నాగర్‌కర్నూల్, మే 19: కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై రేవంత్ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిసున్నదని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ హయాంలో 90 శాతం పనులు పూర్తి చేసినా.. కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేండ్లలో తట్టెడు మట్టి ఎత్తలేదని విమర్శించారు.
నేడు బీఆర్ఎస్ పోరుబాటలో భాగంగా పాదయాత్ర చేపట్టాలన్న నిర్ణయంతో నిద్రలేచిన సర్కార్ సమీక్షకు సిద్ధమైందని ఎద్దేవాచేశారు. కాంగ్రెస్ అలసత్వం కారణంగా ప్రాజెక్టు వ్యయం పెరిగిపోతున్నదని, మిగిలిన 10 శాతం పూర్తిచేస్తే ఆ క్రెడిట్ అంతా కేసీఆర్‌కు దక్కుతుందన్న అక్కసుతో ఉద్దేశపూర్వకంగా పనులు చేపట్టడంలేదని ఆరోపించారు.
పాలమూరు బిడ్డనంటూ చెప్పుకొనే రేవంత్ ఒక్కనాడు కూడా పాలమూరు ప్రాజెక్టుల మీద సమీక్ష చేయలేదని మండిపడ్డారు. పనులు పూర్తయి ఉంటే నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెనలో 45 టీఎంసీల వరకు నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉండేదని చెప్పారు. పోరుబాట మొదలుపెట్టి ముగింపు కార్యక్రమానికి కేసీఆర్‌ను తీసుకురావాలని ప్రణాళికలు సిద్ధం చేయడంతో తమ తప్పిదాలు ఎక్కడ బయటపడతాయోనని మంగళవారం పాలమూరు ప్రాజెక్టులపై జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సీఎం సమీక్ష నిర్వహించారని విమర్శించారు. కేఎల్ఐలో పాడైపోయిన రెండు మోటర్లకు వెంటనే మరమ్మతులు చేపట్టి మొత్తం ఐదు మోటర్లు నడిచేలా చర్యలు తీసుకోవాలని కోరారు.