హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ) : డిప్యూటీ తహసీల్దార్లు(డీటీ), సీనియర్, జూనియర్ అసిస్టెంట్లకు జిల్లా స్థాయిలోనే బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని రెవెన్యూ శాఖ ఆదేశించింది. ఈ మేరకు సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్లు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. జిల్లా దాటి వెళ్లాలనుకునేవారి ప్రతిపాదనలను సీసీఎల్ఏకు పంపాలని సూచించారు. దీని నుంచి జోన్-6(చార్మినార్)ను మినహాయించారు.
ఈ జోన్ నుంచి వచ్చే దరఖాస్తులను సీసీఎల్ఏకు పంపాలని ఆదేశించారు. అదేవిధంగా బదిలీలపై నిషేధం ఎత్తివేసినందుకు ట్రెసా నేతలు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని కలిశారు. ఈ కార్యక్రమంలో ట్రెసా అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌతమ్ కుమార్, ఉపాధ్యక్షుడు నిరంజన్‌రావు తదితరులు పాల్గొన్నారు.