Ambedkar Statue | హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పోరాటాలతో రేవంత్ సర్కారు దిగొచ్చింది. కేసీఆర్ హయాంలో నెలకొల్పిన 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్బంధం ఎత్తేసింది. సోమవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుడి విగ్రహాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్‌తోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పలువురు ఉన్నతాధికారులు సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంతేగాకుండా సామాన్యులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులకు సైతం నివాళులర్పించే అవకాశం కల్పించారు.
కేసీఆర్ హయాంలో నిర్మించారనే కక్షతో అంబేద్కర్ విగ్రహాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకాలం నిర్లక్ష్యం చేస్తూ వచ్చింది. గడిచిన 15 నెలలుగా గేట్లకు తాళాలు వేసి అక్కడికి సందర్శకులు వెళ్లకుండా అడ్డుకున్నది. విగ్రహ ఆవరణను సైతం కనీసం శుభ్రం చేయకుండా అలక్ష్యం చేసింది.
కేసీఆర్ ఏర్పాటు చేశారనే ఏకైక కారణంతో అంబేద్కర్‌ను అవమానిస్తున్న కాంగ్రెస్ సర్కారు తీరును బీఆర్ఎస్ ఎండగడుతూ వచ్చింది. జయంతి సందర్భంగానైనా సందర్శనకు అవకాశం కల్పించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతోపాటు నేతలంతా డిమాండ్ చేస్తూవచ్చారు. శాసనసభ వేదికగా ప్రభుత్వ తీరును బీఆర్ఎస్ నేతలు ఎండగట్టారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే గేట్లను బద్దలు కొట్టుకొని వెళ్లి అంబేద్కర్‌కు నివాళులర్పిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో గత్యంతరం లేక ప్రభుత్వం దిగివచ్చి విగ్రహం వద్ద నిర్బంధాన్ని ఎత్తేసిందని ప్రజాసంఘాల నేతలు అభిప్రాయం వ్యక్తంచేశారు.