే సమయంలో నైని బ్లాక్‌లో ఏకంగా బొగ్గు ఉత్పత్తిని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు ఎండీవో పేరిట టెండర్లు పిలిచింది. నైని టెండర్లలో పారదర్శకత లేదని, ఒకే ఒక్క సంస్థకు లబ్ధి చేకూర్చేలా నిబంధనలు మార్చారని విపక్షాలు మండిపడ్డాయి. కార్మిక లోకం కన్నెర్రజేసింది. ఈ విషయంలో మంత్రుల మధ్య వచ్చిన విభేదాలు ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేశాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని నైని టెండర్లను ప్రభుత్వం రద్దు చేసింది. అధికార పార్టీలో ఈ మంటలు చెలరేగుతూనే ఉండగా, మరో బ్లాక్‌ను ఇదే కోవలో అప్పగించేందుకు సిద్ధమవుతున్నది.
నైని బ్లాక్ విషయంలో గనిని సందర్శించినట్టు సింగరేణి అధికారుల నుంచి సర్టిఫికెట్ పొందిన వారు మాత్రమే బిడ్డింగ్‌కు(సైట్ విజిట్ సర్టిఫికెట్) అర్హులనే నిబంధనపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పుడు ఇదే నిబంధన ప్రకాశం ఖని టెండర్లోనూ కొనసాగుతుండడం తీవ్ర చర్చనీయాంశం అవుతున్నది. నైని టెండర్‌ను రద్దు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రకాశం ఖని టెండర్‌పై ఎందుకు మౌనం వహిస్తున్నదని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇటీవల ప్రకాశం ఖనికి సింగరేణి టెండర్లు పిలిచింది.
ఈ పనుల విలువ సుమారు రూ.1,044.66 కోట్లు. అయితే నైని టెండర్లో ఏ నిబంధననైతే తప్పు పట్టారో, అదే సైట్ విజిట్ సర్టిఫికెట్ ప్రకాశం ఖని టెండర్ నోటీస్లోనూ పొందుపరిచారు. సర్టిఫికెట్ లేకపోతే బిడ్డర్లను అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉండడంతో ఇది కూడా పాత పద్ధతిలోనే సాగుతున్నదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నైని విషయంలో ‘బెనిఫిట్ ఆఫ్ డౌట్’ కింద రద్దు చేసిన ప్రభుత్వం, ఇప్పుడు ప్రకాశం ఖని టెండర్ విషయంలో నిర్ణయం తీసుకోకపోవడానికి కారణాలు ఏమిటన్న దానిపై చర్చ జరుగుతున్నది. ఒకేరక నిబంధనలు ఉన్నప్పుడు ఒక టెండర్ రద్దు చేసి, మరొకటి ఎలా కొనసాగిస్తారన్న వాదన నడుస్తున్నది.
ఇప్పటికే సింగరేణిలో మితిమీరిన జోక్యం చేసుకుంటూ.. కాంట్రాక్టర్లను బెదిరిస్తూ.. పలు టెండర్లను తాను అనుకున్న వారికి కట్టబెడుతున్న ఓ ముఖ్యనేత బంధువే ఈ టెండర్లోనూ చక్రం తిప్పుతున్నట్టు తెలుస్తున్నది. ఆయన ఆదేశాల ప్రకారమే ఈ టెండర్ నిబంధనలను రూపొందించారని అధికార వర్గాల సమాచారం. అయితే ప్రకాశం ఖని ఓపెన్‌కాస్ట్‌ను సైతం తాను అనుకున్న వారికే కట్టబెట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన సదరు నేత బంధువు, సైట్ విజిట్ సర్టిఫికెట్ తాను చెప్పిన వారికి మాత్రమే ఇవ్వాలని హుకుం జారీ చేశారట.
అందుకోసం కొంత మంది కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొనేందుకు సైట్ విజిటింగ్ వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తే.. వారికి సదరు నేత బం ధువు నుంచి బెదిరింపులు వెళ్లాయని తెలుస్తున్నది. అందుకే చాలామంది విజిట్‌కు వెళ్లడం లేదని తెలుస్తున్నది. ఈ మేరకు సదరు కాంట్రాక్టర్‌తో బేరసారాలు కుదిరాయని తెలుస్తున్నది.