హైదరాబాద్, జూలై 27(నమస్తే తెలంగాణ): ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రంలో రహదారులు అస్తవ్యస్తంగా మారాయి. 16 జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఒక్క పంచాయతీరాజ్‌శాఖ పరిధిలోనే రూ.305 కోట్ల నష్టం జరిగిందని ఆ శాఖ ప్రాథమిక అంచనా వేసింది. నిజామాబాద్, ఖమ్మం, కామారెడ్డి జిల్లాల్లో అత్యధికంగా రోడ్లకు నష్టం జరిగింది. నిజామాబాద్‌లో 8 ప్రాంతాల్లో రోడ్లు తెగిపోగా, 41 చోట్ల నీట మునిగాయి. మొత్తం 49 చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి.
ఖమ్మం జిల్లాలో 34 చోట్ల రహదారులు నీట మునగడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. కామారెడ్డిలో ఏడుచోట్ల రోడ్లు తెగిపోగా, 20 ప్రాంతాల్లో నీట మునిగాయి. ములుగు జిల్లాలో ఒక వంతెనకు సంబంధించిన రెండు పిల్లర్లు దెబ్బతిన్నట్టు అధికారులు తెలిపారు. వర్షాలు తగ్గుముఖం పట్టకపోవడంతో రోడ్లు ఏఏ చోట్ల దెబ్బతిన్నాయో ఇంకా తెలియరాలేదని అధికార వర్గాలు తెలిపాయి. రాకపోకలు సాఫీగా సాగేందుకు 14 చోట్ల రోడ్లను పునరుద్ధరించినట్టు ఆర్అండ్బీ అధికారులు వెల్లడించారు.