హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ) : ఆర్టీసీ విలీనానికి ప్రభుత్వం ఎన్నికలను మెలిక పెట్టడంతో ఈ సమస్య ఇప్పట్లో తేలేలా లేదు. ప్రభుత్వం తెలివిగా ముడిపెట్టిన పీటముడిని సామరస్యంగా పరిష్కరించుకునే తీరిక లేక కార్మిక సంఘాల నేతలు ‘వాట్సాప్‌లో మెసేజ్‌ల యుద్ధాలు’ చేస్తున్నారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియలో కచ్చితంగా యూనియన్ల నేతలు ఉండాలని చెప్పడంతో, ప్రభుత్వం దానిని అవకాశంగా భావించింది. ఇప్పటికే ఆర్టీసీ కార్మిక జేఏసీ నేతలను విలీన కమిటీలో నియమించకుండా గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలిచిన వారిని కమిటీలో సభ్యులుగా నియమిస్తామని ముడి పెట్టింది. దీంతో ఆయా యూనియన్ల నేతలు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.
తక్షణమే విలీన ప్రక్రియ ప్రారంభించాలని కార్మికులు కోరుతుండగా, మొదట యూనియన్ల సంగతి తేల్చండి అంటూ నేతలు వంత పాడుతున్నారు. తొలుత ఈ అభిప్రాయం ఒకరిద్దరు కార్మిక నేతల నుంచే రాగా.. ఈ అంశం ఇప్పుడు కార్మిక వర్గాల్లోనూ చర్చకు దారి తీసింది. కార్మికులంతా ముక్తకంఠంతో ప్రభుత్వంలో విలీనం కావాలన్నదే ప్రధాన డిమాండ్‌తో సమ్మెకు వెళ్తే.. కొందరు కార్మిక నేతలు ఆర్టీసీలో కార్మిక సంఘాల పునరుద్ధరణ, గుర్తింపు ఎన్నికలకే ఎకువ ప్రాధాన్యం ఇచ్చారు. ప్రధాన డిమాండ్ అమలుకాకుండా గుర్తింపు యూనియన్ ముసుగులో ప్రభుత్వం ఈ ప్రక్రియనుఅడ్డుకునే ప్రమాదం లేకపోలేదని అనుమానిస్తున్నారు.
ప్రభుత్వం ఉద్యోగుల విలీనాన్ని గుర్తింపు సంఘం ఎన్నికలతో ముడిపెట్టడంతో కార్మిక సంఘాల నేతల మధ్య వివాదం రాజుకున్నది. గుర్తింపు యూనియన్ల ప్రాతినిధ్యం మాత్రమే ఉండేలా చేసే కుట్రను అడ్డుకోవాలని, జేఏసీ తరహాలో అన్ని సంఘాల ప్రతినిధులకు కమిటీలో ప్రాతినిధ్యం దకాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ఉన్నతాధికారులతో భేటీల్లో కూడా విలీనం, గుర్తింపు సంఘం ఎన్నికలు వంటి కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఆయన మాటలతో విలీన ప్రక్రియ కంటే, గుర్తింపు సంఘం ఎన్నికలకే ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చిందని కార్మికులు అంటున్నారు. దీంతో విలీన ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నదని చెప్తున్నారు.
ఆర్టీసీ ఉద్యోగుల విలీనానికి ప్రభుత్వం మొగ్గుచూపిన వేళ జేఏసీలో లేని సంఘాలు చేస్తున్న హడావుడిని కార్మికులు గుర్తించాలని నేతలు కోరుతున్నారు. కార్మికుల విజయం తర్వాత కొన్ని గోముఖవ్యాఘ్రాలు యూనియన్ నాయకులుగా మీ ముందుకు వస్తున్నారని, కార్మికులంతా వారి చరిత్రను పరిశీలించాలని వేడుకుంటున్నారు. లేకపోతే మళ్లీ మాయమాటలు, అబద్ధాలతో మోసం చేస్తారని చెప్తున్నారు. నిరుడు సమ్మె నోటీసులు ఇచ్చినప్పుడూ ప్రభుత్వ పెద్దలతో రహస్య మంతనాలు జరిపిన నాయకులు.. ఇప్పుడు సమ్మె క్రెడిట్ తీసుకోవాలని చూడటాన్ని కార్మికులు గమనించాలంటున్నారు.