హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): 2025లో ఏసీబీ 199 అవినీతి కేసులు నమోదు చేసినట్టు ఏసీబీ డీజీ చారుసిన్హా వెల్లడించారు. వాటిల్లో మొత్తం 273 మందిని అరెస్టు చేయగా, వారిలో 176 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నట్టు తెలిపారు. బుధవారం ఏసీబీ వార్షిక నివేదికను విడుదల చేసిన చారుసిన్హా.. మొత్తం 157 ట్రాప్ కేసులు నమోదు కాగా, 224 మంది నిందితులను అరెస్ట్ చేసినట్టు చెప్పారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి 15 కేసులు నమోదు చేసి, రూ.96,13,50,554 విలువైన అక్రమ ఆస్తులను వెలికితీశామని చెప్పారు. ఎవరైనా ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది లంచాలు అడిగితే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు, వాట్సాప్ నంబర్ 9440446106కు ఫిర్యాదు చేయాలని కోరారు. ఫేస్బుక్లో Telangana ACB, ఎక్స్‌లో @TelanganaACBలోనూ ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు. నేరుగానూ ఫిర్యాదు చేయవచ్చని చారుసిన్హా సూచించారు.