RTC | హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ) : ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలుచేయాలని ఆర్టీసీ కార్మికులు జంగ్ సైరన్ మోగించారు. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 95 డిపోల పరిధిలో దాదాపు 35వేల మంది కార్మికులు కార్యక్రమంలో పాల్గొననున్నట్టు ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ థామస్‌రెడ్డి, కన్వీనర్ మౌలానా, కో కన్వీనర్ యాదయ్య వెల్లడించారు. ఆర్టీసీ జేఏసీ పిలుపుమేరకు ఎంజీబీఎస్ గౌలిగూడ బస్‌స్టేషన్‌లో ఉదయం 7 నుంచి 9గంటల వరకు, 10 నుంచి 11:30 గంటల వరకు తార్నాక దవాఖానలో, మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు సికింద్రాబాద్ పికెట్‌లో నిర్వహించే కార్యక్రమంలో జేఏసీ ప్రతినిధులు పాల్గొననున్నట్టు తెలిపారు.
ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికుల డిమాండ్లతో కూడిన కరపత్రాలను పంపిణీ చేస్తామని చెప్పారు. ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా నిరసన కార్యక్రమం చేపట్టి సమస్యలను పరిష్కరించుకోనున్నట్టు స్పష్టంచేశారు. 3 వేల కొత్త నియామకాలు చేపడుతామని మూడు మాసాలుగా ఊదరగొడుతున్నా ఇప్పటికీ చర్యలు తీసుకోలేదని, వెంటనే నియామకాల నోటిఫికేషన్ ప్రకటించాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని ఎస్‌డబ్ల్యూయూ ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొమిరెల్లి రాజిరెడ్డి, ప్రచార కార్యదర్శి కొవ్వూరు యాదయ్య డిమాండ్ చేశారు.